పబ్లిక్‌ ఇష్యూల సందడి
close

Published : 19/10/2021 02:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పబ్లిక్‌ ఇష్యూల సందడి

పెన్నా సిమెంట్‌ సహా 6 కంపెనీల ఐపీఓలకు సెబీ ఆమోదం

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న పెన్నా సిమెంట్స్‌తో పాటు మరో 5 కంపెనీల ఐపీఓలకు సెబీ ఆమోదం తెలిపింది. రూ.1,550 కోట్ల ఇష్యూ కోసం కొంతకాలం క్రితం పెన్నా సిమెంట్‌ సెబీకి దరఖాస్తు చేయగా,  తాజాగా అనుమతి మంజూరైంది. రూ.1,550 కోట్ల ఇష్యూలో రూ.1,300 కోట్లకు కంపెనీ కొత్తగా షేర్లు జారీ చేస్తుంది. మిగిలిన రూ.250 కోట్లకు కంపెనీ ప్రమోటర్ల తరగతికి చెందిన పీఆర్‌ సిమెంట్‌ హోల్డింగ్స్‌ తన వాటా (33.41 శాతం) నుంచి కొన్ని షేర్లు విక్రయిస్తుంది.  పబ్లిక్‌ ఇష్యూ ద్వారా సమీకరించే నిధుల్లో రూ.550 కోట్లను కొన్ని అప్పులు తీర్చడానికి, కేపీ లైన్‌- 2 ప్రాజెక్టుపై మూలధన వ్యయానికి కేటాయిస్తుంది. తలారిచెరువు యూనిట్లో గ్రైండింగ్‌, సిమెంట్‌ మిల్‌ ఆధునికీకరణకు రూ.80 కోట్లు వెచ్చించాలని ప్రతిపాదించారు. వేస్ట్‌ హీట్‌ రికవరీ ప్లాంట్లను తలారిచెరువులో ఒకటి, తాండూరులో మరొకటి ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికి రూ.240 కోట్లు వెచ్చించాల్సి వస్తుంది.

నైకా: నైకా బ్రాండుపై సౌందర్య ఉత్పత్తులను విక్రయించే ఎఫ్‌ఎస్‌ఎన్‌ ఇ-కామర్స్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌..  పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ.3,500- 4,500 కోట్లు సమీకరించాలని అనుకుంటోంది. రూ.525 కోట్ల విలువైన తాజా షేర్లను, ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో ప్రమోటర్లు, వాటాదార్లకు చెందిన 4,31,11,670 షేర్లను విక్రయించనుంది.

అదానీ విల్మర్‌: అదానీ గ్రూపు, విల్మర్‌ గ్రూపుల సంయుక్త సంస్థ అయిన అదానీ విల్మర్‌.. ఫార్చూన్‌ బ్రాండుతో వంటనూనెలను విక్రయిస్తోంది. ఈ సంస్థ ఐపీఓ ద్వారా రూ.4,500 కోట్లు సమీకరించే అవకాశం ఉంది.

స్టార్‌హెల్త్‌: రూ.2,000 కోట్ల విలువైన తాజా షేర్లను, ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదార్లకు చెందిన 6,01,04,677 షేర్లను కంపెనీ విక్రయించనుంది.

లేటెంట్‌ వ్యూ అనలిటిక్స్‌: డేటా విశ్లేషణ సంస్థ అయిన లేటెంట్‌ వ్యూ అనలిటిక్స్‌ రూ.474 కోట్ల విలువైన కొత్త షేర్లతో పాటు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా ప్రమోటర్లు, వాటాదార్లకు చెందిన రూ.126 కోట్ల విలువైన షేర్లను విక్రయించనుంది.

సిగాచీ ఇండస్ట్రీస్‌: సెల్యులోజ్‌ సంబంధిత ఉత్పత్తులను తయారు చేసే ఈ సంస్థ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా 76.95 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించనుంది.

రూ.500 కోట్ల సమీకరణకు జీపీటీ హెల్త్‌కేర్‌
పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ.500 కోట్లు సమీకరించే ఉద్దేశంతో సంబంధిత దరఖాస్తు పత్రాలను సెబీకి జీపీటీ హెల్త్‌కేర్‌ సమర్పించింది. ఐఎల్‌ఎస్‌ హాస్పిటల్స్‌ పేరుతో ఈ సంస్థ ఆసుపత్రులను నిర్వహిస్తోంది. సెబీకి సమర్పించిన దరఖాస్తుల్లోని వివరాల ప్రకారం.. రూ.17.5 కోట్ల విలువైన తాజా షేర్లను, ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో ప్రమోటర్లు, ఓ పెట్టుబడి సంస్థకు చెందిన 2.98 ఈక్విటీ షేర్లను కంపెనీ విక్రయించాలని అనుకుంటోంది. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను వైద్య సామగ్రి కొనుగోలుకు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు కంపెనీ వినియోగించనుంది.

అంకురాలు రూ.81,000 కోట్లు సమీకరించాయ్‌
జులై- సెప్టెంబరులో అంకుర సంస్థలు 347 ఒప్పందాల ద్వారా మొత్తంగా 10.9 బి.డాలర్లు (రూ.81,000 కోట్లకు పైగా) నిధులు సమీకరించాయని పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక వెల్లడించింది. 2020లో ఇదే సమయంలో సమీకరించిన నిధులతో పోలిస్తే ఈ విలువ మూడు రెట్లు కాగా.. 2021 ఏప్రిల్‌- జూన్‌లో సమీకరించిన నిధుల కంటే 41% ఎక్కువ. ఆర్థిక సాంకేతికత (ఫిన్‌టెక్‌), విద్యా సాంకేతికత (ఎడ్‌టెక్‌), సాస్‌ (సాఫ్ట్‌వేర్‌ సేవలు) విభాగాల్లో అత్యధిక నిధులు వచ్చాయి. మొత్తం నిధుల్లో ఈ మూడు రంగాలకు వచ్చిన నిధుల వాటానే సుమారు 47శాతంగా ఉంటుందని నివేదిక పేర్కొంది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని