రిలయన్స్‌ చేతికి నెక్స్‌వేఫ్‌
close

Published : 14/10/2021 02:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రిలయన్స్‌ చేతికి నెక్స్‌వేఫ్‌

డెన్మార్క్‌ కంపెనీతోనూ ఒప్పందం
కొద్ది రోజుల కిందటే రెండు కొనుగోళ్లు

భారత హరిత ఇంధన రంగంలో వేగంగా అడుగులు వేసేందుకే నెక్స్‌వేఫ్‌లో పెట్టుబడులు పెట్టాం. ఫొటోవోల్టాయిక్‌ సెల్స్‌ తయారీలో అంతర్జాతీయ శక్తిగా భారత్‌ను మార్చబోతున్నాం. స్టీస్‌డేల్‌తో ఒప్పందం వల్ల భారత మార్కెట్లో పర్యావరణ సాంకేతికత పోర్ట్‌ఫోలియోకు సేవలందించడానికి వీలవుతుంది. వచ్చే దశాబ్దంలో కిలో హైడ్రోజన్‌ ధరను ప్రస్తుత 5 డాలర్ల నుంచి 1 డాలరుకు తగ్గించాలన్న కంపెనీ లక్ష్యానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది.

- ముకేశ్‌ అంబానీ, ఛైర్మన్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌

దిల్లీ: ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ హరిత ఇంధన రంగంలో మరిన్ని ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. తాజాగా జర్మనీకి చెందిన ఫొటోవోల్టాయిక్‌ సోలార్‌ వేఫర్స్‌ తయారీ కంపెనీని కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. హైడ్రోజన్‌ ఎలక్ట్రోలైజర్స్‌ తయారీ నిమిత్తం ఒక డానిష్‌ కంపెనీతో ఒప్పందంపై సంతకాలు చేసింది.

రూ.218 కోట్లతో నెక్స్‌వేఫ్‌ సొంతం: నెక్స్‌వేఫ్‌ జీఎమ్‌బీహెచ్‌ను 25 మిలియన్‌ యూరోల(దాదాపు రూ.218 కోట్లు)తో తమ అనుబంధ సంస్థ రిలయన్స్‌ న్యూ ఎనర్జీ సోలార్‌(ఆర్‌ఎన్‌ఈఎస్‌ఎల్‌) ద్వారా కొనుగోలు చేయనున్నట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వెల్లడించింది.

స్టీస్‌డేల్‌తో ఒప్పందం: హైడ్రోలైజర్స్‌ తయారీ నిమిత్తం డెన్మార్క్‌కు చెందిన స్టీస్‌డేల్‌ ఏ/ఎస్‌ సాంకేతికతను పొందడానికి సైతం రిలయన్స్‌ ఒప్పందం చేసుకుంది. తద్వారా భారత్‌లో హైడ్రోజన్‌ ఎలక్ట్రోలైజర్స్‌ తయారు చేస్తుంది. ఈ భాగస్వామ్యం ద్వారా భవిష్యత్‌లో ఫ్యూయల్‌ సెల్స్‌ తయారీ సాంకేతికతనూ పొందడానికి వీలవుతుంది.

ఎందుకు ఈ ఒప్పందాలంటే..

మూడు రోజుల కిందట నార్వేకు చెందిన సౌర ప్యానెళ్ల తయారీ కంపెనీ ఆర్‌ఈసీ సోలార్‌ హోల్డింగ్స్‌ను 771 మిలియన్‌ డాలర్లతో కొనుగోలు చేయనున్నట్లు రిలయన్స్‌ ప్రకటించింది. షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌నకు చెందిన స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ సోలార్‌లో 40 శాతం వాటానూ కొనుగోలు చేసింది. హరిత ఇంధనం కోసం తలపెట్టిన గిగా ఫ్యాక్టరీల కోసం సాంకేతికతను, నైపుణ్యాన్ని సంస్థ పెంచుకుంటోంది. తయారీ వ్యయాలను ఈ సాంకేతికతల ద్వారా తగ్గించుకోనున్నట్లు రిలయన్స్‌ పేర్కొంది. (సంప్రదాయ వేఫర్లతో పోలిస్తే నెక్స్‌వేఫ్‌కు చెందిన వేఫర్లు 30 శాతం తక్కువ వ్యయాలకే అందుతాయి).  


ఎంటర్‌టైన్‌మెంట్‌తో విలీన ప్రతిపాదన వెనక్కి
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ స్పష్టీకరణ

కొద్ది నెలల కిందట కంపెనీకి చెందిన మీడియా ఆస్తులను జీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో విలీనం చేయాలని ప్రతిపాదించినా, జీ వ్యవస్థాపకుల పాత్ర విషయంలో తలెత్తిన విభేదాల నేపథ్యంలో ఉప సంహరించుకున్నామని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ స్పష్టం చేసింది. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను తిరిగి పుంజుకునేలా రిలయన్స్‌ చేస్తుందంటూ ఆ గ్రూప్‌నకు చెందిన అతిపెద్ద వాటాదారు(అమెరికా పెట్టుబడుల కంపెనీ ఇన్వెస్కో) ప్రకటించిన కొద్ది గంటల్లోనే రిలయన్స్‌ పై విధంగా స్పందించింది.  

‘ఈ ఏడాది ఫిబ్రవరి/మార్చిలో మా ప్రతినిధులకు, జీ వ్యవస్థాపక కుటుంబ సభ్యుడు, ఎండీ పునీత్‌ గోయెంకా మధ్య ప్రత్యక్ష చర్చలను ఏర్పాటు చేయడంలో ఇన్వెస్కో సహకరించింది. మా మీడియా ఆస్తులను సరైన విలువ వద్ద జీతో విలీనం చేయాలని అప్పట్లో భావించాం. ఇరు వర్గాలకు మెరుగైన విలువ అందేలా ప్రతిపాదనలు చేశాం. గోయెంకాతో పాటు ప్రస్తుత యాజమాన్యాన్ని కొనసాగించాలని భావించాం. వారికి ఇసాప్స్‌ (ఎంప్లాయీ స్టాక్‌ ఆప్షన్స్‌) జారీ చేయాలని ప్రతిపాదించాం.ఇన్వెస్కో మాత్రం గోయెంకాను తొలగించాలని కోరింది. గోయెంకా, ఇన్వెస్కోల మధ్య భేదాభిప్రాయాలు పెరుగుతూనే వచ్చాయి. మేం అందరు వ్యవస్థాపకులను గౌరవిస్తాం. ఎటువంటి ఇబ్బందికర లావాదేవీలను కోరుకోం. అందుకే ఆ ప్రతిపాదన నుంచి విరమించుకుంటున్నామ’ని ఆ ప్రకటనలో పేర్కొంది.

అంతక్రితం ఏం జరిగిందంటే..: రిలయన్స్‌తో చర్చించిన షరతులతోనే, సోనీఇండియాతోనూ చర్చలు జరిగినా.. సోనీతో విలీనానికి వ్యతిరేకించామన్న జీ ఆరోపణలను ఇన్వెస్కో ఖండించింది. రిలయన్స్‌తో లావాదేవీ కుదిర్చేందుకు ప్రయత్నించామని, అంతకు మించి ఏమీ లేదని ఇన్వెస్కో వెల్లడించింది. రిలయన్స్‌ పేరును వెల్లడించకుండా.. ఒక ‘అతిపెద్ద కంపెనీ’తో ఒప్పందం జరిగితే వాటాదార్లకు నష్టం కలుగుతుందని.. ఈ విషయంలో ఇన్వెస్కోపై గోయెంకా మంగళవారం నాడు అనుమానం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. గోయెంకా, ఇతర బోర్డు సభ్యులను తొలగించడానికి వాటాదార్ల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఇన్వెస్కో కోరుతూ వస్తోంది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని