సంక్షిప్త వార్తలు
close

Published : 26/10/2021 03:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సంక్షిప్త వార్తలు

హైదరాబాద్‌కు విస్తరించిన వెంచర్‌ కేటలిస్ట్స్‌

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలోని అతిపెద్ద ఇంక్యుబేటర్‌, యాక్సెలరేటర్లలో ఒకటైన వెంచర్‌ కేటలిస్ట్స్‌ హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 100 నగరాల్లో పదివేల మంది ఏంజెల్‌ ఇన్వెస్టర్ల నెట్‌వర్క్‌ను సిద్ధం చేసి అంకుర సంస్థలను, అగ్రశ్రేణి సంస్థలుగా తీర్చిదిద్దాలనేది తమ లక్ష్యమని వెంచర్‌ కేటలిస్ట్స్‌ ఈ సందర్భంగా పేర్కొంది. ప్రస్తుతం ఈ సంస్థ 45 నగరాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. దక్షిణాదిలోని హైదరాబాద్‌, బెంగుళూరు, చెన్నై నగరాలు... అంకుర సంస్థలకు కేంద్రస్థానాలుగా ఎదుగుతున్నాయని, నైపుణ్యం కల మానవ వనరులు, ఆర్‌అండ్‌డీ కేంద్రాలు, మౌలిక సదుపాయాలు ఉండటం దీనికి ప్రధాన కారణమని వెంచర్‌ కేటలిస్ట్స్‌ అధ్యక్షుడు అపూర్వ రంజన్‌ శర్మ పేర్కొన్నారు. అంతేగాక ఈ నగరాల్లో ఏంజెల్‌ ఇన్వెస్టర్ల సంఖ్యా అధికంగా ఉందన్నారు. కేవలం ప్రధాన నగరాలకే పరిమితం కాకుండా, ద్వితీయ- తృతీయ శ్రేణి నగరాలకు చెందిన అంకుర సంస్థలకు సైతం అండగా నిలవాలనేది తమ లక్ష్యమని ఆయన వివరించారు.


టీవైఈ 2021 గ్రాండ్‌ ఫినాలే విజేత ‘రిక్రూటీన్‌’

ఈనాడు, హైదరాబాద్‌:  టై యంగ్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ (టీవైఈ) 2021 గ్రాండ్‌ ఫినాలే లో ‘రిక్రూటీన్‌’ టీమ్‌ విజేతగా నిలిచింది. దృశ్యమాధ్యమ పద్ధతిలో ఈ పోటీలను నిర్వహించారు. సీనియర్‌ సిటిజన్లలో నైపుణ్యాలు పెంపొందించే ప్లాట్‌ఫామ్‌ అయిన రిక్రూటీన్‌ వ్యాపార ప్రణాళిక నచ్చటంతో దీన్ని విజేతగా న్యాయనిర్ణేతల బృందం ఎంపిక చేసింది. శారద జయకృష్ణన్‌ (టెరుమో పెన్‌పోల్‌), ఇజాక్‌ రాజ్‌లునార్‌ (ఓపెన్‌ టెక్ట్స్‌), శ్రీదేవి దేవిరెడ్డి (జెల్ప్‌మోక్‌ డిజైన్‌ అండ్‌ టెక్‌) న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. రిక్రూటిన్‌ బృందంలో ప్రద్యుమ్న్‌ వర్మ, ఆషి అగర్వాల్‌, జియాన్నే మరియా మార్టిన్స్‌, చార్వి టోక్లాస్‌, అథర్వ్‌ తపాడియా ఉన్నారు. ఈ బృందానికి డాక్టర్‌ బాలాజీ భైరవ్‌భట్ల మెంటార్‌గా వ్యవహరించారు. ద్వితీయ స్థానాన్ని ‘ప్రొటీన్స్‌’ గెలుచుకుంది. గ్రాండ్‌ ఫినాలేకు నాలుగు బృందాలు- అలోహాద్రోన్స్‌, ఫార్మర్స్‌కనెక్ట్‌, ప్రొటీన్స్‌, రిక్రూటీన్స్‌ అర్హత పొందాయి. తమ వ్యాపార ప్రణాళికలను ఈ బృందాలు న్యాయనిర్ణేతల ముందు ఆవిష్కరించాయి. ఈ సందర్భంగా టై హైదరాబాద్‌ అధ్యక్షుడు మనోహర్‌ రెడ్డి మాట్లాడుతూ ఈ పోటీలో ఆసక్తికరమైన వ్యాపార ప్రణాళికలు వచ్చాయని అన్నారు. సస్టెయినబిలిటీ డెవలప్‌మెంట్‌ గోల్స్‌ (17 ఎస్‌డీజీ) పై దృష్టి సారించాలని, అందులో ఎన్నో భవిష్యత్తు అవకాశాలు కనిపిస్తాయని ఈ పోటీలో పాల్గొన్న బృందాలకు సూచించారు.


2021-22లో భారత్‌ వృద్ధి 9.5%
యూబీఎస్‌ సెక్యూరిటీస్‌ అంచనా

ముంబయి: ఈ ఆర్థిక సంవత్సరంలో (2021-22) భారత్‌ 9.5 శాతం మేర వృద్ధి సాధిస్తుందని స్విస్‌ బ్రోకరేజీ సంస్థ యూబీఎస్‌ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ కొవిడ్‌-19 ప్రభావం నుంచి వేగంగా రికవరీ బాటలో నడుస్తోందని పేర్కొంది. రెండో అర్ధ భాగంలో గిరాకీ పుంజుకునే అవకాశం ఉండటంతో వృద్ధి పెరిగే అవకాశం ఉందని తెలిపింది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.7 శాతానికి పరిమితం కావొచ్చని అంచనా వేసింది. ప్రభుత్వం బడ్జెట్‌ అంచనాల్లో దేశ వృద్ధి 10.5 శాతం ఉండొచ్చని పేర్కొనగా, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) 9.5 శాతానికి తగ్గించింది. గత ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధి 7.3 శాతం మేర క్షీణించిన సంగతి తెలిసిందే.


కేబుల్‌ టీవీ రంగంలో పోటీపై ట్రాయ్‌ చర్చా పత్రం

దిల్లీ: కేబుల్‌ టీవీ సేవల్లో మార్కెట్‌ నిర్మాణం, పోటీ తదితర అంశాలపై ట్రాయ్‌ ఒక చర్చా పత్రాన్ని జారీ చేసింది. డిజిటల్‌ సాంకేతికత నేపథ్యంలో ఈ రంగంలో ఏకఛత్రాధిపత్యం తదితర అంశాలను పరిశీలించడం ముఖ్యమని ఈ సందర్భంగా ట్రాయ్‌ పేర్కొంది. సమాచార, బ్రాడ్‌క్యాస్టింగ్‌ మంత్రిత్వ శాఖ సూచనల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ట్రాయ్‌) ఒక ప్రకటనలో పేర్కొంది. చాలా మంది కేబుల్‌ ఆపరేటర్లు ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు(ఐఎస్‌పీలు), టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్ల నుంచి ఫీడ్స్‌ తీసుకుని బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందిస్తున్నారని ఆ చర్చాపత్రంలో ట్రాయ్‌ పేర్కొంది. వినియోగదార్లు సైతం ఒకే దగ్గర అన్ని సేవలు లభించాలని కోరుకోవడం కనిపిస్తోంది. కాబట్టి కేబుల్‌ సేవల ఏకఛత్రాధిపత్యాన్ని పరిశీలించాల్సిన అవసరం కనిపిస్తోందని 91 పేజీల చర్చాపత్రంలో తెలిపింది. దీనిపై అన్ని వర్గాలు నవంబరు 22, 2021లోగా తమ అభిప్రాయాలను తెలపవచ్చని.. వాటిపై అభ్యంతరాలుంటే డిసెంబరు 6, 2021లోగా చెప్పాలని సూచించింది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని