అయిదో రోజూ రికార్డుల హోరు
close

Published : 14/10/2021 02:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అయిదో రోజూ రికార్డుల హోరు

సమీక్ష

18100 ఎగువకు నిఫ్టీ

సూచీలు వరుసగా అయిదో రోజూ రికార్డుల మోత మోగించాయి. వాహన, విద్యుత్‌, మౌలిక షేర్లు పరుగులు తీయడంతో సెన్సెక్స్‌, నిఫ్టీ కొత్త రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌ 452.74 పాయింట్ల లాభంతో 60,737.05 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 169.80 పాయింట్లు దూసుకెళ్లి 18,161.75 దగ్గర స్థిరపడింది. సూచీల జోరు నేపథ్యంలో మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ గత 5 ట్రేడింగ్‌ రోజుల్లో రూ.8.52 లక్షల కోట్లు పెరిగి రికార్డు గరిష్ఠమైన రూ.270.73 లక్షల కోట్లకు చేరింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 15 పైసలు పుంజుకుని 75.37 వద్ద ముగిసింది.

టాటా మోటార్స్‌ అదుర్స్‌: విద్యుత్‌ వాహన విభాగంలో టీపీజీ రైజ్‌ క్లైమేట్‌ రూ.7500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించడంతో టాటా మోటార్స్‌ షేరు అదరగొట్టింది. ఇంట్రాడేలో 23.56% దూసుకెళ్లిన షేరు రూ.519.95 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 20.43% లాభంతో రూ.506.75 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ  రూ.28,538.6 కోట్లు పెరిగి రూ.1,68,256.60 కోట్లుగా నమోదైంది. కొవిడ్‌ తొలిదశ సమయంలో 2020 ఏప్రిల్‌ 3న టాటామోటార్స్‌ షేరు రూ.65.30 వద్ద ముగియగా, ఇప్పుడు ఇంతగా పెరిగి మదుపర్లకు గణనీయ లాభాలు పంచింది.

* సెన్సెక్స్‌ 30 షేర్లలో 22 లాభపడ్డాయి. ఎం అండ్‌ ఎం 5.17%, పవర్‌గ్రిడ్‌ 3.41%, ఐటీసీ 3.34%, ఎల్‌ అండ్‌ టీ 2.34%, టెక్‌ మహీంద్రా     2.09%, టాటా స్టీల్‌ 1.90%, టైటన్‌ 1.71%, సన్‌ఫార్మా 1.62%, ఇన్ఫోసిస్‌ 1.42%, అల్ట్రాటెక్‌ 1.29% లాభపడ్డాయి. మారుతీ 2.71%, హెచ్‌యూఎల్‌ 1.05%, నెస్లే 0.64% చొప్పున డీలాపడ్డాయి. రంగాల వారీ సూచీల్లో వాహన, యుటిలిటీస్‌, పరిశ్రమలు, విద్యుత్‌ 3.46% వరకు పెరిగాయి. స్థిరాస్తి మాత్రం తగ్గింది.

రిలయన్స్‌ జీ 17 లక్షల కోట్లు: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌ విలువ రూ.17 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించింది. ఇంట్రాడేలో 1.90 శాతం పెరిగిన షేరు రూ.2,719.50 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 1.02 శాతం లాభంతో రూ.2695.90 వద్ద ముగిసింది. ఫలితంగా కంపెనీ మార్కెట్‌ విలువ రూ.17.09 లక్షల కోట్లుగా నమోదైంది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని