బ్యాంకుల మొండి బకాయిలు తగ్గొచ్చు
close

Published : 21/10/2021 04:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బ్యాంకుల మొండి బకాయిలు తగ్గొచ్చు

మార్చి చివరికల్లా 6.9 శాతానికి స్థూల ఎన్‌పీఏలు: ఇక్రా

ముంబయి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) చివరినాటికి బ్యాంకుల స్థూల, నికర నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏలు) నిష్పత్తులు వరుసగా 6.9- 7 శాతానికి; 2.2- 2.3 శాతానికి తగ్గే అవకాశం ఉందని ఇక్రా అంచనా వేసింది. 2021 మార్చి 31 నాటికి ఇవి 7.6, 2.5 శాతంగా ఉన్నాయని తెలిపింది. 2020 మార్చి ఆఖరుకు చూస్తే ఇవి 8.6 శాతం, 3 శాతంగా ఉన్నాయని గుర్తు చేసింది. నిరర్థక ఆస్తులు తగ్గుతుండటంతో బ్యాంకులకు లాభాలపరంగా కొంత ఊరట లభించవచ్చని పేర్కొంది. కొత్తగా మొండి బకాయిలుగా మారుతున్నవి అధిక స్థాయిల్లోనే ఉంటున్నాయని, కొవిడ్‌-19 రెండో దశలో మారటోరియం లాంటి సదుపాయాలు కల్పించకపోవడం ఇందుకు కారణంగా పేర్కొంది. కొత్త స్థూల నిరర్థక ఆస్తులు ఏప్రిల్‌- జూన్‌లో రూ.1 లక్ష కోట్లుగా ఉన్నాయని.. ఏడాదిక్రితం ఇదే త్రైమాసికంలో ఇవి రూ.2.5 లక్షల కోట్లుగా నమోదయ్యాయని పేర్కొంది. జులై- సెప్టెంబరులోనూ కొత్త మొండి బకాయిలు అధిక స్థాయిల్లోనే రూ.0.7- 0.8 లక్షల కోట్లుగా నమోదయ్యే అవకాశం ఉందని వివరించింది. కొవిడ్‌-19 ప్రభావం తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగంలో కొత్త మొండి బకాయిలు రూ.1.1- 1.2 లక్షల కోట్లకు పరిమితం కావచ్చని నివేదిక తెలిపింది. 2021 జూన్‌ 30 నాటికి బ్యాంకులు పునర్‌వ్యవస్థీకరించిన మొత్తం రుణాలు రూ.2 లక్షల కోట్లుగా ఉన్నాయని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రభుత్వం నుంచి మూలధన సహకార అవసరం పడకపోవచ్చని తెలిపింది. దిగ్గజ ప్రైవేట్‌ సంస్థలు కూడా తగినంత మూలధనాన్ని కలిగి ఉన్నాయని, మధ్యతరహా ప్రైవేట్‌ బ్యాంకులకు మాత్రమే నిధుల సమీకరణ అవసరం ఏర్పడొచ్చని వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బ్యాంకుల రుణాల వృద్ధి అంచనాల్లో ఎలాంటి మార్పు చేయడం లేదని 7.3-8.3 శాతం కొనసాగొచ్చని తెలిపింది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని