ఐపీఎల్‌.. కార్పొరేట్లకు కాసుల్‌..
close

Updated : 27/10/2021 04:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐపీఎల్‌.. కార్పొరేట్లకు కాసుల్‌..

 కొత్త జట్లతో పెరగనున్న ఫ్రాంచైజీల ఆదాయం

టీవీ ఒప్పందాలతోనే ఎక్కువ డబ్బులు 

మన దేశంలో క్రికెట్‌ ఆట మాత్రమే కాదు.. ప్రజలకు భావోద్వేగ  పరమైన అంశం. అది సామాన్యులకైనా.. అపర కుబేరుడైన ముకేశ్‌ అంబానీకైనా ఒకటే. గ్యాలరీలో కూర్చుని కేరింతలు కొట్టేందుకు.. టీవీ ముందు కూర్చుని ఆనందించడంలో అత్యధికులు ఒకే మాదిరి వ్యవహరిస్తుంటారు.  ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)తో క్రికెట్‌ వినోదం మరో స్థాయికి చేరింది. తాజాగా రెండు కొత్త ఐపీఎల్‌ టీంల కోసం ఎవరూ ఊహించని మొత్తానికి కంపెనీలు బిడ్‌లు వేయడం అందరినీ ఆశ్చర్యపరచింది.

లఖ్‌నవూ జట్టు కోసం ఆర్‌పీ-సంజీవ్‌ గోయెంకా గ్రూప్‌ ఏకంగా రూ.7,090 కోట్లు చెల్లిస్తుండగా.. అహ్మదాబాద్‌ ఫ్రాంఛైజీ కోసం అంతర్జాతీయ ప్రైవేటు ఈక్విటీ సంస్థ సీవీసీ క్యాపిటల్‌ పార్టనర్స్‌ రూ.5,625 కోట్లు వెచ్చించనుంది. సీవీసీ సంస్థ స్పెయిన్‌కు చెందిన అగ్రశ్రేణి సాకర్‌ లీగ్‌ లా లిగాతో 300 కోట్ల డాలర్ల (సుమారు రూ.22,500 కోట్ల)కు ఒప్పందం చేసుకోగా, క్రికెట్‌లోకి అడుగు పెట్టడం ఇదే తొలిసారి. 13 ఏళ్ల కిందట రాజస్థాన్‌ రాయల్స్‌ కోసం సంబంధిత యాజమాన్యం చెల్లించిన ధరతో పోలిస్తే వీరు 11 రెట్లు ఎక్కువ చెల్లించినట్లు లెక్క. క్రికెట్‌కున్న క్రేజ్‌ ఎటువంటిదో ఈ మొత్తాలే చెబుతున్నాయి.


గోయెంకా.. ఎప్పటి నుంచో

గత దశాబ్ద కాలంలో 600 కోట్ల డాలర్ల (సుమారు రూ.45,000 కోట్ల) ఆస్తులు కలిగిన గోయెంకా కంపెనీ విద్యుత్‌, ఇంధనం, రిటైల్‌, ఐటీ ఆధారిత సేవలతో పాటు ఆటలపైనా దృష్టి సారిస్తూ వచ్చింది. ఐపీఎల్‌లో నిషేధిత జట్టు స్థానంలో రైజింగ్‌ పుణె జట్టును తీసుకొచ్చి ఫైనల్‌(2017)లో ముంబయి చేతిలో 1 రన్‌తో ఓడారు. ఆ జట్టు కేవలం రెండు సీజన్లకే పరిమితం కాగా, ఇప్పుడు లఖ్‌నవూ జట్టుతో గోయెంకా గ్రూప్‌ ఇపుడు మళ్లీ ఐపీఎల్‌లోకి వచ్చినట్లయింది. ఉత్తరప్రదేశ్‌లో ఆర్‌పీఎస్‌జీకి వ్యాపార ప్రయోజనాలున్నాయి. ఎన్నో స్పెన్సర్‌ రిటైల్‌ స్టోర్లున్నాయి. లఖ్‌నవూ జట్టు సొంతం కావడంపై ఆర్‌పీఎస్‌జీ అధిపతి గోయెంకా సంతోషంగా ఉన్నట్లు చెబుతున్నారు. అహ్మదాబాద్‌ జట్టును సొంతం చేసుకున్న ఐరెలియా కంపెనీ(సీవీసీ క్యాపిటల్‌ పార్టనర్స్‌) విషయానికొస్తే ఒక అంతర్జాతీయ పీఈ సంస్థ దేశంలోని ఒక ప్రధాన స్పోర్ట్‌ టీంను సొంతం చేసుకోవడం ఇదే తొలిసారి.


గట్టి కారణాలే ఉన్నాయ్‌..

ఐపీఎల్‌ జట్టును సొంతం చేసుకునేందుకు కార్పొరేట్లు ప్రయత్నించేందుకు గట్టి కారణాలే ఉన్నాయి. జట్టు కలిగి ఉండడం వల్ల కంపెనీ పేరు దేశమంతా మారుమోగుతుంది. అది కచ్చితంగా ఆర్థిక వృద్ధి లేదా లాభదాయకతకు దారితీస్తుందని అయితే చెప్పలేం. కానీ ఫ్రాంచైజీల ఆదాయాలు మాత్రం స్థిరంగానే ఉండడం కలిసొచ్చే అంశం. అంటే గ్లామర్‌తో కూడిన ప్రచారంతో పాటు.. ఆదాయం కూడా వస్తుందన్నమాట.


నాలుగు మార్గాల్లో ఆదాయాలు..

ఐపీఎల్‌ టీంలకు నాలుగు ఆదాయ మార్గాలుంటాయి. ఒకటేంటంటే.. బీసీసీఐ సెంట్రల్‌ పూల్‌లో వాటా. మొత్తం ఆదాయాల్లో నాలుగింట మూడొంతుల భాగం దీని నుంచే వస్తుంది. ఇక స్పాన్సర్‌షిప్‌లు, టికెట్‌ విక్రయాలు, ప్రైజ్‌ మనీలు మిగతా మూడు మార్గాలు. పోటీల ప్రత్యక్ష ప్రసారానికి సంబంధించి బ్రాడ్‌క్యాస్టింగ్‌ ఒప్పందాల నుంచి వచ్చే అన్ని వసూళ్లు సెంట్రల్‌ పూల్‌ కిందకు వస్తాయి. ఇందులో 50 శాతం బీసీసీఐకు వెళతాయి. మిగతా 50 శాతాన్ని ఫ్రాంచైజీలకు సమానంగా పంచుతారు. బ్రాడ్‌క్యాస్టింగ్‌ హక్కులు(టీవీ, స్ట్రీమింగ్‌, రేడియో) విక్రయించడం ద్వారా సెంట్రల్‌ పూల్‌కు ఎక్కువ ఆదాయాలు వస్తాయి. అంటే కొత్త బ్రాడ్‌క్యాస్టింగ్‌ ఒప్పందాలు కుదిరినపుడల్లా ఎక్కువ డబ్బులు ఫ్రాంచైజీ జట్లకు వస్తాయన్నమాట. ఇప్పటి దాకా జరిగిన టీవీ ఒప్పందాలను పరిశీలిస్తే.. 2008లో ఐపీఎల్‌ ప్రారంభమైనపుడు తొలి ఒప్పందం కింద 10 ఏళ్ల పాటు సోనీకి హక్కులిచ్చారు. ఏటా రూ.911 కోట్లు చెల్లించింది. 2017లో ఏటా రూ.3270 కోట్ల చొప్పున అయిదేళ్ల పాటు చెల్లించడానికి స్టార్‌ ముందుకొచ్చింది. 2022 ఐపీఎల్‌తో ఇది ముగుస్తుంది. కొత్తగా రెండు టీంలు రావడంతో తదుపరి అయిదేళ్లకు (2023-2027) కొత్త ఒప్పందాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఇది ఏడాదికి రూ.6,000 కోట్ల వరకు ఉండొచ్చు. ఇది ఫ్రాంచైజీలకు మరింత ఆదాయాన్ని తెచ్చిపెట్టనుంది.


కొత్త జట్లు వస్తే..

ఇపుడు తాజాగా రెండు కొత్త జట్లు ఐపీఎల్‌లోకి రావడం అనేది అందరికీ కలిసొచ్చే అంశం.  రెండు కొత్త జట్ల వల్ల పోటీల సంఖ్యా పెరుగుతుంది. అంటే ప్రసారదారుకు మరిన్ని గంటల కంటెంట్‌ వస్తుంది. ఫ్రాంచైజీల ఆదాయాల్లో నాలుగింట మూడింతలుండే సెంట్రల్‌ పూల్‌కు ఇది మరింత ఆదాయాన్ని తెస్తుంది. కొత్త జట్లకేమో ఇది శుభారంభం అవుతుంది. పాత జట్లకు ఆదాయ వృద్ధి అవుతుంది. అన్నిటికంటే మించి లాభాలూ పెరుగుతాయి.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని