పేటీఎం మెగా ఐపీఓకు సెబీ ఆమోదం!
close

Published : 23/10/2021 02:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పేటీఎం మెగా ఐపీఓకు సెబీ ఆమోదం!

 ఈ నెలాఖరులో మార్కెట్లోకి

దిల్లీ: డిజిటల్‌ ఆర్థిక సేవల సంస్థ పేటీఎం తీసుకొస్తున్న రూ.16,600 కోట్ల మెగా ఐపీఓకు మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ సెబీ ఆమోదముద్ర వేసినట్లు ఈ ప్రక్రియలో పాలుపంచుకుంటున్న ఒక వ్యక్తి   సమాచారం అందించారు. ఈ నెలాఖరులోగా ఇష్యూ మార్కెట్లోకి రావొచ్చని అంచనా. అందుకు తగ్గట్లుగా నమోదు(లిస్టింగ్‌)ను వేగవంతం చేసేందుకు ప్రీ-ఐపీఓ షేర్ల విక్రయాన్ని రద్దు చేసుకోవాలని కంపెనీ భావిస్తోంది. ఆ మేరకు కంపెనీ విలువకు సంబంధం లేని ప్రీ-ఐపీఓ నిధుల సమీకరణ ప్రణాళికలను పక్కనపెడుతోందని ఆ వ్యక్తి పేర్కొన్నారు. సంస్థ విలువ రూ.1.47-1.78 లక్షల కోట్లుగా ఉండాలని పేటీఎం భావిస్తోంది. ప్రతిపాదిత ఐపీఓ విజయవంతమైతే భారత్‌లో అతిపెద్ద పబ్లిక్‌ ఇష్యూ ఇదే అవుతుంది. 2010లో కోల్‌ ఇండియా తీసుకొచ్చిన రూ.15,200 కోట్ల ఐపీఓనే ఇప్పటిదాకా అతిపెద్దది.

ప్రమోటర్లు సైతం..
పేటీఎం సెబీకి సమర్పించిన ముసాయిదా పత్రాల ప్రకారం.. తాజా ఈక్విటీ షేర్ల ద్వారా రూ.8,300 కోట్లు; ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) ద్వారా మరో రూ.8,300 కోట్లు సమీకరించనుంది. పేటీఎం వ్యవస్థాపకుడు, ఎండీ, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ విజయ్‌ శేఖర్‌ శర్మ, అలీబాబా గ్రూప్‌ కంపెనీలు ప్రతిపాదిత ఓఎఫ్‌ఎస్‌ల కొంత వాటాను విక్రయించనున్నాయి. అలీబాబా గ్రూప్‌ కంపెనీ అయిన యాంట్‌ఫిన్‌(నెదర్లాండ్స్‌) హోల్డింగ్‌ బీవీ కనీసం 5 శాతం మేర వాటాను విక్రయించి.. తన షేర్‌హోల్డింగ్‌ను 25 శాతం దిగువకు తీసుకురానుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

నిధుల వినియోగం దేనికంటే..
కంపెనీ రూ.4,300 కోట్లను పేటీఎం వ్యవస్థను బలోపేతం చేయడానికి వినియోగించనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా వినియోగదార్లు, మర్చంట్లకు టెక్నాలజీ, ఆర్థిక సేవలను అందిస్తుంది. వ్యాపార కార్యకలాపాలు, కొనుగోళ్లు, వ్యూహాత్మక భాగస్వామ్యాల కోసం మరో రూ.2,000 కోట్లు ఖర్చుపెట్టవచ్చు. ఐపీఓలో 25 శాతాన్ని సాధారణ కార్పొరేట్‌ కార్యకలాపాలకు వినియోగించనుంది.

2.11 కోట్ల మంది వ్యాపారుల నమోదు
మార్చి 31, 2021 నాటికి పేటీఎం వద్ద 2.11 కోట్ల మంది వ్యాపారులు నమోదయ్యారు. మార్చి 2019లో వీరి సంఖ్య 1.12 కోట్లుగా ఉంది. అదే సమయంలో స్థూల మర్చండైజ్‌ విలువ(జీఎమ్‌వీ) సైతం రూ.2.29 లక్షల కోట్ల నుంచి రూ.4 లక్షల కోట్లకు చేరింది. 2020-21లో కంపెనీ నికర నష్టం రూ.1,704 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది రూ.2,943.3 కోట్ల నష్టం, 2018-19లో రూ.4,235.5 కోట్ల నష్టం నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయం రూ.3,540.7 కోట్ల నుంచి రూ.3,186.8 కోట్లకు తగ్గింది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని