భారత పింఛను వ్యవస్థకు 40వ ర్యాంకు: మెర్సెర్‌ నివేదిక
close

Published : 20/10/2021 01:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత పింఛను వ్యవస్థకు 40వ ర్యాంకు: మెర్సెర్‌ నివేదిక

దిల్లీ: ప్రపంచంలోని చాలా దేశాలతో పోలిస్తే పింఛను వ్యవస్థలో భారత్‌ బాగా వెనుకబడి ఉందని ఓ అధ్యయనంలో తేలింది. 43 పింఛను వ్యవస్థలతో రూపొందిన జాబితాలో భారత పింఛను వ్యవస్థకు 40వ ర్యాంకు లభించిందని మెర్సెర్‌ నివేదిక తెలిపింది. పదవీ విరమణ తర్వాత తగినంత ఆదాయం ఉండేలా ప్రస్తుత పింఛను విధానాల్లో మార్పులు చేయాలని, వ్యూహాత్మక సంస్కరణలు చేపట్టాలని అందులో పేర్కొంది. అసంఘటిత రంగంలో పనిచేసేవాళ్లలో మరింత మందిని పింఛను పరిధిలోకి తేవడం, పేదవాళ్లకు తక్కువ వయస్సులోనే పింఛను సాయాన్ని అందించడం లాంటి చర్యలు తీసుకోవాలని తెలిపింది. ‘భారత్‌లో ప్రైవేట్‌ పింఛను విధాన పరిధిలో కేవలం 6 శాతం మందే ఉన్నారు. 90 శాతానికి పైగా అసంఘటిత రంగంలోనే పనిచేస్తున్నారు. ఎక్కువ మందికి ప్రయోజనం కలిగేలా చర్యలు చేపట్టాలి. అప్పుడే పింఛన్‌ విధానంను దేశ ర్యాంకు మెరుగవుతుంద’ని నివేదిక వివరించింది. 


దేశవ్యాప్తంగా 300 స్మార్ట్‌ క్లినిక్స్‌
వీరా స్మార్ట్‌ హెల్త్‌కేర్‌

ఈనాడు, హైదరాబాద్‌: గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్‌ క్లినిక్‌లను ఏర్పాటు చేసేందుకు పలు వైద్య సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వీరా స్మార్ట్‌ హెల్త్‌కేర్‌ తెలిపింది. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఈ బీ2బీ సంస్థ స్మార్ట్‌ క్లినిక్‌లతో పాటు, మొబైల్‌ యూనిట్లు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ తదితరాల ఏర్పాటులో వైద్య సంస్థలకు సహాయం చేస్తోంది. తొలి దశలో ఇందుకోసం రూ.110 కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది.


దేశవ్యాప్తంగా టాటా హెల్త్‌ ఆన్‌లైన్‌ వైద్యసేవలు

దిల్లీ: దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో వైద్యుల సేవలను తమ డిజిటల్‌ హెల్త్‌ ప్లాట్‌ఫామ్‌పై పొందొచ్చని టాటా హెల్త్‌ వెల్లడించింది. ఇప్పటి వరకు టాటా హెల్త్‌ సేవలు బెంగళూరుకే పరిమితమయ్యాయి. ఫిజిషీయన్లు, స్పెషలిస్ట్‌ వైద్యులను సత్వరం పొందే వీలును టాటా హెల్త్‌ కల్పిస్తోంది. అపాయింట్‌మెంట్‌ కోసం ఎదురుచూసే అవసరం లేకుండా ఏ ఆరోగ్య సమస్యకైనా వైద్య సలహాలను పొందొచ్చని సంస్థ తెలిపింది. 15 విభాగాల్లో నిపుణులు, 24 గంటల పాటు సాధారణ వైద్యులు తమ ప్లాట్‌ఫామ్‌పై అందుబాటులో ఉంటారని కంపెనీ వెల్లడించింది. ‘కరోనా వల్ల ఆరోగ్యం విషయంలో సన్నద్ధత అవసరం తెలియవచ్చింది. మా ఆన్‌లైన్‌ వైద్య సేవలతో వ్యక్తుల ఆరోగ్య సంరక్షణ సులభం కానుంది’ అని టాటా హెల్త్‌ సీఈఓ మంజీర్‌ అమిన్‌ అన్నారు. జనరల్‌ మెడిసిన్‌, గైనకాలజీ, పీడియాట్రిక్స్‌, డెర్మటాలజీ, సైకియాట్రీ, ఈఎన్‌టీ, ఆర్థోపెడిక్స్‌, కార్డియాలజీ, డయాబెటాలజీ, గ్యాస్టో ఎంటరాలజీ, పల్మనాలజీ, సైకాలజీ, నెఫ్రాలజీ, న్యూట్రిషన్‌ కౌన్సిలింగ్‌ విభాగాల్లో సంస్థ సేవలు అందిస్తుంది. టాటా డిజిటల్‌ హెల్త్‌ సేవలను సంస్థ వెబ్‌సైట్‌ లేదా గూగుల్‌ ప్లే స్టోర్‌, ఐఓఎస్‌ల్లో యాప్‌పై పొందొచ్చు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని