ఐఓబీ లాభం రూ.376 కోట్లు
close

Published : 28/10/2021 03:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐఓబీ లాభం రూ.376 కోట్లు

దిల్లీ: ప్రభుత్వ రంగ ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ (ఐఓబీ) సెప్టెంబరు త్రైమాసికంలో రూ.376 కోట్ల స్టాండలోన్‌ నికర లాభాన్ని నమోదు చేసింది. 2020-21 ఇదే త్రైమాసిక లాభం రూ.148 కోట్లతో పోలిస్తే ఇది రెట్టింపునకు పైగా ఉంది. నికర వడ్డీ మార్జిన్‌ (ఎన్‌ఐఎం) 2.57 శాతం నుంచి 2.43 శాతానికి తగ్గడంతో పాటు వడ్డీ ఆదాయం రూ.4,363 కోట్ల నుంచి రూ.4,254 కోట్లకు పరిమితమైంది. స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్‌పీఏ) 13.04 శాతం నుంచి 10.66 శాతానికి, నికర ఎన్‌పీఏలు 4.30 శాతం నుంచి 2.77 శాతానికి మెరుగయ్యాయి. సమీక్షా త్రైమాసికంలో రూ.1,400 కోట్ల మొండి బకాయిలు జతయ్యాయి. వీటిలో 70 శాతం 3 కంపెనీలకు (2 శ్రేయీ గ్రూప్‌ సంస్థలు-రూ.650 కోట్లు) చెందినవే. ఈ రుణాలకు బ్యాంక్‌ 80 శాతం మేర కేటాయింపులు చేసింది. సాంకేతిక రైటాఫ్‌లు రూ.428.61 కోట్లతో కలిపి మొత్తం నగదు రికవరీ రూ.831.77 కోట్లకు చేరింది. దేవన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ (డీహెచ్‌ఎఫ్‌ఎల్‌) నుంచి రూ.290 కోట్లు వచ్చింది. కేటాయింపుల కవరేజీ నిష్పత్తి 89.36 శాతం నుంచి 92 శాతానికి చేరింది. కేపిటల్‌ టు రిస్క్‌ అసెట్స్‌ నిష్పత్తి (సీఆర్‌ఏఆర్‌) 10.90 శాతం నుంచి 15.41 శాతానికి చేరింది. స్థూల రుణాలు 8.47 శాతం పెరిగి రూ.1,46,940 కోట్లకు, డిపాజిట్లు 9.27 శాతం పెరిగి రూ.2,50,890 కోట్లకు చేరాయి. గత నెలలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) సత్వర దిద్దుబాటు చర్యల (పీసీఏ) నుంచి ఐఓబీని బయటకు తీసుకొచ్చింది. ‘సమీక్షా త్రైమాసికంలో మంచి ఆర్థిక ఫలితాలు నమోదు చేశాం. స్థూల, నికర ఎన్‌పీఏలు తగ్గాయి. టైర్‌-2 బాండ్లను జారీ చేయడం ద్వారా నాలుగో త్రైమాసికంలో రూ.500-1,000 కోట్ల నిధుల్ని సమీకరించనున్నామ’ని బ్యాంక్‌ ఎండీ, సీఈఓ పార్థ ప్రతిమ్‌ సేన్‌గుప్తా వెల్లడించారు.


రూ.1.87 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు
గ్లోబల్‌ ఎమర్జింగ్‌-మార్కెట్‌ బాండ్‌ ఇండెక్స్‌లోకి
  భారత్‌ చేరడంపై జేపీ మోర్గాన్‌ అంచనాలు

దిల్లీ: జేపీ మోర్గాన్‌కు చెందిన ‘గ్లోబల్‌ ఎమర్జింగ్‌-మార్కెట్‌ బాండ్‌ ఇండెక్స్‌లోకి భారత్‌ రాక కారణంగా విదేశీ పెట్టుబడుదార్ల నుంచి 25 బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.1.87 లక్షల కోట్లు) వరకు పెట్టుబడులు రావొచ్చని ఆ బ్యాంక్‌ తన పరిశోధన నివేదికలో పేర్కొంది. కచ్చితంగా ఎంత పెట్టుబడులు వస్తాయనేది దేశీయ, అంతర్జాతీయ పరిణామాలను బట్టి ఉంటుందని జేపీ మోర్గాన్‌ చేస్‌ అండ్‌ కో వ్యూహకర్త ఆర్థన్‌ లూక్‌ పేర్కొన్నారు. సూచీలో భారత్‌కుండే భారీ వెయిటేజీ కారణంగా సూచీలో భారత్‌ చేరే ప్రక్రియకు 10 నెలలకు పైగా సమయం పడుతుందని అన్నారు. జీబీఐ-ఈఎమ్‌లో చైనాను 2020లో చేర్చేందుకూ ఇంతే సమయం పట్టిందని గుర్తు చేశారు. భారత ప్రభుత్వ బాండ్లను చేర్చేందుకు అన్ని ప్రక్రియలనూ సిద్ధం చేస్తున్నట్లు ఈ నెల మొదట్లో జేపీ మోర్గాన్‌ సూచీ బృందం పేర్కొన్న సంగతి తెలిసిందే. యూరోక్లియర్‌ వంటి అంతర్జాతీయ సెంట్రల్‌ సెక్యూరిటీ డిపాజిటరీ ద్వారా యాక్సెస్‌ చేసుకునే సామర్థ్యం; పన్నులపై స్పష్టత అనేవి కీలక ఇబ్బందులుగా ఉన్నాయని మదుపర్లు పేర్కొంటున్నారు. ‘గవర్న్‌మెంట్‌ బాండ్‌ ఇండెక్స్‌-ఎమర్జింగ్‌ మార్కెట్స్‌ గ్లోబల్‌ డైవర్సిఫైడ్‌(జీబీఐ-ఈఎమ్‌)లో గరిష్ఠంగా 10 శాతం వెయిటేజీని పొందేంత భారీ పరిమాణంలోనే భారత బాండ్లు ఉండడం గమనార్హం. ఈ సూచీ నిర్వహణ కింద 250 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.18.75 లక్షల కోట్ల) ఆస్తులున్నాయని లూక్‌ తన నివేదికలో పేర్కొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని