హెచ్‌యూఎల్‌ లాభం రూ.2,185 కోట్లు
close

Updated : 20/10/2021 01:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హెచ్‌యూఎల్‌ లాభం రూ.2,185 కోట్లు

11.3 శాతం పెరిగిన విక్రయాలు

దిల్లీ: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్థాన్‌ యునిలీవర్‌ (హెచ్‌యూఎల్‌) సెప్టెంబరు త్రైమాసికంలో రూ.2,185 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో సంస్థ  లాభం రూ.1,974 కోట్లతో పోలిస్తే ఇది 10.7 శాతం అధికం. అన్ని విభాగాలు రాణించడం, ఉత్పత్తుల ధరల పెంపు వల్ల లాభం పెరిగిందని కంపెనీ తెలిపింది. విక్రయాల ఆదాయం రూ.11,510 కోట్ల నుంచి 11.31 శాతం పెరిగి రూ.12,812 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు రూ.9,054 కోట్ల నుంచి రూ.10,129 కోట్లకు చేరాయి. ‘ముడి పదార్థాల వ్యయాలు పెరగడం, వినియోగదారు సెంటిమెంట్‌ బలహీనంగా ఉండటం వంటి సవాళ్లున్నా.. ఆదాయంలో రెండంకెల వృద్ధి సహా లాభదాయకత బాగా పెంచుకోగలిగాం. భవిష్యత్‌లో గిరాకీ రికవరీపై జాగ్రత్తతో కూడిన ఆశావాదంతో ఉన్నామ’ని హెచ్‌యూఎల్‌ సీఎండీ సంజీవ్‌ మెహతా వెల్లడించారు.

విభాగాల వారీగా ఆదాయం ఇలా..

* గృహ సంరక్షణ ఉత్పత్తుల విభాగాదాయం రూ.3,318 కోట్ల నుంచి 15.67 శాతం వృద్ధితో రూ.3,838 కోట్లకు చేరింది. ఫ్యాబ్రిక్‌ వాష్‌ విక్రయాలు గణనీయంగా పెరగడమే ఇందుకు కారణం.

* సౌందర్య, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల విభాగాదాయం రూ.4,550 కోట్ల నుంచి 10.46 శాతం పెరిగి రూ.5,026 కోట్లకు చేరింది. చర్మ సంరక్షణ, కలర్‌ కాస్మోటిక్స్‌, కేశ సంరక్షణ ఉత్పత్తులకు గిరాకీ వల్ల ఈ విభాగాదాయం పెరిగింది.

* చేతి శుభ్రత (హ్యాండ్‌ హైజీన్‌) పోర్ట్‌ఫోలియో గత ఏడాదితో పోలిస్తే తగ్గింది. గ్లెన్‌మార్క్‌ ఫార్మా నుంచి కొనుగోలు చేసిన వీవాష్‌ హైజీన్‌ బ్రాండ్‌ విక్రయాలు మాత్రం బలంగా ఉన్నాయి.

* ఆహార, ఉపాహార విభాగాదాయం రూ.3,379 కోట్ల నుంచి 7.19 శాతం పెరిగి రూ.3,622 కోట్లకు చేరింది. ఆరోగ్య ఆహార పానీయాల పరిమాణం రెండంకెల వృద్ధి సాధించింది. ఐస్‌క్రీమ్‌ల విక్రయాలు కూడా గణనీయంగా పెరిగాయి.

* ఇతర విభాగాదాయం (ఎగుమతులతో కలిపి) రూ.436 కోట్ల నుంచి 28.44 శాతం పెరిగి రూ.560 కోట్లకు చేరింది.

* ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-సెప్టెంబరులో ఏకీకృత నికర లాభం రూ.4,285 కోట్లకు చేరింది. ఏడాది క్రితం ఇదే సమయ లాభం రూ.3,871 కోట్లతో పోలిస్తే ఇది 10.69 శాతం అధికం. ఇదే సమయంలో విక్రయాల ఆదాయం రూ.22,080 కోట్ల నుంచి 12.36 శాతం పెరిగి రూ.24,808 కోట్లకు చేరింది.

* బీఎస్‌ఈలో షేరు మంగళవారం 4.06% కోల్పోయి రూ.2,546.65 వద్ద ముగిసింది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని