కర్బన ఉద్గారాల నుంచి విముక్తి ఎలా!
close

Published : 17/10/2021 01:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కర్బన ఉద్గారాల నుంచి విముక్తి ఎలా!

2070 నాటికి 5,600 గిగావాట్ల సౌరవిద్యుత్తు సామర్థ్యం అవసరం
మనదేశానికి ఇప్పుడున్నది 100 గిగావాట్లే
పట్టుదలగా ప్రయత్నిస్తేనే లక్ష్యసాధన
ఈనాడు - హైదరాబాద్‌

ర్బన ఉద్గారాల నుంచి మనదేశానికి పూర్తి విముక్తి లభించాలంటే ఏం చేయాలి? కాలుష్యాన్ని పెద్దఎత్తున వెదజల్లుతున్న థర్మల్‌ విద్యుత్కేంద్రాలకు ప్రత్యామ్నాయం ఏమిటి? ఈ అంశంలో కౌన్సిల్‌ ఆన్‌ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ వాటర్‌ (సీఈఈడబ్ల్యూ) నిర్వహించిన తాజా అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. మనదేశం కర్బన ఉద్గారాలను పూర్తిగా నిర్మూలించాలంటే, 2070 నాటికి 5,630 గిగావాట్ల (1 గిగావాట్‌= 1,000 మెగావాట్లు)  సౌరవిద్యుత్తు సామర్థ్యాన్ని సమకూర్చుకోవాలని ఈ సంస్థ విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది. దీనికి మనదేశ భూభాగంలోని 4.6% భూమి కావాలి. అంతేగాక సౌర విద్యుత్తు పలకలను రీసైకిల్‌ చేయటానికి అవసరమైన సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానం, సామర్థ్యాన్ని  సమకూర్చుకోవాల్సి వస్తుంది.

ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల సదస్సు ఈ నెలాఖరులో యూకేలోని గ్లాస్‌గో లో మొదలు కానుంది. 197 దేశాల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు. కర్బన ఉద్గారాలను పూర్తిగా నిర్మూలించటానికి ఒక్కో దేశం ఎటువంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో... ఈ సదస్సులో చర్చించి స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశిస్తారు. దానికి తగ్గట్లుగా ఆయా దేశాల ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపధ్యంలో మనదేశంలోని పరిస్థితిపై సీఈఈడబ్ల్యూ నిర్వహించిన అధ్యయనం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

మనదేశానికి ప్రస్తుతం 100 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన వనరుల సామర్థ్యం ఉంది. ఇందులో సౌరవిద్యుత్తు వాటా 40 గిగావాట్లు. దీన్ని 2030 నాటికి 450 గిగావాట్లకు పెంచుకోవాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది. కర్బన ఉద్గారాల నుంచి 2070 నాటికైనా మనదేశం పూర్తిగా బయటపడాలంటే, ధర్మల్‌ విద్యుత్తు కేంద్రాల్లో కానీ, ఫ్యాక్టరీల్లో కానీ బొగ్గు వినియోగాన్ని నిలుపుదల చేయాలి. 2060 నాటికే ఈ పని చేయాల్సి ఉంటుందని నివేదిక పేర్కొంది. ముడి చమురు వినియోగం 2050 తర్వాత పెరగకూడదు. 2050 నుంచి 2070 మధ్యకాలంలో ముడిచమురు వినియోగాన్ని 90% తగ్గించాలి. అదే సమయంలో గ్రీన్‌-హైడ్రోజన్‌ వినియోగాన్ని పెంపొందించటం అవసరం. ఈ లక్ష్యాల సాధనకు అయ్యే ఖర్చు ఎంతో ఎక్కువ. ఇది 2070లో మనదేశ జీడీపీలో 4.1 శాతానికి సమానంగా ఉంటుంది. అయితే 2050 నాటికే ఈ లక్ష్యాన్ని సాధించాలనుకుంటే, 2050లో మనదేశం జీడీపీలో 7 శాతానికి సమానమైన మొత్తాన్ని ఖర్చు చేయాల్సి వస్తుంది. అంతేగాక ఈ మార్పు సాధించే  క్రమంలో విద్యుత్తు వ్యయాలు ఒక్కసారిగా పెరిగే ప్రమాదం పొంచి ఉంటుంది.

భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న పెద్ద దేశాలు 2050 లేదా 2070 వరకు ఎదురుచూడకుండా ముందుగానే కర్బన ఉద్గారాలను కనిష్ఠ స్థాయికి తగ్గించుకోవటానికి ప్రయత్నించాల్సిన అవసరం ఉందనే వాదన కూడా ఉంది. దీనికి అవసరమైన సాంకేతిక సహకారాన్ని, ఆర్థిక వనరులను అభివృద్ధి చెందిన దేశాలు సమకూర్చాలని పర్యావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 197 దేశాలకు గానూ, పూర్తిగా కర్బన ఉద్గారాలను నిర్మూలించటానికి 125 దేశాలు ముందుకు వచ్చాయి. భారత్‌ మాత్రం కర్బన ఉద్గారాల పూర్తి నిర్మూలనకు ఇంకా అంగీకారాన్ని తెలియజేయలేదు.

కానీ ఈ దిశగా ముందుకు సాగక తప్పనిసరి పరిస్థితి ఉందనేది నిర్వివాదాంశం. అందుకే సౌర విద్యుత్తు, ఇతర పునరుత్పాదక ఇంధన వనరులకు ప్రోత్సాహమిస్తూనే, ఇటీవల ‘నేషనల్‌ హైడ్రోజన్‌ మిషన్‌’ను ప్రభుత్వం ప్రకటించింది. ఇంధన వినియోగంలో హైడ్రోజన్‌ వాటా పెంచాలనేది ఈ కార్యక్రమ లక్ష్యం. అయితే దీనికి పెద్దఎత్తున నిధులు కేటాయించి, పరిశోధన- అభివృద్ధి కార్యకలాపాలను వేగవంతం చేస్తేనే అనుకున్న లక్ష్యాలను ఎంతోకొంత సాధించే అవకాశం ఉంటుంది. అలాంటి పట్టుదలను ప్రభుత్వం కొనసాగిస్తేనే సానుకూల ఫలితాలు కనిపిస్తాయి.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని