ఆసుపత్రిలో చేరకున్నా.. పరిహారం...
close

Published : 14/05/2021 05:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆసుపత్రిలో చేరకున్నా.. పరిహారం...

ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్య బీమా పాలసీని అవసరం ఎంతో ఉందనేది తెలిసిందే. అయితే, పాలసీని ఎంచుకునేటప్పుడు కొన్ని నిబంధనలు మనకు అంత తేలిగ్గా అర్థం కావు. కొవిడ్‌ నేపథ్యంలో బీమా సంస్థలూ కొత్త నిబంధనలను తీసుకొస్తున్నాయి. ఆరోగ్య బీమాను ఎంచుకునేటప్పుడు ముఖ్యంగా గమనించాల్సిన రెండు విషయాలున్నాయి.. అవే.. డేకేర్‌; ఓపీడీ.. వాటి గురించి తెలుసుకుందాం..
గతంలో ఆరోగ్య బీమా.. ఆసుపత్రిలో చేరినప్పుడే పరిహారం ఇచ్చేది. మారిన పరిస్థితులు, పోటీ పెరగడంతో కొంతకాలంగా డేకేర్‌ చికిత్స, ఔట్‌ పేషెంట్‌ డిపార్ట్‌మెంట్‌ (ఓపీడీ)లకూ బీమా సంస్థలు బిల్లులు చెల్లిసున్నాయి.

ఒక రోజు చికిత్సలకు..
బీమా పరిభాషలో డేకేర్‌ చికిత్స అంటే.. ఒక రోజులోనే పూర్తయ్యే చికిత్సలు, చిన్న శస్త్రచికిత్సలలాంటివన్నమాట. అంటే... వీటి కోసం ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం ఉండదు. కాబట్టి, 24 గంటల నిబంధన వీటికి వర్తించదు. అయితే, ప్రతి డేకేర్‌ చికిత్సకూ పాలసీలు పరిహారం ఇవ్వకపోవచ్చు. అందుకే, వీటిని తీసుకునేటప్పుడే.. వేటికి పరిహారం లభిస్తుంది. వేటికి మినహాయింపు అనేది చూసుకోవాలి.
ఉదాహరణకు.. కంటి శుక్లాలు, ప్రమాదంలో స్వల్పంగా ఎముక విరగడం, దంతాలు దెబ్బతినడంలాంటివి ఇందులో ఉంటాయి. పాలసీ కోసం సంతకం చేసేటప్పుడు.. ఈ జాబితానూ ఒకసారి పరిశీలించండి.

* డేకేర్‌ చికిత్సలో ఎలాంటి ఉప పరిమితులు సాధారణంగా ఉండవు. ఈ చికిత్సలకు బీమా సంస్థలు కొన్ని నిబంధనల మేరకు బిల్లులను చెల్లిస్తాయి. వీటికి ఆసుపత్రులతో ముందే ఒప్పందం ఉంటుంది.
* పాలసీ తీసుకున్న తర్వాత ఎన్ని రోజులు వేచి ఉండాలన్నదీ పరిశీలించాలి. కొన్ని బీమా సంస్థలు ఏడాది నుంచి మూడేళ్ల వరకూ వేచి ఉన్నాకే డేకేర్‌ చికిత్సలకు అనుమతిస్తారు. ప్రమాదాల విషయంలో ఈ నిబంధన వర్తించదు.
* ఈ చికిత్సలు కాస్త ఖరీదు ఎక్కువే ఉంటాయి. కాబట్టి, మీరు తీసుకునే పాలసీలో గరిష్ఠంగా ఎంత మేరకు ఇస్తారనేదీ తెలుసుకోవాలి.
డాక్టర్‌ను సంప్రదిస్తే..
ఆసుపత్రిలో చేరడం.. డేకేర్‌ చికిత్సలే కాకుండా.. కొన్నిసార్లు డాక్టర్‌ను సంప్రదించి, సాధారణ చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి ఖర్చులనూ భరించేది ఓపీడీ కేర్‌. డాక్టర్‌ ఫీజుల ఖర్చులూ పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు దీని అవసరం పెరిగింది.
*సాధారణంగా ఓపీడీ పరిహారం కోసం 90 రోజుల వరకూ వేచి ఉండాలని నిబంధన ఉంటుంది. ఆ తర్వాతే బీమా సంస్థలు ఓపీడీ బిల్లులు చెల్లిస్తాయి.
* హాస్పిటల్‌ చేరాల్సిన అవసరం లేని, సాధారణ జ్వరాలు, మధుమేహ చికిత్స తదితరాలు దీనికిందకు వస్తాయి. నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో క్యాష్‌లెస్‌ సేవలు, లేదా బిల్లులను తిరిగి పొందే విధంగా ఇది పనిచేస్తుంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని