పిల్లల భవితకు భరోసానిచ్చేలా...
close

Published : 28/05/2021 00:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పిల్లల భవితకు భరోసానిచ్చేలా...

మా స్నేహితుడు ఇటీవల మరణించాడు. అతనికి ఇద్దరు అమ్మాయిలు. వారి వయసు 12, 10 ఏళ్లు. మా మిత్రులం కలిసి వారి పేరుతో రూ.2లక్షలు జమ చేయాలని అనుకుంటున్నాం. సురక్షితంగా ఉంటూ.. వారికి ఉపయోగపడేలా ఎలా మదుపు చేయాలి? - రాజ్‌
* ప్రస్తుత కొవిడ్‌-19 సంక్షోభ సమయంలో.. మీ మిత్రులు చేసిన చేసిన పని అభినందనీయం. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, సురక్షితమైన పెట్టుబడులు ఎంచుకోవాలని అనుకుంటున్నారు కాబట్టి, మీరు పోస్టాఫీసు కిసాన్‌ వికాస్‌ పత్రాల్లో జమ చేయొచ్చు. ఇందులో ప్రస్తుతం 6.9శాతం రాబడి వస్తోంది. పదేళ్ల నాలుగు నెలల్లో డబ్బు రెట్టింపు అవుతుంది. రెండున్నర సంవత్సరాల తర్వాత కావాలనుకుంటే.. డబ్బు వెనక్కి తీసుకోవచ్చు. వారి ఉన్నత చదువులకు ఉపయోగపడేలా ఉండాలి.. అధిక రాబడి రావాలంటే.. డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం ఉత్తమం. కానీ, వీటిలో కాస్త నష్టభయం ఉంటుంది.

నా వయసు 65 ఏళ్లు. నాకు అద్దె ద్వారా ఆదాయం వస్తోంది. ఇందులో నుంచి నెలకు రూ.10వేల వరకూ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయాలని అనుకుంటున్నాను. కాస్త అధిక రాబడి రావాలంటే ఎలాంటి ఫండ్లను ఎంచుకోవాలి? - రామచంద్రం
* అధిక రాబడి రావాలంటే.. నష్టభయం ఉన్న పెట్టుబడి పథకాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. మీరు కనీసం అయిదేళ్ల తర్వాతే ఈ పెట్టుబడిని వెనక్కి తీసుకోవాలనుకుంటే..  హైబ్రీడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లను ఎంచుకోండి. వీటిలో 10-11శాతం వరకూ సగటు వార్షిక రాబడి వచ్చే అవకాశం ఉంది. 11 శాతం రాబడి అంచనాతో.. నెలకు రూ.10వేలు అయిదేళ్లపాటు జమ చేస్తే.. రూ.7,447,336 అయ్యేందుకు అవకాశం ఉంది.

ఇంటి కోసం రూ.30 లక్షల గృహరుణం తీసుకున్నాను. ఇల్లు పూర్తయిన తర్వాత రూ.5 లక్షల వరకూ నా దగ్గర మిగులు మొత్తం ఉంది. దీంతో ఇంటి రుణం తీర్చేయాలా? లేకపోతే ఏదైనా పెట్టుబడి పథకంలో మదుపు చేయడం వల్ల లాభం ఉంటుందా? - మహేందర్‌
* ప్రస్తుతం గృహ రుణం వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. మీరు తీసుకున్న గృహరుణంపైన మీకు పన్ను మినహాయింపు ప్రయోజనాలూ ఉంటాయి. మీరు కనీసం 5-7 సంవత్సరాలు పెట్టుబడి పెట్టి, ఆ తర్వాత గృహరుణానికి పాక్షిక చెల్లింపు చేయొచ్చు. అప్పటి వరకూ మీరు డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయండి. వీటిలో 12-13 శాతం వరకూ రాబడి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మీరు మీ గృహరుణానికి లోన్‌ కవర్‌ టర్మ్‌ పాలసీ తీసుకోకపోతే.. కచ్చితంగా టర్మ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవడం మర్చిపోవద్దు.

నేను ఆన్‌లైన్‌లో రూ.50లక్షల టర్మ్‌ పాలసీ తీసుకున్నాను. ఇప్పుడు ఈ మొత్తాన్ని పెంచుకోవాలని అనుకుంటున్నాను. ప్రీమియం వెనక్కి ఇచ్చే టర్మ్‌ పాలసీలు ఉన్నాయి కదా. కొత్తగా ఇలాంటి పాలసీలను తీసుకోవచ్చా? - కృష్ణ
టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు తీసుకునేటప్పుడు సాధారణ టర్మ్‌ పాలసీలను తీసుకోవడమే ఉత్తమం. సాధారణ టర్మ్‌ పాలసీకన్నా... ప్రీమియం వెనక్కిచ్చే పాలసీలకు ప్రీమియం అధికంగా ఉంటుంది. అధికంగా వసూలు చేసిన ప్రీమియాన్ని బీమా సంస్థలు పెట్టుబడి పెట్టి, వ్యవధి తీరిన తర్వాత వెనక్కి ఇస్తారు. కాబట్టి, రెండు పాలసీల ప్రీమియాన్ని లెక్కించి, వాటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మీరే ఎక్కడైనా మదుపు చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీకు అధిక రాబడి వచ్చేందుకు అవకాశం ఉంటుంది.

- తుమ్మ బాల్‌రాజ్‌


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని