Kims - Sunshine: కిమ్స్‌ చేతికి సన్‌షైన్‌ హాస్పిటల్స్‌
close

Updated : 28/10/2021 15:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Kims - Sunshine: కిమ్స్‌ చేతికి సన్‌షైన్‌ హాస్పిటల్స్‌

రూ.362.78 కోట్లతో 51.07 శాతం వాటా కొనుగోలుకు ఒప్పందం 

 

ఈనాడు, హైదరాబాద్‌: సన్‌షైన్‌ హాస్పిటల్స్‌లో మెజార్టీ వాటాను హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న కిమ్స్‌ హాస్పిటల్స్‌ (కృష్ణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌) సొంతం చేసుకోనుంది. సన్‌షైన్‌ హాస్పిటల్స్‌లో 51.07 శాతం వాటా కొనుగోలు చేయటానికి కిమ్స్‌ హాస్పిటల్స్‌ ఒప్పందం కుదుర్చుకుంది. దీనివల్ల సన్‌షైన్‌ హాస్పిటల్స్‌కు చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్‌ సర్జన్‌ డాక్టర్‌ ఏ.వి.గురవారెడ్డి, ఆయన సహచర వైద్య బృందం, కిమ్స్‌ హాస్పిటల్‌ వైద్యుల బృందంతో కలిసినట్లు అవుతుంది. ఫలితంగా 9 నగరాల్లో 12 ఆసుపత్రులు, 3,666 వైద్య పడకలు, 1200 మంది వైద్యులు, 12,000 మంది ఉద్యోగులతో దేశంలోని అతిపెద్ద వైద్య సేవల సంస్థల్లో కిమ్స్‌ హాస్పిటల్స్‌కు స్థానం లభిస్తుంది.

పదేళ్ల క్రితం ప్రారంభం
సన్‌షైన్‌ హాస్పిటల్స్‌ను (సర్వేజనా హెల్త్‌కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌) దాదాపు పదేళ్ల క్రితం డాక్టర్‌ గురవారెడ్డి స్థాపించారు. స్వల్పకాలంలోనే ఆగ్నేయ ఆసియా దేశాల్లో రెండో అతిపెద్ద ‘జాయింట్‌ రిప్లేస్‌మెంట్‌ సెంటర్‌’ గా దీనికి గుర్తింపు వచ్చింది. సన్‌షైన్‌ ఆసుపత్రుల్లో ఏటా 4,000 కు పైగా మోకీలు ఆపరేషన్లు చేస్తున్నారు. దీనికి సికింద్రాబాద్‌, గచ్చిబౌలి (హైదరాబాద్‌), కరీంనగర్‌లలోని ఆసుపత్రుల్లో మొత్తం 600 వైద్య పడకలు ఉన్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.411 కోట్ల ఆదాయాన్ని, రూ.75 కోట్ల ఆపరేటింగ్‌ లాభాన్ని ఈ సంస్థ నమోదు చేసింది. రూ.730 కోట్ల సంస్థాగత విలువ ప్రకారం సన్‌షైన్‌ హాస్పిటల్స్‌లో 51.07 శాతం వాటాను రూ.362.78 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు కిమ్స్‌ హాస్పిటల్స్‌ వెల్లడించింది. 

తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం
కిమ్స్‌ హాస్పిటల్స్‌ ఎండీ డాక్టర్‌ భాస్కరరావు స్పందిస్తూ సన్‌షైన్‌ హాస్పిటల్స్‌ ద్వారా ఎంతో అనుభవం గల వైద్యులు, వైద్య సిబ్బంది తమతో కలుస్తున్నారని పేర్కొన్నారు. తక్కువ ఖర్చులో నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే తమ లక్ష్యానికి సన్‌షైన్‌ హాస్పిటల్స్‌ సరిగ్గా సరిపోతుందని అన్నారు. కిమ్స్‌ హాస్పిటల్స్‌తో జతకలవడం తమకు సంతోషంగా ఉందని సన్‌షైన్‌ హాస్పిటల్స్‌ ఎండీ డాక్టర్‌ గురవారెడ్డి వివరించారు. తక్కువ ఖర్చులో వైద్య సేవలు అందించే కిమ్స్‌ హాస్పిటల్‌ అంటే తమకు ప్రత్యేక అభిమానం ఉందని అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు నెల్లూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, ఒంగోలు, వైజాగ్‌, అనంతపూర్‌, కర్నూలు నగరాల్లో కిమ్స్‌ ఆస్పత్రులు ఉన్నాయి. కిమ్స్‌ సికింద్రాబాద్‌ ఆసుపత్రి ఒక్కదాన్లోనే 1,000 వైద్య పడకలు ఉన్నాయి.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని