మోల్నుపిరవిర్‌ ఉత్పత్తికి తొలగిన అవరోధాలు
close

Updated : 28/10/2021 05:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మోల్నుపిరవిర్‌ ఉత్పత్తికి తొలగిన అవరోధాలు

‘మెడిసిన్స్‌ పేటెంట్‌ పూల్‌’ తో మెర్క్‌ ఒప్పందం

లండన్‌: కొవిడ్‌-19 వ్యాధిని సమర్థంగా ఎదుర్కొంటుందని భావిస్తున్న ‘మోల్నుపిరవిర్‌’ ఔషధాన్ని ఇతర ఔషధ కంపెనీలు సైతం ఉత్పత్తి చేసేందుకు అమెరికా దిగ్గజ సంస్థ మెర్క్‌ అంగీకరించింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి మద్దతు గల ‘మెడిసిన్స్‌ పేటెంట్‌ పూల్‌’ తో మెర్క్‌, దాని భాగస్వామ్య సంస్థ రిడ్జ్‌బ్యాక్‌ బయోథెరప్యూటిక్స్‌ స్వచ్ఛంద లైసెన్సింగ్‌ ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీనివల్ల మోల్నుపిరవిర్‌ ఔషధాన్ని ఉత్పత్తి చేయాలనుకునే ఔషధ కంపెనీలు మెడిసిన్స్‌ పేటెంట్‌ పూల్‌ నుంచి అనుమతి తీసుకోవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కొవిడ్‌-19 మహమ్మారిని ప్రపంచ అత్యవసర పరిస్థితిగా పరిగణించినంత కాలం మోల్నుపిరవిర్‌ను ఉత్పత్తి చేసే ఔషధ కంపెనీలు రాయల్టీ చెల్లించాల్సిన పనిలేదు. మోల్నుపిరవిర్‌ ఔషధంపై నిర్వహించిన పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చినట్లు మెడిసిన్స్‌ పేటెంట్‌ పూల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఛార్లెస్‌ గోరే పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా బాధితులకు ఈ ఔషధాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రస్తుత ఒప్పందం దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. మోల్నుపిరవిర్‌ ఔషధాన్ని విక్రయించేందుకు అనుమతి కోరుతూ మెర్క్‌ ఇప్పటికే యూఎస్‌ఎఫ్‌డీఏ, యూరోపియన్‌ మెడిసిన్స్‌ ఏజెన్సీ వద్ద దరఖాస్తు చేసింది. దీనికి వచ్చే కొద్ది వారాల్లో అనుమతులు రావచ్చని భావిస్తున్నారు.


కొవాగ్జిన్‌కు అమెరికాలో క్లినికల్‌ పరీక్షలు!

హైదరాబాద్‌: ‘కొవాగ్జిన్‌’ టీకాకు సంబంధించి క్లినికల్‌ పరీక్షలకు అనుమతి కోరుతూ ఇన్వెస్టిగేషనల్‌ న్యూ డ్రగ్‌ అప్లికేషన్‌ (ఐఎన్‌డీ)ని అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) వద్ద దాఖలు చేసినట్లు  భారత్‌ బయోటెక్‌కు అమెరికా భాగస్వామిగా ఉన్న ఆక్యుజెన్‌ ఇంక్‌ తెలిపింది. భారత్‌లో ఈ వ్యాక్సిన్‌ సమర్థతకు అనుగుణంగానే అమెరికాలో కూడా ఉంటుందా అనేది నిర్థారించేలా ఐఎన్‌డీలో ప్రతిపాదించిన మూడోదశ క్లినికల్‌ పరీక్షలుంటాయని సంస్థ వివరించింది. ఇప్పటివరకు అమెరికాలో కొవిడ్‌ టీకా తీసుకోని, లేదా ఎంఆర్‌ఎన్‌ఏ టీకా 2 డోసులు తీసుకుని, కనీసం 6 నెలలు గడిచిన వారిపై కూడా ఈ పరీక్షలు నిర్వహించాలని ప్రతిపాదించారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని