కొనుగోళ్లకు వెనకడుగు వేయం
close

Published : 24/10/2021 05:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొనుగోళ్లకు వెనకడుగు వేయం

ఔషధ, ఆర్థిక సేవల్లోనైనా సరే
ఫార్ములేషన్‌ రంగంలోకి మళ్లీ వస్తాం
బ్యాంకుగా మారడానికీ ప్రయత్నిస్తాం
ఇంటర్వ్యూ: పిరమాల్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ అజయ్‌ పిరమాల్‌
ముంబయి

పిరమాల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ వృద్ధి కోసం సంస్థల విలీనాలు-కొనుగోళ్ల(ఎం అండ్‌ ఎ) వైపు చూడడానికి వెనకాడబోమని పిరమాల్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ అజయ్‌ పిరమాల్‌ అంటున్నారు. గ్రూప్‌లోని ఔషధ, ఆర్థిక సేవల వ్యాపారాలను విభజిస్తున్న ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ, సంస్థల కొనుగోళ్ల వల్ల బలంగా తయారవుతామని ఆయన విశ్వసిస్తున్నారు. సరైన ధర లభిస్తే సరైన వ్యూహాత్మక కొనుగోళ్లు మంచే చేస్తాయని పేర్కొన్నారు. ఇందుకోసం రుణాలు సమీకరించుకోవాలని భావిస్తున్నారు. ఇటీవలే డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ను కొనుగోలు చేసినా.. ఆర్థిక సేవల వ్యాపారంలోనూ మరిన్ని అవకాశాల కోసం ఎదురుచూస్తున్నట్లు ఇంటర్వ్యూలో వివరించారు. ముఖ్యాంశాలివీ..

ప్ర: ఔషధ, ఆర్థిక సేవల వ్యాపారాల విభజనకు ఇదే సరైన సమయం అని ఎలా నిర్ణయించారు?
జ: కొంత కాలంగా విభజనపై ప్రణాళికలు చేశాం. ఆ విషయాన్ని బహిరంగంగానూ చెప్పాం. ఔషధ, ఆర్థిక సేవల విభజన చేస్తే.. అవి బలంగా నిలబడడానికి సరిపోయే వ్యాపారం, బృందం లేదా మూలధనం ఇపుడు ఉన్నాయని మేం భావించాం. మా పెట్టుబడుదార్లు కూడా సంక్లిష్ట నిర్మాణంపై సంతోషంగా లేరని మేం గుర్తించాం. సరళ నిర్మాణాన్ని వారు కోరుకుంటున్నారు. మధ్యకాలంలో విభజన ఉంటుందని గతంలో ఇచ్చిన మాటకు అనుగుణంగా.. ఇపుడు సరైన సమయమని భావించి అడుగులు వేశాం. ఈ ఆర్థిక సంవత్సరం మూడు-నాలుగు త్రైమాసికాల్లో విభజన పూర్తి కావొచ్చు. 10 నెలల నుంచి ఏడాదిలోపు కచ్చితంగా పూర్తవుతుంది.

ఆర్థిక సేవల్లో సరళ నిర్మాణాన్ని ఆర్‌బీఐ కోరుకుంటోంది. ఆ దిశగానే అడుగులు వేస్తున్నారా?
ఆర్‌బీఐ ఏం కోరుకుంటుందో అదే మేం చేస్తాం. అయితే అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. పిరమాల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కింద రుణ వ్యాపారాలు, రెండు ఆర్థిక విభాగాలు(పిరమాల్‌ క్యాపిటల్‌ అండ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, పిరమాల్‌ ఫిన్‌ఇన్వెస్ట్‌) ఉన్నాయి. మాకున్న రెండు ఎన్‌బీఎఫ్‌సీలు, ఒక హౌసింగ్‌ ఫైనాన్స్‌ విభాగం నిర్మాణంతో ఆర్‌బీఐ పెద్దగా సంతోషంగా లేదు. అందుకే ఇపుడు పిరమాల్‌ ఫిన్‌ఇన్వెస్ట్‌ను పిరమాల్‌ ఎంటర్‌ప్రైజెస్‌తో విలీనం చేస్తున్నాం. ఒక ఎన్‌బీఎఫ్‌సీ, ఒక గృహ రుణాల కంపెనీ మాత్రమే ఉంటాయి. ఈ తరహాలోనే చాలా వరకు సంస్థలు పాటిస్తాయి.

నగదు, నికర విలువ విషయంలో ఔషధ వ్యాపారానికి సరైన వాటా దక్కదన్న ఆందోళనలపై ఎలా స్పందించదలుచుకున్నారు?
ఈ ఏడాది చివరికల్లా ఔషధ వ్యాపారం నికర విలువ రూ.7,000 కోట్లకు చేరుతుంది. రుణాలు రూ.3,000 కోట్లకు పైగా ఉండొచ్చు. నవంబరు కల్లా కచ్చిత గణాంకాలు చెబుతాం. డెట్‌/ఎబిటా నిష్పత్తి బాగానే ఉంది. డెట్‌/ఈక్విటీ కూడా బాగుంది. మా ప్రకారం చూస్తే ఫార్మా వ్యాపారానికి మూలధనం పరంగా ఇబ్బందుల్లేవు. అందుకే గతేడాది కార్లైల్‌(20% పెట్టుబడులు పెట్టింది)ను ఆహ్వానించాం.
కీలక మార్కెట్లలో ఔషధాల ధరలు క్షీణిస్తున్న నేపథ్యంలో మీ దృష్టి ఎటువైపు ఉంది?
మా ఫార్మా వ్యాపారం మూడు విభాగాల్లో ఉంది. సీడీఎమ్‌ఓ(కాంట్రాక్ట్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ మాన్యుఫాక్చరింగ్‌ ఆర్గనైజేషన్‌), కాంప్లెక్స్‌ హాస్పిటల్‌ జనరిక్స్‌, ఓవర్‌ ద కౌంటర్‌(ఓటీసీ) డ్రగ్స్‌ ఉన్నాయి. తొలి రెండు అంతర్జాతీయ వ్యాపారాలు. వీటికి 92% పైగా టర్నోవరు భారత్‌కు వెలుపలే వస్తోంది. ఓటీసీ వ్యాపారానికి టర్నోవరులో 8-9% మేర వాటా ఉంది. కార్లైల్‌తో ఒప్పందం తర్వాత మేం కొనుగోళ్ల ద్వారా కూడా వృద్ధి చెందాం. గత 12 నెలల్లో మూడు కొనుగోళ్లు చేశాం. వివిధ విపణుల్లో ధరల క్షీణతను తీవ్రమైన అంశంగా చూడడం లేదు. అంతర్జాతీయ పరిణామాల మధ్య ముడి పదార్థాల ధరలు అయితే పెరుగుతున్నాయి.

భారత ఫార్ములేషన్‌ వ్యాపారంలోకి మళ్లీ అడుగుపెట్టాలని భావిస్తున్నారా? అబాట్‌కు ఆ వ్యాపారాన్ని 2010లో విక్రయించాక ఎటువంటి మార్పులు చూస్తున్నారు?
కొంత కాలం కిందట అందుకు అవకాశం వచ్చింది. అయితే ఇపుడు విలువ ఆధారిత కొనుగోళ్లు ఏమైనా ఉన్నాయేమో చూడాల్సి ఉంది. మళ్లీ మొదటి నుంచి ఏదైనా కొత్త వ్యాపారాన్ని నిర్మించలేం. కొనుగోళ్లే మంచిది. ఫార్మాలో చాలా కొనుగోళ్లు చేసింది అందుకే. అయితే వాల్యుయేషన్‌ విషయంలో కొంత మంది దృక్పథం వేరుగా ఉంటుంది. అయిదేళ్లలోనే తమకు డబ్బులు వస్తాయని ప్రైవేటు ఈక్విటీ ఫండ్‌లు భావిస్తాయి. దేశీయ ఫార్ములేషన్‌లో సహేతుక ధర దక్కితే కొనుగోలుకు సిద్ధంగానే ఉన్నాం.

ఆర్థిక సేవలు, ఫార్మాలలో కొనుగోళ్లను కొనసాగిస్తారా?
అవకాశాల కోసం చూస్తున్నాం. పరిశ్రమలో స్థిరీకరణ జరుగుతోంది. బలమైన కంపెనీలు మెరుగ్గా రాణిస్తాయి. బలహీన కంపెనీలు నిధుల సమీకరణకు ఇబ్బందులు పడుతున్నాయి. కొన్ని కంపెనీలనైతే పరిశీలిస్తున్నాం.

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ఒప్పందం తర్వాత ఇపుడు స్థిరీకరణపై మీ దృష్టి ఉందా?
ప్రస్తుతానికి పోర్ట్‌ఫోలియో కొనుగోళ్లు అవసరం లేదు. అయితే చేయమని చెప్పలేం. ఒక వేళ ఆర్థికంగా కలిసొస్తుందనుకుంటే చేస్తాం. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కూడా ఒక విధంగా పోర్ట్‌ఫోలియో కొనుగోలే.

ఆర్‌బీఐ విధాన పత్రం ప్రకారం.. బ్యాంకు లైసెన్సులను దిగ్గజాలకు ఇవ్వడానికి సుముఖంగా ఉంది. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కొనుగోలు తర్వాత మరింత బలపడ్డారు. మీకు ఆ ఉద్దేశం ఉందా?
ఒక బ్యాంకుగా మారడానికి మేం ముందుకెళతాం. అయితే అది చేస్తామా లేదా అన్నది చెప్పలేం. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ఏకీకరణకు కొన్నేళ్లు పట్టొచ్చు. ఆర్‌బీఐ విధానాలకు అనుగుణంగా ప్రతిదీ మార్చుకోవాల్సి ఉంటుంది. అందుకు సమయం తప్పదని మాకు తెలుసు.

నిధుల సమీకరణ ప్రణాళికలేమైనా ఉన్నాయా?
ప్రస్తుతానికి మాకు మూలధనం అవసరం లేదు. ఫార్మా వ్యాపారాన్ని బయటకు విభజించాక కూడా.. మాకు సరిపడా నిధులున్నాయి. పిరమాల్‌ ఎంటర్‌ప్రైజెస్‌, పిరమాల్‌ క్యాపిటల్‌ అండ్‌ హౌసింగ్‌లకు కలిపి చూస్తే మూలధన రుణాలు, ఈక్విటీకి మధ్య నిష్పత్తి 1 శాతంలోపే ఉంటుంది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని