యూనికార్న్‌లలో అమెరికా తరవాత మనమే
close

Published : 21/10/2021 04:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యూనికార్న్‌లలో అమెరికా తరవాత మనమే

జులై- సెప్టెంబరులోనే కొత్తగా 10
పెట్టుబడుల సమీకరణలో అంకురాల జోరు
ఈనాడు - హైదరాబాద్‌

వినూత్న ఆవిష్కరణలతో భారతీయ అంకుర సంస్థలు ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే.. మన అంకురాలు సత్తా చాటుతూ పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయి. 2021లో ఇప్పటివరకు మన దేశం నుంచి 33 అంకురాలు యూనికార్న్‌ (100 కోట్ల డాలర్లు-రూ.7500 కోట్ల విలువైన సంస్థ) హోదా సాధించగా.. చైనా నుంచి 19 ఈ జాబితాలో చేరాయి. గత ఏడాదిలోనూ భారత్‌ నుంచి 17 అంకురాలు యూనికార్న్‌లుగా మారగా, చైనా నుంచి 16 కావడం గమనార్హం. సెప్టెంబరు త్రైమాసికంలోనే మన దేశంలో 10 అంకురాలు యూనికార్న్‌లుగా మారడంతో, ఒక త్రైమాసికంలో అమెరికా తరవాత ఎక్కువ సంస్థల ఘనత మనదే అయ్యింది.

డిజిటల్‌ టెక్నాలజీకి గిరాకీ పెరగడం.. అందులో నైపుణ్యం ఉన్న భారతీయులకు గత రెండేళ్లుగా కలిసొస్తోంది. కృత్రిమ మేధ, మెషీన్‌ లెర్నింగ్‌, బ్లాక్‌చెయిన్‌ సాంకేతికత.. తదితర విభాగాల్లో భారతీయ అంకురాలు పట్టు సాధించాయి. ప్రభుత్వం కూడా స్టార్టప్‌ ఇండియా లాంటి కార్యక్రమాలతో అంకురాల వృద్ధికి అనువైన వాతావరణం కల్పిస్తుండటమే యూనికార్న్‌ల వేగానికి కారణమవుతోంది. ప్రపంచంలోని అతిపెద్ద విపణుల్లో ఒకటైన భారత్‌లో పరిష్కరించాల్సిన సమస్యలూ అధికమే. వీటికి అనువైన పరిష్కారాలను ఆవిష్కరిస్తున్న అంకురాలకు ఆదరణ అధికంగానే ఉంటోంది. సాంకేతికతను ఉపయోగించడంలో పట్టు పెరగడమూ ఇందుకు కారణం అవుతోందని నిపుణులు పేర్కొంటున్నారు.కొంతకాలంగా చైనాలో పరిస్థితులు పెట్టుబడులకు అంత అనుకూలంగా లేవు. పెట్టుబడుదారులకు ప్రత్యామ్నాయంగా మనదేశం కనిపిస్తోంది.

ఒక్క త్రైమాసికంలోనే

ఈ ఏడాది జులై-సెప్టెంబరులో మన దేశంలో 10 అంకురాలు యూనికార్న్‌ హోదా సాధించాయి. ఇదే సమయంలో చైనాలో (7), యూకే (4), కెనడాలో 4 మాత్రమే ఈ హోదా సాధించాయి. అయితే, అగ్రరాజ్యం అమెరికాలో 68 యూనికార్న్‌లు ఆవిర్భవించాయి. అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో భారత్‌ నుంచి మరికొన్ని సంస్థలు యూనికార్న్‌ క్లబ్‌లో చేరే అవకాశం ఉంది.

పెట్టుబడుల వెల్లువ

భారతీయ అంకురాల్లోకి జులై- సెప్టెంబరులో దాదాపు 1090 కోట్ల డాలర్ల (సుమారు రూ.82000 కోట్లు) పెట్టుబడులు వచ్చాయి. ఒక త్రైమాసికంలో 1000 కోట్ల  డాలర్ల పెట్టుబడులు దాటడం ఇదే మొదటిసారని పీడబ్ల్యూసీ ఒక నివేదికలో తెలిపింది. గత ఏడాది ఇదే సమయంలో వచ్చిన పెట్టుబడులు 280 కోట్ల డాలర్లే (సుమారు రూ.21,000 కోట్లు) కావడం గమనార్హం. మొత్తం పెట్టుబడుల్లో అధిక శాతం వృద్ధి దశలో ఉన్న.. ఐపీఓలకు సిద్ధం అవుతున్న అంకురాలకే వచ్చాయి. ఓలాక్యాబ్స్‌, పైన్‌ ల్యాబ్స్‌, డ్రూమ్‌ తదితర సంస్థలను ఇందుకు ఉదాహరణలుగా చెప్పొచ్చు. ఎప్పటిలాగా ఫిన్‌టెక్‌ సంస్థలు, సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఎ సర్వీస్‌ (సాస్‌), ఎడ్యుటెక్‌ కంపెనీలు పెట్టుబడులను ఆకర్షించడంలో ముందు వరుసలో ఉన్నాయి.

జులై-సెప్టెంబరులో యూనికార్న్‌లుగా అవతరించినవి

* ఆఫ్‌ బిజినెస్‌ (ఫిన్‌టెక్‌) * ఎరుడైటస్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎడ్యుకేషన్‌ (ఎడ్‌టెక్‌) * అప్‌గ్రేడ్‌ (ఎడ్‌టెక్‌)నీ వేదాంతు (ఎడ్‌టెక్‌) * భారత్‌పే (ఫిన్‌టెక్‌) *  కాయిన్‌డీసీఎక్స్‌ (సాస్‌) *  మొబైల్‌ ప్రీమియం లీగ్‌ (ఆన్‌లైన్‌ గేమింగ్‌) *  జెట్‌వర్క్‌ (ఇ-కామర్స్‌), *  అప్నా  (సాస్‌) *  బ్లాక్‌బక్‌ (లాజిస్టిక్స్‌ టెక్‌)


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని