యువ కుబేరులు
close

Published : 14/10/2021 06:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యువ కుబేరులు

40 ఏళ్ల లోపే స్వయంకృషితో ఈ స్థాయికి
ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌, హురున్‌ జాబితా

దిల్లీ: నాలుగు పదుల వయసులోపే స్వయంకృషితో కుబేరులుగా మారిన వ్యాపారవేత్తల జాబితాను ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌, హురున్‌ ఇండియా టుడే రూపొందించాయి. 40 ఏళ్ల లోపు వయసులోనే ఔత్సాహిక వాణిజ్యవేత్తల స్థాయి నుంచి రూ.1000 కోట్లు, అంతకుమించి సంపద కలిగిన వారిని ఇందులో చేర్చారు. మొదటి 10 స్థానాల్లో నిలిచిన వారి వివరాలు..

1) దివ్యాంక్‌ తురాఖియా: మీడియా డాట్‌ నెట్‌ అధిపతి అయిన 39 ఏళ్ల దివ్యాంక్‌ రూ.12,500 కోట్ల సంపదతో అగ్రస్థానంలో నిలిచారు.

2) నకుల్‌ అగర్వాల్‌: క్లౌడ్‌ వెబ్‌, మొబైల్‌ టెస్టింగ్‌ ప్లాట్‌ఫామ్‌ బ్రౌజర్‌స్టాక్‌ సహ వ్యవస్థాపకుడు, సీటీఓ అయిన నకుల్‌ రెండో స్థానం పొందారు. ఆయన సంపద విలువ రూ.12,400 కోట్లు.

3) రితేశ్‌ అరోరా: బ్రౌజర్‌ స్టాక్‌ వ్యవస్థాపకుల్లో ఒకరు, ప్రస్తుత సీఈఓ అయిన రితేశ్‌ రూ.12,400 కోట్ల సంపదతో మూడో స్థానంలో ఉన్నారు.

4) నేహ నర్కాడే, కుటుంబం: సాఫ్ట్‌వేర్‌ సంస్థ కాన్‌ఫ్లూయెంట్‌ సహ వ్యవస్థాపకురాలు, హెడ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ నేహ నర్కాడే, కుటుంబం రూ.12,200 కోట్ల సంపదతో నాలుగో స్థానం దక్కించుకున్నారు.

5) నిఖిల్‌ కామత్‌: సంఖ్యా పరంగా భారత్‌లోనే అతిపెద్ద ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అయిన జెరోధా వ్యవస్థాపకుల్లో ఒకరైన 35 ఏళ్ల నిఖిల్‌ కామత్‌ రూ.11,100 కోట్ల సంపదతో 5వ స్థానం పొందారు.

6) రిజు రవీంద్రన్‌: ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ ప్లాట్‌ఫామ్‌ బైజూ స్థాపకుడు రిజు రవీంద్రన్‌ ఆరో స్థానంలో ఉన్నారు. ఆయన మొత్తం సంపద రూ.8,100 కోట్లు.

7,8) బిన్నీ బన్సల్‌, సచిన్‌ బన్సల్‌: ఫ్లిప్‌కార్ట్‌ వ్యవస్థాపకులు బిన్నీ బన్సల్‌ రూ.8000 కోట్లు, సచిన్‌ బన్సల్‌ రూ.7800 కోట్లు సంపదతో  7, 8 స్థానాల్లో నిలిచారు.

9) భవీశ్‌ అగర్వాల్‌: ఓలా మాతృసంస్థ ఏఎన్‌ఐ టెక్నాలజీస్‌ను నెలకొల్పిన భవీశ్‌ అగర్వాల్‌ రూ.7500 కోట్లతో 9వ స్థానం దక్కించుకున్నారు. 2021లో ఆయన సంపద విలువ 114 శాతం పెరిగింది.

10) రితేశ్‌ అగర్వాల్‌: ఆతిథ్య సేవల సంస్థ ఓయో అధిపతి రితేశ్‌ అగర్వాల్‌ సంపద 40 శాతం పెరిగి    రూ.6300 కోట్లకు చేరగా, పదో స్థానం పొందారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని