అమెరికా వాణిజ్య ఏజెన్సీకి అధిపతిగా తెలుగు వ్యక్తి
close

Published : 19/10/2021 02:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమెరికా వాణిజ్య ఏజెన్సీకి అధిపతిగా తెలుగు వ్యక్తి

వాషింగ్టన్‌: అమెరికాలో మరో భారతీయుడు అందులోనూ తెలుగు వ్యక్తి ఉన్నత స్థానాన్ని పొందారు. వాణిజ్య, సంబంధిత అంశాల విషయాలపై పనిచేసే ప్రభుత్వ విభాగం అయిన యూఎస్‌ ట్రేడ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ(యూఎస్‌టీడీఏ)కి డిప్యూటీ డైరెక్టర్‌, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసరు(సీఓఓ)గా వినయ్‌ తుమ్మలపల్లిని నియమిస్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగాలను సృష్టించే వ్యాపార పెట్టుబడులను అమెరికాలోకి రప్పించడం కోసం అమెరికా వాణిజ్య శాఖ ఏర్పాటు చేసిన ‘సెలెక్ట్‌యూఎస్‌ఏ’కు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా 2013-17 సంవత్సరాలలో వినయ్‌(66 ఏళ్లు) పనిచేశారు. ఈయన్ను యూఎస్‌టీడీఏ డైరెక్టర్‌గా సెనేట్‌ ధ్రువీకరించేంత వరకు తాత్కాలిక డైరెక్టర్‌గా ఉంటారని యూఎస్‌టీడీఏ పేర్కొంది. బెలిజ్‌కు అమెరికా రాయబారిగా 2009-13 మధ్య వినయ్‌ బాధ్యతలు నిర్వహించారు. అమెరికా చరిత్రలోనే తొలి భారతీయ అమెరికన్‌ రాయబారిగా అప్పట్లో ఆయన పేరు మారుమోగింది. ‘యూఎస్‌టీడీఏకు ఆధ్వర్యం వహించడం గౌరవంగా భావిస్తున్నాను. దీనికి అసాధారణ వృత్తినిపుణుల బృందం ఉంది. ఎగుమతుల ద్వారా, ఆర్థిక వృద్ధికి మద్దతు ఇవ్వడం ద్వారా అమెరికాలో ఉద్యోగాలను సృష్టించే లక్ష్యంతో ఇది పనిచేస్తోంద’ని వినయ్‌ పేర్కొన్నారు. ప్రైవేటు రంగంలో 30 ఏళ్లకు పైగా తుమ్మలపల్లికి అనుభవం ఉందని యూఎస్‌టీడీఏ ఈ సందర్భంగా తెలిపింది. హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే సైయెంట్‌ బోర్డు సభ్యుడిగా కూడా వినయ్‌ ఉన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని