నాలుగు రోజుల తర్వాత లాభాలు
close

Published : 26/10/2021 04:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాలుగు రోజుల తర్వాత లాభాలు

సమీక్ష
దుమ్మురేపిన ఐసీఐసీఐ బ్యాంక్‌ షేరు

నాలుగు రోజుల వరుస నష్టాలకు అడ్డుకట్ట పడింది. సెప్టెంబరు త్రైమాసికంలో రికార్డు లాభాలు నమోదు చేయడంతో ఐసీఐసీఐ బ్యాంక్‌ షేరు 11 శాతం దూసుకెళ్లడం మార్కెట్లకు దన్నుగా నిలిచింది. ఇంట్రాడేలో రూ.859.70 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకిన షేరు.. చివరకు 10.80 శాతం లాభంతో రూ.841.05 వద్ద ముగిసింది. అయితే డెరివేటివ్‌ కాంట్రాక్టుల ముగింపు దగ్గరపడటంతో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. బ్యాంకింగ్‌ షేర్లు పరుగులు తీశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 18 పైసలు తగ్గి 75.08 వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లలో షాంఘై, హాంకాంగ్‌, సియోల్‌ లాభపడగా, టోక్యో నష్టపోయింది. ఐరోపా సూచీలు లాభాల్లో ట్రేడయ్యాయి.

సెన్సెక్స్‌ ఉదయం 61,398.75 పాయింట్ల వద్ద దూకుడుగా ప్రారంభమైంది. ఇంట్రాడేలో 61,404.99 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. వెంటనే నష్టాల్లోకి జారుకుంది. అమ్మకాల ఒత్తిడితో 60,449.68 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది. అయితే దిగువ స్థాయి కొనుగోళ్లతో కోలుకుని 145.43 పాయింట్ల లాభంతో 60,967.05 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ సైతం 10.50 పాయింట్లు పెరిగి 18,125.40 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 17,968.50- 18,241.40 పాయింట్ల మధ్య కదలాడింది.

సెన్సెక్స్‌ 30 షేర్లలో 8 రాణించాయి. యాక్సిస్‌ బ్యాంక్‌ 3.45%, డాక్టర్‌ రెడ్డీస్‌ 0.85%, ఎస్‌బీఐ 0.68% లాభపడ్డాయి. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 3.04%, బజాజ్‌ ఆటో 2.60%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 2.36%, ఏషియన్‌ పెయింట్స్‌ 2.20%, మారుతీ 1.99%, నెస్లే 1.67%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 1.56%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1.49% చొప్పున డీలాపడ్డాయి. రంగాల వారీ సూచీల్లో బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ 2.30% వరకు పెరిగాయి. స్థిరాస్తి, వాహన, మన్నికైన వినిమయ వస్తువులు, యుటిలిటీస్‌ పడ్డాయి. బీఎస్‌ఈలో 1006 షేర్లు లాభాల్లో ముగియగా, 2363 స్క్రిప్‌లు నష్టపోయాయి. 161 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని