ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లకు మళ్లీ ఆదరణ
close

Updated : 09/04/2021 09:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లకు మళ్లీ ఆదరణ

దాదాపు ఎనిమిది నెలల విరామం తర్వాత మళ్లీ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఈ ఏడాది మార్చి నెలలో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలోకి రూ.9,115 కోట్ల నికర పెట్టుబడులు వచ్చాయి. మల్టీ క్యాప్‌, వాల్యూ ఫండ్‌ తరగతికి చెందిన పథకాలను మినహాయిస్తే మిగిలిన అన్ని రకాలైన పథకాల్లో మదుపరులు అధికంగా పెట్టుబడులు పెట్టినట్లు యాంఫీ (అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా) వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం స్పష్టమవుతోంది. అంతకు ముందు ఎనిమిది నెలల పాటు ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల నుంచి మదుపరులు పెద్దఎత్తున తమ సొమ్ము వెనక్కి తీసుకున్న విషయం విదితమే. స్టాక్‌మార్కెట్లో ‘కరెక్షన్‌’ చోటుచేసుకోవటం, వచ్చే ఆర్థిక సంవత్సరానికి మనదేశం రెండంకెల వృద్ధి రేటు నమోదు చేస్తుందనే సానుకూల అంచనాలతో మళ్లీ ఈక్విటీ పెట్టుబడులకు మదుపరులు ఆసక్తి చూపిస్తున్నారు.
మరోపక్క మదుపరులు డెట్‌ మ్యూచువల్‌ ఫండ్లకు మొహం చాటేస్తున్నారు. ఈ పథకాల నుంచి గత నెలలో రూ.52,528 కోట్లు వెనక్కి తీసుకున్నారు. అడ్వాన్స్‌ టాక్స్‌ చెల్లింపులు, ఆర్థిక సంవత్సరాంతంలో ఉండే ఇతర అవసరాలు దీనికి కారణమని అంచనా.
ఈక్విటీ పథకాల్లో అత్యధికంగా ఈఎస్‌జీ (ఎన్విరాన్‌మెంటల్‌, సోషల్‌, గవర్నెన్స్‌) వంటి థీమ్యాటిక్‌ పథ]కాలు మదుపరులను అధికంగా ఆకర్షించాయి. గత నెలలో ఇటువంటి పథకాల్లోకి రూ.2,009 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. తర్వాత స్థానంలో ఉన్న ఈఎల్‌ఎస్‌ఎస్‌ (ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌) పథకాల్లోకి రూ.1,552 కోట్లు సమకూరాయి. మిడ్‌ క్యాప్‌ పథకాల్లోకి రూ.1,502 కోట్లు, ఫ్లెక్సి క్యాప్‌ ఫండ్స్‌లో రూ.1,386 కోట్లు లభించాయి.
క్రమానుగత పెట్టుబడులు (సిప్‌) సైతం పెరిగాయి. గత నెలలో సిప్‌ల ద్వారా మ్యూచువల్‌ ఫండ్లలోకి రూ.9,182 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇటీవల కాలంలో ఎన్నడూ ఇంత అధిక మొత్తాల్లో సిప్‌ పెట్టుబడులు రాలేదు. గత ఏడాది మార్చిలో సిప్‌ పెట్టుబడులు రూ.8,941 కోట్లు ఉన్న విషయం గమనార్హం. స్టాక్‌ మార్కెట్లో వివిధ కంపెనీల షేర్ల ధరలు బాగా పెరిగి ఉన్న నేపథ్యంలో మదుపరులు ఎక్కడ పెట్టుబడులు పెట్టాలనేది తేల్చుకోలేక సిప్‌ పెట్టుబడుల వైపు మొగ్గుచూపుతున్నట్లు ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. దేశీయ మ్యూచువల్‌ ఫండ్ల పరిశ్రమ కింద ఉన్న పెట్టుబడుల మొత్తం గత నెలాఖరు నాటికి రూ.31.43 లక్షల కోట్లకు చేరింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని