ఎన్‌బీఎఫ్‌సీలకు ఆర్‌బీఐ కొత్త నిబంధనలు
close

Published : 23/10/2021 01:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎన్‌బీఎఫ్‌సీలకు ఆర్‌బీఐ కొత్త నిబంధనలు

2022 అక్టోబరు నుంచి అమల్లోకి

ముంబయి: బ్యాంకింగేతర ఆర్థిక కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ)లపై గట్టి నిఘా వేయడం కోసం రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) నాలుగు అంచెల నియంత్రణ వ్యవస్థతో ముందుకొచ్చింది. దీని ద్వారా మొత్తం ఆర్థిక వ్యవస్థలో నష్టభయాలను తగ్గించాలన్నది ఆర్‌బీఐ ఉద్దేశం. 2022 అక్టోబరు నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి. ఎన్‌బీఎఫ్‌సీల మూలధన అవసరాలు, పాలనా ప్రమాణాలు, నియంత్రణ, ఇతర అంశాలను లెక్కలోకి తీసుకుని స్టేల్‌ బేస్డ్‌ రెగ్యులేషన్‌(ఎస్‌బీఆర్‌) వ్యవస్థను ఈ నిబంధనలు తీసుకువస్తాయి.

పాత ఉదంతాల వల్లే..: 2018లో ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌.. ఆ తర్వాత డీహెచ్‌ఎఫ్‌ఎల్‌లు ఎన్‌బీఎఫ్‌సీ రంగాన్ని కుదిపేసిన నేపథ్యంలోనే ఆర్‌బీఐ వివిధ వర్గాలతో విస్తృత చర్చల అనంతరం ఈ అడుగు వేసింది. అప్పటి ఉదంతాలు మొత్తం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపడం.. ముఖ్యంగా ద్రవ్యలభ్యత సమస్యను తీసుకురావడంతో దేశ ఎన్‌బీఎఫ్‌సీ రంగంపై కఠిన నియంత్రణలను విధించాలని అప్పటి నుంచే ఆర్‌బీఐ భావిస్తూ వచ్చింది. ఎన్‌బీఎఫ్‌సీల నష్టభయ ప్రొఫైల్‌ను బట్టి నియంత్రణ చర్యలనూ మార్చాల్సి ఉందని ఆర్‌బీఐ పేర్కొంది.

నియంత్రణ ఇలా..: తొలుత ఆర్‌బీఐ ఎన్‌బీఎఫ్‌సీలకు ఒక ఏకీకృత నియంత్రణ నిబంధనలను జారీ చేస్తుంది. అందులో ఎస్‌బీఆర్‌ నిర్మాణంపై స్థూల వివరాలు ఉంటాయి. తాజా నిబంధనలను పాటించాల్సిన గడువు తేదీలూ ఉంటాయి. ఎన్‌బీఎఫ్‌సీలను నాలుగు లేయర్లుగా విభజిస్తారు. అవేంటంటే.. బేస్‌ లేయరు(బీఎల్‌), మిడిల్‌ లేయర్‌(ఎమ్‌ఎల్‌), అప్పర్‌ లేయర్‌(యూఎల్‌), టాప్‌ లేయర్‌(టీఎల్‌).

బీఎల్‌లో ఏముంటాయంటే..: డిపాజిట్లు తీసుకోని ఎన్‌బీఎఫ్‌సీలతో పాటు టైప్‌ 1 ఎన్‌బీఎఫ్‌సీలు, నాన్‌ ఆపరేటివ్‌ ఫైనాన్షియల్‌ హోల్డింగ్‌ కంపెనీ, ఎన్‌బీఎఫ్‌సీ-పీ2పీ, ఎన్‌బీఎఫ్‌సీ-ఏఏ ఉంటాయి. ఆస్తుల పరిమాణం రూ.1000 కోట్ల లోపు ఉన్న వాటిని ఈ లేయరు కిందకు తీసుకొస్తారు.

ఎమ్‌ఎల్‌లో..: ఆస్తుల పరిమాణం రూ.1000 కోట్లకు పైబడి, డిపాజిట్లను తీసుకోని అన్ని ఎన్‌బీఎఫ్‌సీలు(ఎన్‌బీఎఫ్‌సీ-ఎన్‌డీ-ఎస్‌ఐ) ఇందులో ఉంటాయి. ఆస్తుల పరిమాణంతో సంబంధం లేకుండా డిపాజిట్లు తీసుకునే అన్ని ఎన్‌బీఎఫ్‌సీలూ ఇందులోకే వస్తాయి.

యూఎల్‌లో..: అప్పర్‌ లేయర్‌లో ఆర్‌బీఐ నిర్దేశించిన కొన్ని పరామితులకు లోబడే ఎన్‌బీఎఫ్‌సీలుంటాయి. ఆస్తుల పరిమాణంలో అగ్రగామి 10 ఎల్లప్పుడూ ఇందులోనే ఉంటాయి.

టీఎల్‌లో..: ఈ లేయరు ఖాళీగానే ఉంటుంది. అయితే అప్పర్‌ లేయర్‌లోని ఏవైనా ఎన్‌బీఎఫ్‌సీల్లో వ్యవస్థీకృత నష్టభయం పెరుగుతుందని భావించినపుడు వాటిని అప్పర్‌ లేయర్‌ నుంచి టాప్‌ లేయరులోకి మారుస్తారు.
అదే విధంగా నియంత్రణపరమైన మూలధన నాణ్యతను పెంచడం కోసం పైన సూచించిన లేయర్లలోని ఎన్‌బీఎఫ్‌సీలకు రిస్క్‌ వెయిటెడ్‌ అసెట్స్‌పైనా ఆర్‌బీఐ పలు నిబంధనలను తీసుకురానుంది. హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు ప్రస్తుత నిబంధనలే కొనసాగుతాయని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని