ఈసారీ లాభ వారమే
close

Updated : 18/10/2021 02:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈసారీ లాభ వారమే

సానుకూలతలు కొనసాగొచ్చు
బ్యాంకింగ్‌ షేర్లు నడిపిస్తాయ్‌
లోహ, సిమెంటు స్క్రిప్‌లూ రాణించొచ్చు
కార్పొరేట్‌ ఫలితాలు కీలకం
విశ్లేషకుల అంచనాలు  
స్టాక్‌ మార్కెట్‌
ఈ వారం

దేశీయ సూచీలు గత వారం లాభాలను నమోదు చేయడంతో పాటు సరికొత్త మైలురాళ్లను చేరడంతో.. సానుకూలతలు ఈ వారమూ కొనసాగొచ్చని విశ్లేషకులు అంటున్నారు. నిఫ్టీ-50 తన కీలక నిరోధ స్థాయి అయిన 18,300 కంటే పైనే ముగియడం కలిసిరావొచ్చంటున్నారు. బ్యాంకు షేర్లు ముందుండి ఈ సానుకూల ధోరణిని నడిపిస్తాయని, బ్యాంక్‌ నిఫ్టీ 40,000 స్థాయికి చేరే అవకాశాలున్నాయని సాంకేతిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతవారం మార్కెట్లు ముగిశాక విడుదలైన హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఫలితాలతో పాటు అల్ట్రాటెక్‌, హెచ్‌యూఎల్‌, నెస్లే, ఎల్‌ అండ్‌ టీ టెక్నాలజీ సర్వీసెస్‌, ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌ వంటి ఈ వారం విడుదలయ్యే కంపెనీల ఫలితాల శైలిని మదుపర్లు గమనించొచ్చు. వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

* బ్యాంకు షేర్లలో ఎంపిక చేసిన వాటిలో చలనాలుంటాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఆస్తుల నాణ్యత, రుణ వృద్ధిని బట్టి ఇతర బ్యాంకుల ఫలితాల ధోరణులను మదుపర్లు అంచనా వేస్తారు. సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌ 21న, యెస్‌ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌లు 22న ఫలితాలను ప్రకటించనున్నాయి.

* సిమెంటు ధరలు పెరుగుతాయన్న అంచనాల మధ్య సిమెంటు కంపెనీల షేర్లు సానుకూలంగా కదలాడొచ్చు. సోమ, మంగళ వారాల్లో వెలువడే అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఏసీసీ షేర్లు వెలుగులోకి రావొచ్చు.  

* ఫలితాల నేపథ్యంలో ఔషధ షేర్లు చాలా తక్కువ శ్రేణికి లోబడి చలించొచ్చు. బయోకాన్‌, గ్లాండ్‌ ఫార్మా కంపెనీలు ఈ వారం ఫలితాలను వెల్లడించనున్నాయి.

* ఈ వారం కూడా లోహ, గనుల కంపెనీలు సానుకూలతలను కొనసాగించే అవకాశం ఉంది. నిఫ్టీ లోహ సూచీ జీవన కాల గరిష్ఠానికి చేరింది. వరుసగా మూడో వారమూ లాభాలతో ముగిసింది. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ ఫలితాలు 21న వెలువడనున్నాయి.

* మంగళవారం వెలువడే హిందుస్థాన్‌ యునిలీవర్‌, నెస్లే ఇండియా ఫలితాల నుంచి ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీల షేర్లు సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు.  

* ఐటీ దిగ్గజ కంపెనీల ఫలితాలు ఇప్పటికే వెల్లడికాగా, ఈ వారం ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌, ఎల్‌ అండ్‌ టీ టెక్నాలజీ సర్వీసెస్‌ ఫలితాలపై మదుపర్లు దృష్టి సారించొచ్చు. హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు వెలుగులోకి రావొచ్చు.

* టెలికాంకు సంబంధించి భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు లాభాల్లో; వొడాఫోన్‌ ఐడియా స్క్రిప్‌ స్తబ్దుగా కొనసాగొచ్చు. మొబైల్‌ ఆదాయాలు, సగటు వినియోగదారు ఆదాయాల విషయంలో జూన్‌ త్రైమాసికంతో పోలిస్తే సెప్టెంబరు త్రైమాసికంలో ఎయిర్‌టెల్‌ రాణించొచ్చు.  

* ఫలితాల నేపథ్యంలో యంత్ర పరికరాల షేర్లు చాలా తక్కువ శ్రేణికి లోబడి చలించొచ్చు. సమయానికి ప్రాజెక్టులు పూర్తవుతుండడం; ఆర్డర్ల పుస్తకంలో మెరుగైన వృద్ధి కారణంగా ఈ రంగంపై విశ్లేషకులు సానుకూలంగా ఉన్నారు.  

* చమురు కంపెనీల షేర్లు స్థిరీకరణకు గురికావొచ్చు. అంతర్లీనంగా సానుకూలతలు కనిపిస్తున్నాయి. రిఫైనరీలతో పోలిస్తే అప్‌స్ట్రీమ్‌ కంపెనీలు రాణించే అవకాశం ఉంది. వినియోగం కంటే సరఫరా తక్కువగా ఉన్నందున, ముడి చమురుకు గిరాకీ - ధరలు పెరగొచ్చు.  

* వాణిజ్య-ద్విచక్ర వాహన కంపెనీలపై మదుపర్లు ఆసక్తి చూపొచ్చు. పండగలు, విద్యాసంస్థల పునఃప్రారంభాన్ని దృష్టిలో ఉంచుకుని 2 నెలలకు సరిపడానిల్వల్ని డీలర్లు ఉంచుకున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని