59,811 దిగువన బలహీనం!
close

Published : 25/10/2021 01:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

59,811 దిగువన బలహీనం!

సమీక్ష: మిశ్రమ అంతర్జాతీయ సంకేతాలతో గతవారం ఒడుదొడుకులు ఎదుర్కొన్న మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. విదేశీ మదుపర్ల అమ్మకాలు, గరిష్ఠ స్థాయుల్లో లాభాల స్వీకరణ ప్రతికూల ప్రభావం చూపాయి. కంపెనీల త్రైమాసిక ఫలితాలతో షేరు/రంగం ఆధారిత కదలికలు మార్కెట్లను ప్రభావితం చేశాయి. ద్రవ్యోల్బణం, తయారీ ఖర్చులు పెరగడం వల్ల లాభాలు తగ్గొచ్చన్న అంచనాలతో మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. షేర్లు అధిక విలువలకు చేరడం కూడా ఇందుకు తోడైంది. గతవారం భారత్‌లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ 100 కోట్ల మైలురాయిని చేరింది. బ్యారెల్‌ ముడిచమురు 0.8 శాతం పెరిగి 85.5 డాలర్లకు చేరగా, డాలర్‌తో పోలిస్తే రూపాయి 74.9కు బలపడింది. పసిడి, వెండి వంటి విలువైన లోహాలకు కొంత కొనుగోళ్ల మద్దతు లభించింది. అంతర్జాతీయంగా చూస్తే.. ప్రధాన సూచీలు మిశ్రమంగా ముగిశాయి. రష్యా, బ్రిటన్‌ వంటి దేశాల్లో కొవిడ్‌ కేసులు పెరగడం కలవరపెట్టింది. చైనా ఎవర్‌గ్రాండ్‌ వడ్డీల చెల్లింపునకు నిధులు ఏర్పాటు చేసుకున్నట్లు వార్తల రావడం ఉపశమనం ఇచ్చింది. మొత్తం మీద ఈ పరిణామాలతో గత వారం సెన్సెక్స్‌ 0.8 శాతం నష్టంతో 60,822 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 1.2 శాతం తగ్గి 18,115 పాయింట్ల దగ్గర స్థిరపడింది. ఎఫ్‌ఎమ్‌సీజీ, మన్నికైన వినిమయ వస్తువులు, లోహ షేర్లు డీలాపడ్డాయి. బ్యాంకింగ్‌, విద్యుత్‌, యంత్ర పరికరాల స్క్రిప్‌లు లాభపడ్డాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) నికరంగా రూ.7,353 కోట్ల షేర్లను, డీఐఐలు రూ.4,504 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఈ నెలలో ఎఫ్‌పీఐలు ఇప్పటివరకు రూ.3,825 కోట్లు వెనక్కి తీసుకున్నారు.

లాభపడ్డ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి 3:6గా నమోదు కావడం..
అన్ని సూచీల్లో అమ్మకాలను సూచిస్తోంది.

ఈ వారంపై అంచనా: 62,245 పాయింట్ల వద్ద తాజా జీవనకాల గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్‌, లాభాల స్వీకరణతో వెనక్కి వచ్చింది. స్వల్పకాలంలో 59,811- 60,331 శ్రేణిలో మద్దతు లభించే అవకాశం ఉంది. ఈ స్థాయిని కోల్పోతే మరో మద్దతు అయిన 58,553 పరీక్షించొచ్చు. సమీప కాలంలో మదుపర్ల లాభాల స్వీకరణ ధోరణి కొనసాగవచ్చు.

ప్రభావిత అంశాలు: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మన సూచీలు సంకేతాలు తీసుకోవచ్చు. గురువారం అక్టోబరు డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు ముగియనుండడంతో ఒడుదొడుకులు కొనసాగవచ్చు. సెప్టెంబరు త్రైమాసిక ఫలితాలతో షేరు/రంగం ఆధారిత కదలికలు మార్కెట్లను నడిపించనున్నాయి. భవిష్యత్‌పై అంచనాలు, తయారీ ఖర్చులపై యాజమాన్యాల వ్యాఖ్యలు కీలకం కానున్నాయి. ఈ వారం టెక్‌ మహీంద్రా, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, సిప్లా, ఐటీసీ, ఎల్‌ అండ్‌ టీ, మారుతీ సుజుకీ, టైటన్‌, బజాజ్‌ ఆటో, అదానీ పోర్ట్స్‌, టాటా పవర్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, యూపీఎల్‌ వంటి సంస్థలు ఫలితాలు వెలువరించనున్నాయి. ఈ వారం ఫినో పేమెంట్స్‌ బ్యాంక్‌, ఎఫ్‌ఎస్‌ఎన్‌ ఇ-కామర్స్‌ వెంచర్స్‌ (నైకా) పబ్లిక్‌ ఇష్యూలు ప్రారంభం కానున్నాయి. మౌలిక రంగ గణాంకాలపై దృష్టి పెట్టొచ్చు. అంతర్జాతీయంగా చూస్తే.. నాలుగు కేంద్ర బ్యాంకులు (కెనడా, బ్రెజిల్‌, జపాన్‌,  ఈసీబీ) వడ్డీ రేట్ల నిర్ణయాలు ప్రకటించనున్నాయి. అమెరికా, యూరోజోన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌, దక్షిణ కొరియా జీడీపీ గణాంకాలు రానున్నాయి. అమెరికా బాండు రాబడులపై కన్నేయొచ్చు. ముడి చమురు ధరల జోరు కొనసాగితే మార్కెట్లలో లాభాలకు కళ్లెం పడొచ్చు. డాలర్‌తో పోలిస్తే రూపాయి కదలికలు, ఎఫ్‌ఐఐ పెట్టుబడుల నుంచి కూడా సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు.

తక్షణ మద్దతు స్థాయులు: 60331, 59811, 58952
తక్షణ నిరోధ స్థాయులు: 61420, 61880, 62245

సెన్సెక్స్‌ 59,811 దిగువకు చేరితే మరింత బలహీనపడొచ్చు.

- సతీశ్‌ కంతేటి, జెన్‌ మనీ


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని