మూడో రోజూ సూచీల బేజారు
close

Published : 22/10/2021 04:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మూడో రోజూ సూచీల బేజారు

సమీక్ష

సూచీలకు అమ్మకాల ఒత్తిడి మూడో రోజూ కొనసాగింది. కంపెనీల ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, ప్రతికూల అంతర్జాతీయ సంకేతాలకు తోడు గరిష్ఠ స్థాయుల్లో మదుపర్ల లాభాల స్వీకరణ మార్కెట్లను దెబ్బతీశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి పైసా పెరిగి  74.87 వద్ద ముగిసింది. చైనా ఎవర్‌గ్రాండ్‌ సంక్షోభం పరిణామాల నేపథ్యంలో హాంకాంగ్‌, సియోల్‌, టోక్యో నష్టాల్లో ముగియగా, షాంఘై లాభపడింది. ఐరోపా సూచీలు నీరసంగానే కదలాడాయి.

సెన్సెక్స్‌ ఉదయం 61,557.94 పాయింట్ల వద్ద సానుకూలంగా ప్రారంభమైంది. అమ్మకాల ఒత్తిడితో కొద్దిసేపటికే నష్టాల్లోకి వెళ్లిన సూచీ.. ఒకదశలో  60,485.65 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకింది. అయితే ఆఖర్లో కొనుగోళ్లు రావడంతో కోలుకుని 336.46 పాయింట్ల నష్టంతో 60,923.50 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 88.50 పాయింట్లు కోల్పోయి 18,178.10 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 18,048- 18,384.20 పాయింట్ల మధ్య కదలాడింది.

* త్రైమాసిక ఫలితాలు నిరుత్సాహపరచడంతో హావెల్స్‌ షేరు ఇంట్రాడేలో  9.99 శాతం నష్టపోయి, రూ.1264.85 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 8.52 శాతం తగ్గి 1,285.60 వద్ద ముగిసింది.

* నికర నష్టం తగ్గడంతో షాపర్స్‌ స్టాప్‌ షేరు 20 శాతం దూసుకెళ్లి రూ.336.65 దగ్గర స్థిరపడింది.

* సెన్సెక్స్‌ 30 షేర్లలో 21 నీరసపడ్డాయి. ఏషియన్‌ పెయింట్స్‌ 5.21%, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 2.85%, ఇన్ఫోసిస్‌ 2.59%, డాక్టర్‌ రెడ్డీస్‌ 2.29%, టాటా స్టీల్‌ 2.11%, టీసీఎస్‌ 2.06%, భారతీ ఎయిర్‌టెల్‌ 1.70%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.67%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌  1.39%, హెచ్‌యూఎల్‌   1.35% మేర నష్టపోయాయి. కోటక్‌ బ్యాంక్‌ 6.51%, హెచ్‌డీఎఫ్‌సీ 1.70%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.52%, ఎన్‌టీపీసీ 1.03% లాభపడ్డాయి. రంగాల వారీ సూచీల్లో ఐటీ, టెక్‌, లోహ, టెలికాం, ఇంధన, స్థిరాస్తి 2.30% వరకు తగ్గాయి. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, వాహన, పరిశ్రమలు రాణించాయి.. బీఎస్‌ఈలో 1694 షేర్లు నష్టాల్లో ముగియగా, 1589 స్క్రిప్‌లు లాభపడ్డాయి. 143 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.

* ఇన్వెస్కో విజ్ఞప్తి మేరకు అసాధారణ వాటాదార్ల సమావేశం (ఈజీఎం) నిర్వహించాల్సిందిగా జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ను బాంబే హైకోర్టు ఆదేశించగా, ఇందుకు జీ అంగీకరించింది.

* సూచీల క్షీణత నేపథ్యంలో మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ గత మూడు రోజుల్లో రూ.8.47 లక్షల కోట్లు తగ్గి రూ.266.22 లక్షల కోట్లకు పరిమితమైంది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని