సంక్షిప్త వార్తలు
close

Published : 14/10/2021 02:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సంక్షిప్త వార్తలు

మైండ్‌ట్రీ లాభంలో 57% వృద్ధి

దిల్లీ: జులై-సెప్టెంబరు త్రైమాసికంలో మైండ్‌ట్రీ నికర లాభం 57.2 శాతం వృద్ధితో రూ.398.9 కోట్లకు చేరింది. ఏడాది క్రితం ఇదే మూడు నెలల్లో సంస్థ నికర లాభం రూ.253.7 కోట్లుగా నమోదైంది. కార్యకలాపాల ద్వారా నమోదైన ఏకీకృత ఆదాయం రూ.1,926 కోట్ల నుంచి 34.27 శాతం పెరిగి రూ.2,586.2 కోట్లకు చేరుకుంది. ‘రెండో త్రైమాసికంలో మా ఆదాయం 350.1 మిలియన్‌ డాలర్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 34.1%, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికంతో పోలిస్తే 12.7% ఇది ఎక్కువ. గత దశాబ్దకాలంలోనే అత్యధిక త్రైమాసిక వృద్ధి(క్రితం ఏడాదితో పోలిస్తే)ని నమోదు చేసింద’ని మైండ్‌ట్రీ సీఈఓ, ఎండీ, దేబాశీస్‌ ఛటర్జీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


పసిడి రుణాలపై వడ్డీ రేట్లు తగ్గింపు: పీఎన్‌బీ

ఈనాడు, హైదరాబాద్‌: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) బంగారు ఆభరణాల తనఖాపై ఇచ్చే రుణాల రేట్లను 145 బేసిస్‌ పాయింట్లు (1.45%) తగ్గించింది. సార్వభౌమ పసిడి బాండ్లను తాకట్టు పెట్టీ రుణం తీసుకునే వీలుంది. బంగారు ఆభరణాల తనఖాపై 7.30%, పసిడి బాండ్ల తనఖాపై 7.20% వడ్డీకి రుణం ఇస్తున్నట్లు బ్యాంకు ఒక ప్రకటనలో వెల్లడించింది. గృహరుణ వడ్డీ రేట్లనూ ప్రస్తుతం ఉన్న 7.15% నుంచి 6.60శాతానికి తగ్గిస్తున్నట్లు పేర్కొంది. వ్యక్తిగత రుణాలను 8.95 శాతం వడ్డీరేటుకే ఇస్తున్నట్లు వెల్లడించింది. పండగల సందర్భంగా రుణాలు తీసుకునేటప్పుడు సేవా, పరిశీలనా రుసుములను రద్దు చేస్తున్నట్లు బ్యాంకు ప్రకటించింది.


చైనాలో కేన్సర్‌ ఔషధాన్ని ఆవిష్కరించిన డాక్టర్‌ రెడ్డీస్‌

హైదరాబాద్‌: డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ చైనా విపణిలో కేన్సర్‌ ఔషధాన్ని (అబిరటెరోన్‌) ఆవిష్కరించి, భారత్‌ నుంచి తొలి ఫార్మా కంపెనీగా అవతరించిందని చైనాలో భారత రాయబారి విక్రమ్‌ మిస్రి పేర్కొన్నారు. ప్రొస్టేట్‌ కేన్సర్‌ చికిత్సలో ఉపయోగించే ఔషధం ‘అబిరటెరోన్‌ యాక్సెటేట్‌’ను అమెరికాలో గతేడాది ఆవిష్కరించగా, ఇప్పుడు చైనాలో ప్రవేశపెట్టింది. ఈ రంగంలో మరిన్ని విజయాలు నమోదు అవుతాయని అంచనా వేస్తున్నా’నంటూ విక్రమ్‌ బుధవారం ట్వీట్‌ చేశారు. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌కు చెందిన ‘జైటికా’కు థెరపాటిక్‌ జనరిక్‌ వర్షనే ఈ ఔషధం. రోటమ్‌ గ్రూప్‌ ఆఫ్‌ కెనడాతో కలిసి ఏర్పాటు చేసిన సంయుక్త సంస్థ కున్షన్‌రోటమ్‌ రెడ్డి ఫార్మా ద్వారా చైనాలో డాక్టర్‌ రెడ్డీస్‌ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.


శాశ్వతంగా ఇంటి నుంచే పని: అమెజాన్‌

దిల్లీ: టెక్‌, కార్పొరేట్‌ ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసే సౌలభ్యాన్ని నిరవధికంగా అనుమతించనున్నట్లు అమెజాన్‌ ప్రకటించింది. అయితే అవసరమైన సమయంలో వారు కార్యాలయానికి రావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. వచ్చే జనవరిలో కార్యాలయాలు మళ్లీ తెరుచుకున్నాక, ఉద్యోగులు వారానికి మూడు రోజుల పాటు ఆఫీసుకు రావాల్సి ఉంటుందని గతంలో భావించారు. అయితే ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసే విధానాన్ని కొనసాగించడానికే మొగ్గుచూపుతున్నట్లు బ్లాగ్‌లో నూతన విధానం ద్వారా అమెజాన్‌ ప్రకటించింది. దీనిపై సంస్థ సీఈఓ ఆండీ జాసీ సంతకం ఉన్నట్లు సియాటెల్‌ టైమ్స్‌ పేర్కొంది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని