4% ద్రవ్యోల్బణమే లక్ష్యం
close

Published : 23/10/2021 02:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

4% ద్రవ్యోల్బణమే లక్ష్యం

ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌
పరపతి విధాన సమీక్ష వివరాలు  

ముంబయి: రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని 4 శాతం లోపునకు తీసుకురావడమే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) లక్ష్యమని గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. అది కూడా వృద్ధికి అంతరాయం లేకుండా చేయడం ముఖ్యమని అక్టోబరు పరపతి విధాన సమీక్షలో నిర్ణయించినట్లు, శుక్రవారం విడుదలైన సమావేశ వివరాలను బట్టి తెలుస్తోంది. రిటైల్‌ ఆధారిత ద్రవ్యోల్బణాన్ని 4 శాతం(+2 లేదా -2) వద్దే ఉంచాలని ఆర్‌బీఐకి ప్రభుత్వం తెలిపింది. మే, జూన్‌ నెలల్లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 6 శాతానికి పైగా నమోదైనా, సెప్టెంబరులో 4.35 శాతంగా నమోదైంది. ద్రవ్యోల్బణం ఎగువ స్థాయిని(6%) వరుసగా రెండో నెలా చేరిన నేపథ్యంలో సవాళ్లు ఎదురయ్యాయని ఆగస్టులో దాస్‌ పేర్కొన్నారు. జులై-ఆగస్టులో ద్రవ్యోల్బణం తిరిగి భరించగలిగే స్థాయిలోకి రావడంతో ఎమ్‌పీసీ అంచనాలు, పరపతి విధాన ధోరణిని బలపరచినట్లయిందని అన్నారు. ఆహార ధరలు బాగా తగ్గడంతోనే జులై-ఆగస్టులో ద్రవ్యోల్బణం కిందకు దిగివచ్చింది. అకాల వర్షాలేవీ లేకుంటే రికార్డు స్థాయి ఖరీఫ్‌ ఉత్పత్తి, సరిపడా ఆహార నిల్వలు, సరఫరా వైపు చర్యల కారణంగా సమీప భవిష్యత్‌లో ఆహార ద్రవ్యోల్బణం మరింత కిందకు దిగివస్తుందని ఆర్‌బీఐ గవర్నర్‌ అంచనా వేశారు. ‘అంతర్జాతీయంగా ముడి చమురు ధరలకు తోడు, దేశీయంగా సుంకాల వల్ల పెట్రో ధరలు కొత్త గరిష్ఠాలకు చేరాయి. దీంతో రవాణా వ్యయాలు అధికమై వస్తువులు, సేవల ధరలపై ప్రభావం పడింది. ఆర్థిక రికవరీ ఇంకా బలపడని కారణంగా పరపతి విధాన మద్దతు కొనసాగాల్సిన అవసరం ఉంద’ని దాస్‌ అన్నారు. అందుకే సర్దుబాటు ధోరణిని కొనసాగించారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని