బయోలాజికల్‌ ఇ.తో డీఎఫ్‌సీ ఒప్పందం
close

Published : 26/10/2021 04:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బయోలాజికల్‌ ఇ.తో డీఎఫ్‌సీ ఒప్పందం

రూ.375 కోట్ల సాయం
వచ్చే నెలాఖరు నాటికి ‘కార్బెవ్యాక్స్‌’ టీకా  
ఈనాడు - హైదరాబాద్‌

కొవిడ్‌-19 టీకా ‘కార్బెవ్యాక్స్‌’ను బయోలాజికల్‌ ఇ.లిమిటెడ్‌ (బీఇ) వచ్చే నెలాఖరు నాటికి ఆవిష్కరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘కార్బెవ్యాక్స్‌’ ఆర్‌బీడీ ప్రొటీన్‌ సబ్‌-యూనిట్‌ టీకా. దీనిపై ప్రస్తుతం మూడోదశ క్లినికల్‌ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షలు త్వరలో పూర్తవుతాయని, తదుపరి భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) నుంచి అనుమతి తీసుకొని టీకా విడుదల చేస్తామని బయోలాజికల్‌ ఇ. ఎండీ మహిమా దాట్ల తెలిపారు.

టీకా ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించేందుకు వీలుగా బయోలాజికల్‌ ఇ.కి యూఎస్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (డీఎఫ్‌సీ) 50 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.375 కోట్లు) నిధులు సమకూర్చనుంది. కొంతకాలం క్రితం జరిగిన ‘క్వాడ్‌’ సదస్సులో టీకా లభ్యతను పెంపొందించేందుకు చేయూతనిస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఇచ్చిన హామీకి అనుగుణంగా ఆ దేశ ప్రభుత్వం ఈ నిధులు సమకూర్చుతోంది. సోమవారం హైదరాబాద్‌లో యూఎస్‌ ఇంటర్నేషనల్‌ డీఎఫ్‌సీ, బయోలాజికల్‌ ఇ. మధ్య దీనిపై ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమంలో యూఎస్‌ ఛార్జ్‌ డి అఫైర్స్‌ పాట్రిసియా లూసినా, యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ జోయల్‌ రీఫ్‌మ్యాన్‌, కేంద్ర ప్రభుత్వ విదేశీ వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శి వాణి రావు, తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్‌, జపాన్‌ కాన్సుల్‌ జనరల్‌ తగ మసయుకి, ఆస్ట్రేలియా కాన్సుల్‌ జనరల్‌ సారా కిర్లీ పాల్గొన్నారు.

బయోలాజికల్‌ ఇ. ఎండీ మహిమా దాట్ల ఈ సందర్భంగా స్పందిస్తూ తొలివిడతగా 10 కోట్ల డోసుల ‘కార్బెవ్యాక్స్‌’ టీకా సరఫరా చేస్తామని అన్నారు. కొన్ని డోసుల టీకాను ఇప్పటికే పరీక్షల నిమిత్తం హిమాచల్‌ప్రదేశ్‌లోని కసౌలిలోని సెంట్రల్‌ డ్రగ్స్‌ లేబొరేటరీ (సీడీఎల్‌్)కి పంపినట్లు తెలిపారు. ‘కార్బెవ్యాక్స్‌’ టీకాను విడుదల చేసిన నెల రోజుల తర్వాత... పిల్లలకు ఇవ్వటానికి అనువైన టీకా తీసుకువచ్చే ఆలోచన ఉందన్నారు. తమకు ప్రస్తుతం ఏటా 100 కోట్ల డోసుల ‘కార్బెవ్యాక్స్‌’ టీకా, 60 కోట్ల డోసుల జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకా ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. భారతతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలకు టీకా అందించే లక్ష్యంతో బయోలాజికల్‌ ఇ. భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు డీఎఫ్‌సీ ఛీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ డేవిడ్‌ మార్చిక్‌ పేర్కొన్నారు. దీనివల్ల బయోలాజికల్‌ ఇ. టీకా ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని అన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని