పీఎస్‌బీల్లో ప్రభుత్వ వాటా 26 శాతానికి?
close

Published : 25/11/2021 02:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పీఎస్‌బీల్లో ప్రభుత్వ వాటా 26 శాతానికి?

ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో బిల్లు!
2 బ్యాంకుల ప్రైవేటీకరణకూ

దిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్‌బీలు) ప్రభుత్వ వాటా 51 శాతం నుంచి 26 శాతానికి తగ్గనుందా.. అంటే అవుననే పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇందుకోసం ఉద్దేశించిన బిల్లును ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ బిల్లు ద్వారా 2 పీఎస్‌బీలను ప్రైవేటీకరించాలని అనుకుంటోందనీ చెబుతున్నారు. పీఎస్‌బీల్లో ప్రభుత్వ వాటా తగ్గించుకుంటే, ఆ మేరకు సంస్థాగత, ప్రజా పెట్టుబడులు బ్యాంకుల్లోకి వస్తాయనే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇందుకోసం బ్యాంకింగ్‌ చట్టాలు (సవరణ) బిల్లు 2021ని పార్లమెంటులో ప్రవేశపెట్టాలని చూస్తోంది. 2 పీఎస్‌బీల ప్రైవేటీకరణ కోసం బ్యాంకింగ్‌ కంపెనీస్‌ చట్టాలు 1970, 1980కి, బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టం 1949కి సవరణలు చేయాల్సి ఉంది. ఈ విషయమై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో (ఆర్‌బీఐ) చర్చించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మూలధనం కోసం బ్యాంకులు ప్రభుత్వం మీద ఆధారపడకుండా చూడటంతో పాటు, తమ వాటా తగ్గించుకోవడం ద్వారా వచ్చే నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనేది ప్రభుత్వ అభిమతంగా ఉంది.

మాకు సమాచారం లేదు: ఐఓబీ, సెంట్రల్‌ బ్యాంక్‌: బ్యాంకుల ప్రైవేటీకరణకు సంబంధించి తమకు ఎటువంటి సమాచారం లేదని ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌ (ఐఓబీ), సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చాయి. తమతో ఈ విషయమై ఏ విధమైన సంప్రదింపులు జరగలేదనీ స్పష్టం చేశాయి. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం పీఎస్‌బీల ప్రైవేటీకరణ బిల్లు పెడుతుందని, అందులో ఈ 2 బ్యాంకులు ఉంటాయనే వార్తలు ట్రేడింగ్‌పై ప్రభావం చూపాయి. ఐఓబీ షేరు ఇంట్రాడేలో రూ.23.80 వద్ద గరిష్ఠాన్ని తాకినా, చివరకు 13.10 శాతం లాభంతో రూ.22.45 వద్ద ముగిసింది. సెంట్రల్‌ బ్యాంక్‌ షేరు 10.46 శాతం రాణించి రూ.22.70 దగ్గర స్థిరపడింది.


దేశంలో డిజిటల్‌ బ్యాంకులు

ఈనాడు, దిల్లీ: దేశంలో డిజిటల్‌ పరికరాల వినియోగం విస్తృతమవుతున్న నేపథ్యంలో ‘డిజిటల్‌ బ్యాంకుల ఏర్పాటుకున్న అవకాశాలపై చర్చాపత్రాన్ని’ నీతి ఆయోగ్‌ విడుదల చేసింది. వీటికి లైసెన్సుల జారీ, నియంత్రణ విధానాలను ఇందులో ప్రతిపాదించారు. ఆసక్తి ఉన్నవారు డిసెంబరు 31లోపు సూచనలు, సలహాలు ్చ--్చ౯్న్వజీ-i‘.i- మెయిల్‌కి పంపొచ్చని పేర్కొంది. ‘దేశంలో యూపీఐ లావాదేవీల విలువ గత నెలలోనే రూ.7.7 లక్షల కోట్లకు చేరింది. ఆధార్‌ ధ్రువీకరణలు 55 లక్షల కోట్లను మించాయి. ఈ నేపథ్యంలో భారత్‌కు సొంత డిజిటల్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థ నిర్వహించే సామర్థ్యం ఉందని అర్థమవుతోంది. ఇందుకు నియమ నిబంధనలు, విధానాలు రూపొందిస్తే ఫిన్‌టెక్‌ రంగంలో మన స్థానం మరింత బలోపేతం అవుతుంది’ అని నీతి ఆయోగ్‌ పేర్కొంది. రూ.1-10 లక్షల మేర రుణాలు అవసరమయ్యే ఎంఎస్‌ఎంఈ రంగానికి సంప్రదాయ బ్యాంకింగ్‌ నుంచి తక్కువ ప్రాధాన్యం లభిస్తోందని తెలిపింది. ఈ రంగానికి అవసరమైన దాని కంటే రూ.25.8 లక్షల కోట్ల మేర రుణాలు తక్కువగా అందుతున్నాయని, భవిష్యత్తులో అది రూ.37 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని పేర్కొంది. అందువల్లే ఎంఎస్‌ఎంఈ నిర్వాహకులు, వడ్డీ వ్యాపారుల నుంచి రుణాలు తెచ్చుకుంటున్నారని, ఫలితంగా వారి రుణ చరిత్ర నమోదు కావడం లేదని అభిప్రాయపడింది. వాళ్లు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నా, అవి వ్యక్తిగత రుణ జాబితాలో ఉంటున్నాయని పేర్కొంది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని