మొండి బకాయిలు పెరగొచ్చు
close

Published : 20/10/2021 02:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మొండి బకాయిలు పెరగొచ్చు

2021-22లో 8-9 శాతానికి: క్రిసిల్‌ అంచనా
2018తో పోలిస్తే చాలా తక్కువే

ముంబయి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు(ఎన్‌పీఏలు) 8-9 శాతానికి  పెరగొచ్చని క్రిసిల్‌ తన నివేదికలో పేర్కొంది. 2018 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి నమోదైన గరిష్ఠ స్థాయి ఎన్‌పీఏల (11.2 శాతం)తో పోలిస్తే ఇవి తక్కువే. రుణ పునర్నిర్మాణాలు, అత్యవసర రుణ హామీ పథకం(ఈసీఎల్‌జీఎస్‌) వంటివి బ్యాంకుల్లో ఎన్‌పీఏల పెరుగుదలను అదుపు చేయొచ్చని క్రిసిల్‌ అంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి కల్లా పునర్నిర్మాణం కింద ఉన్న స్థూల ఎన్‌పీఏలు, రుణ పుస్తకంలో ఒత్తిడిలోని ఆస్తులు 10-11 శాతానికి చేరొచ్చని అంచనా వేసింది. బ్యాంకు రుణాల్లో 40 శాతం వరకు ఉండే రిటైల్‌, ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ రంగాల్లో ఎన్‌పీఏలు పెరగవచ్చని చెబుతోంది. ఇంకా ఆ ఏజెన్సీ ఏమంటోందంటే..

* 2021-22 చివరకు రిటైల్‌, ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ రంగాల్లో ఒత్తిడిలో ఉన్న ఆస్తులు వరుసగా 4-5%; 17-18 శాతానికి చేరొచ్చు.

* ఈ ఆర్థిక సంవత్సరం చివరకు జాతీయ ఆస్తుల పునర్నిర్మాణ సంస్థ (ఎన్‌ఏఆర్‌సీఎల్‌) లేదా మొండి బ్యాంకు తన కార్యకలాపాలను ప్రారంభించవచ్చు. తొలి దశలో రూ.90,000 కోట్ల ఎన్‌పీఏల విక్రయం వల్ల బ్యాంకులకు స్థూల ఎన్‌పీఏలు తగ్గే అవకాశం ఉంది.

* రిటైల్‌, ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలతో పోలిస్తే కార్పొరేట్‌ విభాగం రాణించొచ్చు. ఇప్పటికే ఈ రంగంలోని ఎన్‌పీఏల్లో ఎక్కువ భాగాన్ని అయిదేళ్ల కిందట ప్రవేశపెట్టిన ఆస్తుల నాణ్యత సమీక్షలో గుర్తించడమే ఇందుకు కారణం. కరోనా సమయంలో కార్పొరేట్‌ విభాగంలో కేవలం 1% రుణాలే పునర్నిర్మాణం జరిగాయి.

* ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్‌ విభాగంలో ఒత్తిడిలో ఉన్న ఆస్తులు 9-10 శాతంగానే కొనసాగొచ్చు.

* ప్రాథమికంగా ఈ ఏడాది జీడీపీ వృద్ధి 9.5 శాతంగా నమోదవవచ్చని అంచనా. కొవిడ్‌ మూడో దశ వ్యాప్తి మరీ భయంకరంగా ఉండి, గిరాకీ తగ్గితేనే ఈ అంచనాలు మారొచ్చు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని