సంక్షిప్త వార్తలు
close

Published : 27/10/2021 02:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సంక్షిప్త వార్తలు

ఐఓసీఎల్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌గా సతీష్‌కుమార్‌ వడుగూరి

ఈనాడు, దిల్లీ: ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఓసీఎల్‌) మార్కెటింగ్‌ డైరెక్టర్‌గా సతీష్‌కుమార్‌ వడుగూరి నియమితులయ్యారు. ఇప్పటివరకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఉన్న ఆయన్ను కొత్త పోస్టులో నియమిస్తూ కేంద్ర నియామక వ్యవహారాల మంత్రివర్గ సంఘం నిర్ణయించినట్లు సిబ్బంది వ్యవహారాలశాఖ జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. 2025 జులై 31వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.


కొవిడ్‌ పూర్వస్థితికి కొనుగోళ్లు

నెక్సస్‌ మాల్స్‌ క్లస్టర్‌ డైరెక్టర్‌ తన్వీర్‌ షేఖ్‌

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌-19 కేసుల విస్తృతి తగ్గుముఖం పట్టడంతో, మళ్లీ వ్యాపారాల్లో వృద్ధి కనిపిస్తోందని నెక్సస్‌ మాల్స్‌ క్లస్టర్‌ డైరెక్టర్‌ తన్వీర్‌ షేఖ్‌ అన్నారు. హైదరాబాద్‌లోని ఫోరం సుజనా మాల్‌ ఇప్పటికే ఈ లక్ష్యాన్ని చేరుకుందన్నారు. కొవిడ్‌ ముందుతో పోలిస్తే, వినియోగదారులు సంఖ్యా పరంగా 60-65 శాతమే వస్తున్నప్పటికీ.. కొనుగోళ్ల విలువ మాత్రం కొవిడ్‌ ముందు స్థాయికి పెరిగిందని వెల్లడించారు. దేశ వ్యాప్తంగా ఈ ఏడాది ఏడు ఫోరమ్‌ మాల్స్‌ను తాము స్వాధీనం చేసుకున్నామని, ఇందులో హైదరాబాద్‌ ఫోరమ్‌ మాల్‌ కూడా ఉందన్నారు. మాల్‌ పేరును త్వరలో మారుస్తామని తెలిపారు. 12 నగరాల్లో 16 నెక్సస్‌ మాల్స్‌ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఫోరమ్‌ సుజనా మాల్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత పలు రకాలుగా అభివృద్ధి చేసి, వినియోగదారులకు కొత్త అనుభూతి కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. దీనికోసం దాదాపు రూ.30 కోట్ల మేరకు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. కొత్తగా 15 ప్రత్యేక బ్రాండ్లు ఇక్కడ ప్రారంభించినట్లు తెలిపారు.  


యూబీఐ గృహరుణం @ 6.40 శాతం

ఈనాడు, హైదరాబాద్‌: యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ) గృహరుణాన్ని 6.40 శాతం వడ్డీరేటుకే అందిస్తున్నట్లు వెల్లడించింది. ఈ బ్యాంకు అందిస్తున్న గృహరుణాలపై ఇప్పటివరకు ఇదే కనీస వడ్డీ శాతం. తగ్గించిన వడ్డీ రేట్లు ఈనెల 27 నుంచే అమల్లోకి వస్తాయి. కొత్తగా గృహరుణం తీసుకోబోయే వారికీ, ఇతర బ్యాంకు నుంచి రుణాలను బదిలీ చేసుకునే వారికీ ఈ వడ్డీ రేటు వర్తిస్తుందని వెల్లడించింది.  


మధుమేహానికి గ్లెన్‌మార్క్‌ నుంచి మిశ్రమ ఔషధం

ఈనాడు, హైదరాబాద్‌: గ్లెన్‌మార్క్‌ ఫార్మా మధుమేహ వ్యాధికి ఒక మిశ్రమ ఔషధాన్ని దేశీయ విపణిలోకి విడుదల చేసింది. ఇది రెమోగ్లిఫ్లోజిన్‌ 100 ఎంజీ, విల్దాగ్లిప్టిన్‌ 50 ఎంజీ, మెట్‌ఫార్మిన్‌ 500/ 1000 ఎంజీ ఔషధాల మిశ్రమ (కాంబినేషన్‌) ఔషధం. ప్రపంచ వ్యాప్తంగా దీన్ని తొలిసారిగా ఆవిష్కరించిన ఘనత తమదేనని గ్లెన్‌మార్క్‌ ఫార్మా పేర్కొంది. ఈ మందు మధుమేహాన్ని నియంత్రించడంలో సమర్థంగా పనిచేస్తుందని పేర్కొంది. ప్రస్తుతం ఈ ఔషధాలు వాడేందుకు రోజుకు రూ.75 వరకు అవుతోందని, తాము ఒక్కో ట్యాబ్లెట్‌ను రూ.16.50 కు ఇస్తున్నందున, రోజుకు 2 ట్యాబ్లెట్లకు రూ.33 మాత్రమే అవుతుందని, మధుమేహ వ్యాధిగ్రస్తులకు నెలకు అయ్యే ఖర్చు తగ్గుతుందని వివరించింది.


సహకార బ్యాంకుల పర్యవేక్షణకు ఆర్‌బీఐ కొత్త డెస్క్‌

ముంబయి: ఒత్తిడిని ఎదుర్కొంటున్న పెద్ద సహకార బ్యాంకుల గుర్తింపు, పర్యవేక్షణ కోసం రిజర్వ్‌ బ్యాంక్‌ కొత్త డెస్క్‌ను ఏర్పాటు చేసినట్లు బ్యాంకింగ్‌ పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. ఈ డెస్క్‌ బాధ్యతలను ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ చూస్తారు. భారీ సహకార బ్యాంకులను ఆర్‌బీఐ మూడు రకాలుగా విభజించింది. ఒత్తిడి ఎదుర్కొంటున్న సంస్థలకు ఎరుపు, క్రియాశీల పర్యవేక్షణ అవసరమైన వాటికి పసుపు, పనితీరు ప్రమాణాలు అందుకున్న వాటికి ఆకుపచ్చ రంగులను కేటాయించింది. ఈ బ్యాంకుల లాభదాయకత, ఆస్తుల నాణ్యత, మూలధనం, వ్యాపార వృద్ధి, వినియోగదారు సేవలు, నష్టభయం వంటి అంశాలను త్రైమాసికాల వారీగా ఆర్‌బీఐ పర్యవేక్షిస్తుంది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని