ఆర్‌ఐఎల్‌ గ్యాసిఫికేషన్‌ ఆస్తుల బదిలీ
close

Published : 26/11/2021 01:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆర్‌ఐఎల్‌ గ్యాసిఫికేషన్‌ ఆస్తుల బదిలీ

కొత్త అనుబంధ సంస్థగా జామ్‌నగర్‌ సిన్‌గ్యాస్‌ ప్రాజెక్టు

దిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) తన జామ్‌నగర్‌ సిన్‌గ్యాస్‌ ప్రాజెక్టును పూర్తి స్థాయి అనుబంధ కంపెనీకి బదిలీ చేయనుంది. తద్వారా కంపెనీకి మరింత విలువ జత చేయాలని భావిస్తున్నట్లు ఆర్‌ఐఎల్‌ పేర్కొంది. ఇంధన ఉత్పత్తికి వినియోగించే సిన్‌గ్యాస్‌లో హైడ్రోజన్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌, కొంత కార్బన్‌ డయాక్సైడ్‌ మిశ్రమం ఉంటుంది. హైడ్రోకార్బన్‌ ఇంధనాన్ని ద్రవీకృతం చేయడం ద్వారా సిన్‌గ్యాస్‌ను తయారు చేస్తారు. తాజా పరిణామంతో తన ప్రాథమిక ఇంధన వనరులను, పునరుత్పాదక వనరులకు మార్చుకునే యత్నానికి బలం చేకూరినట్లు అవుతుందని ఆర్‌ఐఎల్‌ పేర్కొంది.

ఇవీ ప్రయోజనాలు: ఇంధన సరఫరాలో విశ్వాసాన్ని పెంచి ఇంధన వ్యయాల్లో ఊగిసలాటలను సిన్‌గ్యాస్‌ తగ్గిస్తుంది. జామ్‌నగర్‌ రిఫైనరీలో హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసేందుకు దీనిని వినియోగిస్తారు. హైడ్రోజన్‌ తయారీ ప్రక్రియలో ఉత్పత్తి అయ్యే కార్బన్‌ డయాక్సైడ్‌కు అధిక గాఢత ఉండడంతో సులువుగా బంధించవచ్చు. తద్వారా కార్బన్‌ బంధన వ్యయాలు కూడా తగ్గుతాయి. మొత్తం మీద జామ్‌నగర్‌ కాంప్లెక్స్‌లో కర్బన ఉద్గారాలను భారీగా తగ్గించడానికి ఇది ఉపకరిస్తుంది. సున్నా-కర్బన కంపెనీగా మారాలన్న లక్ష్యానికి చేరువ చేస్తుంది. మరో వైపు, గ్యాసిఫికేషన్‌ ఆస్తుల బదిలీ వల్ల వ్యూహాత్మక భాగస్వాములను ఆకర్షించడం మరింత సులువు అవుతుంది.

ఇలా బదిలీ: గ్యాసిఫికేషన్‌ బదిలీ కోసం కంపెనీ బోర్డు ఒక పథకానికి అనుమతినిచ్చింది. దీనికి అపాయింటెడ్‌ తేదీ మార్చి 31, 2022 లేదా బోర్డు భవిష్యత్‌లో నిర్ణయించే ఇతర తేదీ అవుతుందని కంపెనీ పేర్కొంది. ఈ పథకానికి స్టాక్‌ ఎక్స్ఛేంజీలు, రుణదాతలు, వాటాదార్లు, ఎన్‌సీఎల్‌టీ, ఇతర నియంత్రణ సంస్థల అనుమతులు అవసరం.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని