నియామకాలు పెరిగాయ్‌
close

Published : 26/10/2021 01:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నియామకాలు పెరిగాయ్‌

ప్రస్తుత త్రైమాసికంపై నివేదిక

ముంబయి: దేశంలో ప్రస్తుత త్రైమాసికంలో నియామకాలు పెరుగుతున్నాయని.. ఉద్యోగ మార్కెట్లో రికవరీకి ఇది సంకేతమని ఒక నివేదిక పేర్కొంది. అంతక్రితం ఏడాది ఇదే మూడు నెలలతో పోలిస్తే అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో ఇంజినీరింగ్‌, తయారీ, సాంకేతిక రంగాల ఆధ్వర్యంలో నియమాకాలు పెరిగాయని అంతర్జాతీయ నియామక సంస్థ మైఖేల్‌ పేజ్‌ ఇండియా విడుదల చేసిన నివేదిక చెబుతోంది. ఆర్థిక కార్యకలాపాలు రాణించడం, భారీ టీకా కార్యక్రమంతో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు ఇందుకు కారణాలుగా నిలిచాయని తెలిపింది. ఐటీయేతర రంగాలైన లీగల్‌, మానవ వనరుల విభాగాల్లోనూ మూడో త్రైమాసికంలో ఉద్యోగాలు పెరిగాయి. ‘ప్రస్తుత త్రైమాసికంలో 14% మేర నియామకాలు వృద్ది చెందాయి. ఫిబ్రవరి-మార్చిలో నుంచి పరిస్థితి మెరుగుపడుతూ వచ్చింది. కంపెనీలు పెట్టుబడులు పెంచడం, తక్కువ రుణ స్థాయిలు కూడా ఇందుకు దోహదం చేసింది. భారత కార్మిక మార్కెట్‌పై అంతర్జాతీయీకరణ, ఆటోమేషన్‌ ప్రభావం చూపుతోంది. సరైన నైపుణ్యం, అందిపుచ్చుకోవడం ఆవశ్యకతను చెబుతోంద’ని మైఖేల్‌ పేజ్‌ ఇండియా ఎండీ నికోలస్‌ డుమౌలిన్‌ పేర్కొన్నారు.

సంక్షిప్తంగా..

బాసెల్‌-3 బాండ్ల జారీ ద్వారా రూ.1,500 కోట్ల నిధుల్ని సమీకరించినట్లు ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్‌ తెలిపింది.

హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలో 4.99 శాతం వాటాను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కొనుగోలు చేయగా, దీనికి కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపింది.

దేశ వ్యాప్తంగా పంపిణీ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించే ప్రణాళికలో భాగంగా 100 కొత్త డిజిటల్‌ ఆధారిత శాఖల్ని తెరుస్తున్నట్లు టాటా ఏఐఏ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ వెల్లడించింది.

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలో (ఎన్‌ఎస్‌ఈ) నమోదిత మదుపర్ల సంఖ్య 5 కోట్లను అధిగమించింది. 3 కోట్ల నుంచి 4 కోట్లకు మదుపర్ల సంఖ్య చేరడానికి 15 నెలల సమయం పట్టగా, 4 నుంచి 5 కోట్లకు కేవలం 7 నెలల కంటే తక్కువ సమయమే పట్టిందని ఎన్‌ఎస్‌ఈ తెలిపింది.

టాటా స్టీల్‌ తమ యూకే ప్లాంట్‌లో (సౌత్‌ వేల్స్‌లోని పోర్ట్‌ టాల్బోట్‌ సైట్‌) ఇంధనం ఆదా చేసే 30 మెగావాట్ల జనరేటర్‌ను కొత్తగా ఏర్పాటు చేసినట్లు తెలిపింది. దీంతో ఇంధన బిల్లు ప్రతి ఏడాది మిలియన్‌ పౌండ్లలో (1 మి.పౌండ్ల విలువ సుమారు రూ.10 కోట్లు) తగ్గుతుందని అంచనా వేసింది.

దేశీయ ప్రీమియం ఇ-బైక్‌ తయారీ సంస్థ ఇమోటోరాడ్‌ (ఈఎం) 3 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.22.5 కోట్లు) నిధుల్ని సమీకరించినట్లు తెలిపింది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని