మహిళల సాంకేతిక సాధికారతకు రిలయన్స్‌ ఫౌండేషన్‌ చేయూత
close

Published : 29/09/2021 02:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహిళల సాంకేతిక సాధికారతకు రిలయన్స్‌ ఫౌండేషన్‌ చేయూత

ముంబయి: ‘ఉమెన్‌ కనెక్ట్‌ ఛాలెంజ్‌ ఇండియా’ ద్వారా దేశవ్యాప్తంగా 10 కంపెనీలకు రిలయన్స్‌ ఫౌండేషన్‌ నుంచి నిధులు వెళ్లనున్నాయి. యూఎస్‌ ఏజెన్సీ ఫర్‌ ఇంటర్నేషనల్‌ ఎయిడ్‌ (యూఎస్‌ఎయిడ్‌)తో కలిసి ఉమెన్‌ కనెక్ట్‌ ఛాలెంజ్‌ ఇండియాను రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా దేశంలో లింగ ఆధారిత డిజిటల్‌ వివక్షను తొలగించడం కోసం రూ.11 కోట్లు వినియోగించనున్నారు. ఇందులో రూ.8.5 కోట్లను రిలయన్స్‌ ఫౌండేషన్‌ సమకూర్చనుంది. ఈ ప్రక్రియలో వినూత్న పరిష్కారాలను రూపొందించే ప్రాజెక్టులకు ఈ మొత్తాన్ని అందిస్తారు. 17 రాష్ట్రాల్లో 3 లక్షల మందికి పైగా మహిళలు, బాలికలకు ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి, ఆర్థిక సాధికారత లభించనుందని రిలయన్స్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపక ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీ తెలిపారు. ‘యూఎస్‌ఎయిడ్‌తో కలిసి భారత్‌లో లింగ ఆధారిత డిజిటల్‌ వివక్షను పరిహరించే దిశగా పనిచేస్తున్నాం. మా ఉమెన్‌ కనెక్ట్‌ ఛాలెంజ్‌ ఇండియాలో ఎంపికైన 10 సంస్థలకు అభినందన’లని పేర్కొన్నారు. 2020లో మొదలైన ఆ ఛాలెంజ్‌కు 180 దరఖాస్తులు రాగా.. 10 ఎంపికయ్యాయి. అందులో.. అనుదీప్‌ ఫౌండేషన్‌, బేర్‌ఫుట్‌ కాలేజ్‌ ఇంటర్నేషనల్‌, సెంటర్‌ ఫర్‌ యూత్‌ అండ్‌ సోషియల్‌ డెవలప్‌మెంట్‌, ఫ్రెండ్స్‌ ఆఫ్‌ ఉమెన్స్‌ వరల్డ్‌ బ్యాంకింగ్‌, నాంది ఫౌండేషన్‌, ప్రొఫెషనల్‌ అసిస్టెన్స్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ యాక్షన్‌, సొసైటీ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆల్టర్నేటివ్స్‌, సాలిడారిడాడ్‌ రీజనల్‌ ఎక్స్‌పర్టయిజ్‌ సెంటర్‌, టీఎన్‌ఎస్‌ ఇండియా ఫౌండేషన్‌, జడ్‌ఎంక్యూ డెవలప్‌మెంట్‌లున్నాయి. ఈ 10 కంపెనీలకు 12-15 నెలలకు గాను రూ.75 లక్షల నుంచి రూ.కోటి చొప్పున ఇస్తారు. మహిళా రైతులు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, స్వయం సహాయక బృందాల సభ్యుల సమస్యలను; సామాజిక, సాంస్కృతిక అడ్డంకులను అధిగమించేందుకు ఈ సంస్థలు అందించే పరిష్కారాలు ఉపయోగపడనున్నాయి.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని