రూ.4.50 లక్షల కోట్లకు ఔషధ పరిశ్రమ!
close

Published : 19/10/2021 02:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రూ.4.50 లక్షల కోట్లకు ఔషధ పరిశ్రమ!

రెండేళ్లలోనే చేరొచ్చు: కేర్‌ రేటింగ్స్‌
దేశీయ అమ్మకాలను మించిపోతున్న ఎగుమతులు
ఈనాడు - హైదరాబాద్‌

దేశీయ ఔషధ పరిశ్రమకు అత్యంత ఆకర్షణీయ వృద్ధి అవకాశాలు కనిపిస్తున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరాంతానికి 45 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.3.37 లక్షల కోట్ల) స్థాయిలో ఉన్న ఔషధ పరిశ్రమ విలువ,  రెండేళ్ల లోనే 60 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.4.50 లక్షల కోట్ల)ను మించుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. అంతర్జాతీయంగా ఎన్నో రకాల ఔషధాలకు పేటెంట్‌ గడువు తీరిపోతున్నందున, ఆ ఔషధాలు ఉత్పత్తి చేసే అవకాశం మనదేశంలోని ఔషధ కంపెనీలకు లభించనుంది. యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతి గల యూనిట్లు అమెరికా వెలుపల అధికంగా ఉన్నది మనదేశంలోనే. ఇటీవల కాలంలో పరిశ్రమలో వస్తున్న మార్పులు, దేశీయ ఫార్మా కంపెనీలకు ఉన్న శక్తియుక్తులను పరిగణనలోకి తీసుకుని, సమీప భవిష్యత్తులో ఈ పరిశ్రమ గణనీయంగా విస్తరిస్తుందని కేర్‌ రేటింగ్స్‌ ఇటీవల ఒక నివేదికలో విశ్లేషించింది. మందుల విలువ పరంగా చూస్తే ప్రపంచ వ్యాప్తంగా భారత ఫార్మా పరిశ్రమ 13వ స్థానంలో కనిపిస్తుంది. అయితే ఉత్పత్తి చేసే మందుల పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకుంటే 3వ స్థానంలో ఉంటుంది. జనరిక్‌ ఔషధాల ఉత్పత్తిలో నిమగ్నం కావడం వల్ల, విలువ పరంగా కొంత వెనక ఉండిపోవలసిన పరిస్థితి దేశీయ ఫార్మా పరిశ్రమకు ఉంది. మున్ముందు ఈ పరిస్థితి మారుతుందనే అభిప్రాయాలను పరిశ్రమ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

11 శాతానికి వార్షిక వృద్ధి రేటు
2017- 21 మధ్యకాలంలో 7.2 శాతం వార్షిక వృద్ధిని ఔషధ పరిశ్రమ నమోదు చేసింది. వచ్చే రెండేళ్లలో వార్షిక వృద్ధి రేటు 11 శాతం ఉంటుందని, 2023 మార్చికి 60 బి.డా. స్థాయికి చేరుతుందని కేర్‌ రేటింగ్స్‌ పేర్కొంది. 2016-17లో మనదేశం నుంచి మందుల ఎగుమతులు 17 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.1.27 లక్షల కోట్లు) మాత్రమే. 2020-21 నాటికి ఎగుమతులు 24 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.1.80 లక్షల కోట్ల)కు పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరంలో ‘కొవిడ్‌’ పరిణామాలతో ఎన్నో రకాల మందులను అధికంగా ఎగుమతి చేసే అవకాశం మనదేశానికి లభించింది. అందువల్ల ఎగుమతుల్లో 18 శాతం వృద్ధి నమోదైంది. ఎగుమతులు పెరుగుతున్నందున దేశీయ అమ్మకాలు- ఎగుమతుల నిష్పత్తి 47: 53కు చేరుకుంది. 2016-17 లో ఈ నిష్పత్తి 52: 48 ఉండటం గమనార్హం. 2022-23 ఆర్థిక సంత్సరాంతం నాటికి ఇది 45: 55 నిష్పత్తిలో ఉంటుందని అంచనా. అంటే ఎగుమతులు ఇంకా పెరుగుతాయి.


ఇవీ సానుకూలతలు

దేశీయ ఫార్మా పరిశ్రమ వృద్ధికి దారితీసే అంశాలివీ.. 

* 2026 నాటికి ప్రపంచ మార్కెట్లో దాదాపు 240 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.18 లక్షల కోట్ల) విక్రయాలు నమోదు చేస్తున్న మందులకు పేటెంట్‌ గడువు తీరిపోతోంది. వీటికి జనరిక్‌ మందులు ఉత్పత్తి చేసే అవకాశం మనదేశ ఫార్మా కంపెనీలకు లభిస్తుంది. ఇప్పటికే దేశీయ కంపెనీలు సంబంధిత జనరిక్‌ మందులు అభివృద్ధి చేసి, అనుమతుల కోసం దరఖాస్తు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి.

* అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే ఉత్పత్తి వ్యయాలు, క్లినికల్‌ పరీక్షలు,  పరిశోధన- అభివృద్ధి ఖర్చులు మనదేశంలో సగానికి సగం తక్కువ. దీని వల్ల  బహుళ జాతి కంపెనీలు సైతం పరిశోధన- అభివృద్ధి కార్యకలాపాలను మనదేశానికి తరలించవచ్చు.

* అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) నుంచి కొత్త ఔషధాల కోసం ఏఎన్‌డీఏ (అబ్రివియేటెడ్‌ న్యూడ్రగ్‌ అప్లికేషన్‌) అనుమతులను పెద్ద సంఖ్యలో భారతీయ కంపెనీలు సంపాదిస్తున్నాయి. 2019-20లో యూఎస్‌ఎఫ్‌డీఏ జారీ చేసిన మొత్తం  ఏఎన్‌డీఏ అనుమతుల్లో 40 శాతం మన కంపెనీలకు లభించాయి. 2020-21లో ఇది 44 శాతానికి పెరిగింది. ఇదొక పెద్ద సానుకూలత.

* గతంలో దేశీయ ఫార్మా కంపెనీల యూనిట్లకు యూఎస్‌ఎఫ్‌డీఏ, ఇతర దేశాల ఔషధ నియంత్రణ సంస్థల నుంచి ఆడిట్‌ అభ్యంతరాలు అధికంగా వ్యక్తం అయ్యేవి. రెండు- మూడేళ్లుగా ఇవి తగ్గిపోయాయి. నాణ్యత ప్రమాణాల విషయంలో దేశీయ కంపెనీలు ఎదిగిన ఫలితమే ఇది.

* ముడిపదార్థాల కోసం చైనాపై అధికంగా ఆధారపడకుండా ఉండటంపై ఫార్మా పరిశ్రమ, కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాయి. కేంద్రం పీఎల్‌ఐ పథకాన్ని అమలు చేయటంతో పాటు ఇతరత్రా చర్యలు చేపడతుండగా, ఫార్మా కంపెనీలు తమ వంతుగా బల్క్‌ ఔషధాలు, ఇంటర్మీడియేట్స్‌ను సొంతంగా తయారు చేసుకోవడంపై దృష్టి పెట్టాయి. కొన్నేళ్లలో ఈ ఫలితాలు లభిస్తాయి.


జోరుగా విదేశీ పెట్టుబడులు

భారత సంస్థల పనితీరు గమనించే, అంతర్జాతీయ పెట్టుబడి సంస్థలు దేశీయ ఔషధ రంగంలో పెట్టుబడులు పెడుతున్నాయి. 2019-20లో ప్రైవేటు ఈక్విటీ (పీఈ) సంస్థలు మనదేశంలో 50 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.3.75 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టగా, అందులో 6 శాతం దేశీయ ఫార్మా, కెమికల్స్‌ సంస్థలకు లభించింది. 2021 ఆర్థిక సంవత్సరం ప్రధమార్థంలోనే 1.6 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.12,000 కోట్ల) విదేశీ పెట్టుబడిని దేశీయ ఫార్మా కంపెనీలు ఆకర్షించగలిగాయి. కేకేఆర్‌, కార్లైల్‌, అడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌.. తదితర పీఈ సంస్థలు దేశీయ ఫార్మా కంపెనీల్లో క్రియాశీలక వాటాలు కొనుగోలు చేశాయి. దేశీయ ఫార్మా రంగంపై అంతర్జాతీయంగా విశ్వసనీయత పెరుగుతుందనడానికి ఇవి ఉదాహరణ అని పరిశ్రమ ప్రతినిధులు వివరిస్తున్నారు. అలాగని సవాళ్లు లేవని కాదని, వాటిని అధిగమిస్తూ ముందుకు సాగాలని సూచిస్తున్నారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని