బెంజ్‌ కార్లకు దేశవ్యాప్తంగా ఒకటే ధర
close

Published : 23/10/2021 02:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బెంజ్‌ కార్లకు దేశవ్యాప్తంగా ఒకటే ధర

దిల్లీ: జర్మనీ విలాసవంత కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్‌ బెంజ్‌ తన కార్ల విక్రయానికి కొత్త విధానాన్ని ప్రారంభించింది. రిటైల్‌ ఆఫ్‌ ద ఫ్యూచర్‌ (ఆర్‌ఓటీఎఫ్‌)గా చెబుతున్న ఈ విధానం ప్రకారం.. ఒక కారు మోడల్‌కు దేశవ్యాప్తంగా ఒకటే ధరను కంపెనీ నిర్ణయించనుంది. ఇందుకుగాను ప్రాంఛైజీ భాగస్వాములను నియమించుకోనుంది. వీళ్ల ద్వారా నేరుగానే వినియోగదారులకు ఇన్‌వాయిస్‌ పంపించనుంది. ఇంతకుముందు.. కంపెనీ హోల్‌సేలర్‌గాను, డీలర్లు రిటైలర్లుగా వ్యవహరించే వాళ్లు. వినియోగదారులు డీలర్లు నిర్దేశించిన ధరకు వాహనాన్ని కొనుగోలు చేసేవాళ్లు. ఇప్పుడు ఈ పద్ధతికి స్వస్తి చెప్పి దేశవ్యాప్తంగా ఒకటే ధరను, అది కూడా అత్యుత్తమ ధరను నిర్ణయించనున్నట్లు మెర్సిడెస్‌ బెంజ్‌ పేర్కొంది. ‘ఆర్‌ఓటీఎఫ్‌.. వినియోగదారు కేంద్రంగా నిర్వహించే వ్యాపార విధానం. ప్రస్తుత వినియోగదారు ధోరణులకు ఇది అద్దంపడుతుంది. ఫ్రాంచైజీ భాగస్వాములకు ఆర్థిక, నిర్వహణ భారాన్ని తగ్గించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుంద’ని మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా ఎండీ, సీఈఓ మార్టిన్‌ స్కావెంక్‌ అన్నారు. ఇప్పటికే ఆర్‌ఓటీఎఫ్‌ (బీటా దశలో) ద్వారా 1,700 వాహనాలకు కొనుగోలుదార్ల నుంచి బుకింగ్‌లు వచ్చాయని కంపెనీ తెలిపింది. ‘వినియోగదార్లు కేవలం రూ.50,000 చెల్లించి కారును బుక్‌ చేసుకోవచ్చు. ఆ తర్వాత 14 రోజులకు మీ ఆర్డరు పూర్తవుతుంది. భారత్‌లో తొలిసారిగా బుకింగ్‌ సమయంలోనే వాహన గుర్తింపు సంఖ్యను (వీఐఎన్‌) తెలియజేసే ప్రత్యేకతను అందుబాటులోకి తెచ్చాం. తద్వారా పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నాం. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న తమ కారు మోడళ్ల నిల్వలు, ఉత్పత్తి దశలో ఉన్ని ఉన్నాయనే వివరాలను కూడా తెలుసుకునే వీలు కల్పిస్తున్నాం. దీని కోసం అదనంగా ఎలాంటి రుసుము చెల్లించనక్కర్లే’దని తెలిపారు. ఆర్‌ఓటీఎఫ్‌.. కేవలం కొత్త కార్ల కోసమే తీసుకొచ్చిన విధానమని మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా స్పష్టం చేసింది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని