మార్చి చివరి కల్లా బీపీసీఎల్‌, ఎల్‌ఐసీల్లో వాటా విక్రయం
close

Published : 17/10/2021 01:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మార్చి చివరి కల్లా బీపీసీఎల్‌, ఎల్‌ఐసీల్లో వాటా విక్రయం

బీఈఎంఎల్‌, పవన్‌హన్స్‌ సహా మరికొన్ని సంస్థల్లో కూడా
రైల్వేల అనుమతి లభించాకే..  కాంకర్‌ ప్రక్రియ ముందుకు
ప్రధానేతర ఆస్తుల విక్రయానికి ప్రత్యేక సంస్థ
ఇంటర్వ్యూ
దీపమ్‌ కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే

దిల్లీ

ఎయిరిండియాలో వాటా విక్రయ ప్రక్రియను ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది. ఇప్పుడు మరో రెండు దిగ్గజ సంస్థలు బీపీసీఎల్‌, లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో వాటా విక్రయాన్ని ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా పూర్తి చేసే లక్ష్యంతో ఉంది. వీటితో పాటు బీఈఎంఎల్‌, షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, సెంట్రల్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌, నీలాచల్‌ ఇస్పాత్‌ నిగమ్‌, పవన్‌ హన్స్‌లో వాటా విక్రయాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలోనే చేపట్టే అవకాశం ఉందని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్‌) కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే తెలిపారు. వచ్చే జనవరి- మార్చి త్రైమాసికంలో ఎల్‌ఐసీ ఐపీఓను నిర్వహించే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని తెలిపారు. ఇంకా ఆయన ఏం చెప్పారంటే..

ఎయిరిండియా వాటా విక్రయ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. ఇప్పుడు మీరు పూర్తి చేయాలని అనుకుంటున్న అతిపెద్ద వాటా విక్రయ ప్రక్రియ ఏది
ప్రస్తుతం ఒకేసారి పలు వాటా విక్రయ ప్రక్రియలను పూర్తి చేయడంపై మేం కసరత్తు చేస్తున్నాం. బడ్జెట్‌ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా అన్నింటిపైనా ఒకేసారి దృష్టి పెట్టమని సూచించారు కూడా. బీపీసీఎల్‌, సెంట్రల్‌ ఎలక్ట్రానిక్స్‌, బీఈఎంఎల్‌, షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, నీలాచల్‌ ఇస్పాత్‌ నిగమ్‌, పవన్‌ హన్స్‌ల్లో వాటా విక్రయ ప్రక్రియలు ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఉండే అవకాశం ఉంది. ఈ లావాదేవీలన్నింటినీ నిర్దేశిత సమయంలోగా పూర్తి చేస్తామనే నమ్మకం ఉంది.

ప్రస్తుతం ఏయే సంస్థలకు.. ఎన్నెన్ని బిడ్‌లు వచ్చాయి? మిగతా సంస్థలకు ఎప్పుడు బిడ్‌లను ఆహ్వానించనున్నారు
సెంట్రల్‌ ఎలక్ట్రానిక్స్‌కు ఇప్పటికే బిడ్‌లను ఆహ్వానించాం. మిగతా సంస్థల ప్రతిపాదనలు పరిశీలన దశలో ఉన్నాయి. ఆ ప్రక్రియ పూర్తయితే ఆ సంస్థలకు కూడా బిడ్‌లను ఆహ్వానిస్తాం.

కంటెయినర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో  (కాంకర్‌) వ్యూహాత్మక వాటా విక్రయ ప్రక్రియ ఈ ఏడాదిలో పూర్తయ్యే అవకాశం ఉందా
లేదు. ఈ సంవత్సరంలో జరగదు. ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రస్ట్‌ ప్రక్రియ పూర్తయ్యేందుకే 9-12 నెలల సమయం పడుతుంది. ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రస్ట్‌ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం అవుతుందని అనుకుంటున్నాం. అయితే రైల్వేల చేతిలో ఈ విధాన ప్రక్రియ ముడిపడి ఉంది. మేం వాళ్లను అభ్యర్ధించాం. వాళ్లు సరే అంటే.. వెంటనే ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తాం.

ప్రస్తుతం అందరి దృష్టి ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూపైనే ఉంది. ఈ ప్రక్రియ ఎక్కడ వరకు వచ్చింది.
ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో దీనిని ముగించాలని అనుకుంటున్నాం. అన్ని పనులు చకాచకా జరుగుతున్నాయి. సెబీకి సమర్పించే ఐపీఓ డీఆర్‌హెచ్‌ఎస్‌ను రూపొందించడం పూర్తయ్యింది. అకౌంట్స్‌ లెక్కలు అయిపోయాయి. విలువకట్టడం జరుగుతోంది. అయితే ఎల్‌ఐసీ పరిమాణం రీత్యా దీనికి కొంత సమయం పడుతోంది. అయినప్పటికీ త్వరగానే పూర్తవుతుంది.

ఎల్‌ఐసీ ఐపీఓలో ఎంత వాటా విక్రయించాలనే విషయంపై ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకుందా
ఇది కంపెనీ విలువ పైన ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడూ ఎల్‌ఐసీ విలువను లెక్కగట్టలేదు. అయితే పూర్తిగా నిధుల సమీకరణ కోణంలోనే దీనిని చూడాలని అనుకోవడం లేదు. అదే సమయంలో నిధుల సమీకరణపరంగా కూడా ఇది ఎంతో ముఖ్యమైన లావాదేవీ. వాటా ఉపసంహరణ లక్ష్యాన్ని చేరేందుకు బీపీసీఎల్‌, ఎల్‌ఐసీలో వాటా విక్రయాలు ఎంతో కీలకం. ఇవేకాకుండా ప్రతి ఒక్క లావాదేవీ కూడా మాకు ముఖ్యమే.

ఆస్తుల విక్రయం నిమిత్తం తీసుకొని రానున్న స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ ఏర్పాటు ఎక్కడ వరకు వచ్చింది
స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ (ఎస్‌పీవీ) ఏర్పాటుపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నాం. ప్రధానేతర ఆస్తుల విక్రయ ప్రక్రియను ఇది చేపడుతుంది. ఎస్‌పీవీ ఒక స్వతంత్ర సంస్థగా.. ఈ ఆస్తుల విక్రయ ప్రక్రియను నిర్వహిస్తుంది.

స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ను ఎప్పుడు ఏర్పాటు చేయనున్నారు
కేబినెట్‌ అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాం. ఈ అనుమతులు వచ్చిన వెంటనే.. స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ను ఏర్పాటు చేస్తాం.

ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణ ప్రక్రియ ప్రస్తుతం ఏ దశలో ఉంది
డిసెంబరు కల్లా ఆసక్తిగల అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నాం. అయితే అంతకంటే ముందు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కొన్ని అంశాల్లో లేవనెత్తిన అభ్యంతరాలను పరిష్కరించుకోవాల్సి ఉంది. ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రస్ట్‌కు సంబంధించి ప్రతిపాదిత షరతులు, నియమ నిబంధనలను ఆర్‌బీఐకు తెలియజేయనున్నాం. వీటికి ఆర్‌బీఐ ఆమోదం తెలిపితే.. ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తాం.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని