పరిశ్రమకు ప్రోత్సాహం... ఉపాధికి ఊతం!
close

Updated : 18/09/2021 08:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పరిశ్రమకు ప్రోత్సాహం... ఉపాధికి ఊతం!

దేశార్థికాన్ని పట్టాలకు ఎక్కించే మార్గం

దేశంలో ఈ ఏడాది ఒక్క ఆగస్టులోనే 19 లక్షలమంది ఉద్యోగాలు కోల్పోయారని భారత ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షణ సంస్థ(సీఎంఐఈ) తాజా గణాంకాలు చెబుతున్నాయి.  ముఖగా పారిశ్రామిక రంగంలోనే 10 లక్షలమంది ఉపాధి కోల్పోయారు. జులైలో ఇదే రంగంలో ఎనిమిది లక్షలమంది ఉద్యోగాలు పోగొట్టుకొన్నారు. ప్రస్తుతం దేశంలో నిరుద్యోగిత 8.3శాతానికి చేరుకుంది. పారిశ్రామిక రంగ దుస్థితికి కొవిడ్‌ తెచ్చిపెట్టిన ఆర్థిక సంక్షోభం మాత్రమే కారణం కాదు. మహమ్మారి కంటే ముందే ఈ రంగంలో ఉద్యోగాల కల్పన చాలా తక్కువగా ఉండటం- విధానకర్తలను తరచూ ఆందోళనకు గురిచేసేది. 2017-18లో మొత్తం ఉద్యోగాల్లో పారిశ్రామిక రంగం వాటా పది శాతమైతే, 2020-21 కల్లా అది 7.5శాతానికి తగ్గిపోయింది. కొవిడ్‌ విరుచుకుపడ్డాక అనేక భారత పారిశ్రామిక యూనిట్లు మూతపడిపోయాయి. ఆ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు పట్టణాలు వదలి పల్లెబాట పట్టి వ్యవసాయ పనులు వెతుక్కున్నారు. దీంతో సాగు రంగంలో గిరాకీ కన్నా కూలీల సరఫరా ఎక్కువై, వారి వేతనాలు పడిపోయాయి. ఇలా ఉద్యోగ కల్పనలో పారిశ్రామిక రంగ వైఫల్యం వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపైనా ప్రతికూల ప్రభావాన్ని కనబరచింది.

భిన్నమైన ప్రస్థానం

మొదటి నుంచీ భారత పారిశ్రామిక రంగ ప్రస్థానం మిగతా ప్రపంచంకన్నా భిన్నంగా సాగింది. ఇంతవరకు ప్రధాన దేశాలన్నింటిలో వ్యవసాయంలోని మిగులు కార్మికులను పారిశ్రామిక రంగం ఇముడ్చుకుంటూ వస్తోంది. పల్లెల నుంచి పట్టణాలకు కార్మిక వలసలు క్రమంగా పెరగడం, ఆ తరవాత సేవారంగం విజృంభించి, అత్యధికులకు ఉపాధి కల్పించడం రివాజు. అదే సహజ ఆర్థిక పరిణామ క్రమం కూడా. కానీ, భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం వ్యవసాయ రంగం నుంచి నేరుగా సేవారంగానికి లంఘించి, పారిశ్రామిక రంగాన్ని నిర్లక్ష్యం చేసింది. 1995లో భారత జీడీపీకి 18శాతం వాటా సమకూర్చిన పారిశ్రామిక రంగం- నేడు 13శాతమే అందించగలుగుతోందని ప్రపంచ బ్యాంకు లెక్కగట్టింది. ఇతర దేశాల్లో ఇలాంటి తలకిందుల పరిస్థితి లేదు. ఉదాహరణకు చైనా, పొలాల నుంచి కర్మాగారాలకు అత్యధిక శ్రామికులను తరలించి ప్రపంచానికే ఉత్పత్తికేంద్రంగా ఎదిగింది. ఇండియాలో పరిస్థితి దీనికి పూర్తి వ్యతిరేకం. ఇక్కడ 2017-18లో మొత్తం ఉపాధి కల్పనలో 35శాతంగా ఉన్న వ్యవసాయం వాటా 2020-21కల్లా 39.5శాతానికి పెరిగిందని సీఎంఐఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కొవిడ్‌ వల్ల పరిశ్రమలు మూతపడి వ్యవసాయంపై ఒత్తిడి ఎక్కువైంది. ఫలితంగా గ్రామాల్లో ఆదాయాలు పడిపోయి కొనుగోలు శక్తి సన్నగిల్లుతోంది. దీనివల్ల భారత ఆర్థికాభివృద్ధి రేటు కోసుకుపోతోంది. శ్రామికులకు అల్ప ఆదాయాలు సమకూర్చే వ్యవసాయం నుంచి అధిక వేతనాలిచ్చే పారిశ్రామిక రంగానికి పెద్దయెత్తున మళ్ళించడానికి సంస్కరణలు తీసుకురావాలి. పారిశ్రామిక రంగంలో రెండంకెల వృద్ధి రేటును సాధించడానికి కేంద్ర ప్రభుత్వం ‘భారత్‌లో తయారీ’(మేకిన్‌ ఇండియా) విధానాన్ని చేపట్టింది. దీంతోపాటు దేశీయంగా సులువుగా వ్యాపారాలు ప్రారంభించి, వృద్ధి చేయడానికి అనుకూల వాతావరణం కల్పించాలి. కొత్త పెట్టుబడులకు ద్వారాలు తెరవాలి. దేశంలో భౌతిక, సామాజిక మౌలిక వసతులను విస్తరించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలా చేసినప్పుడే పారిశ్రామిక రంగం వృద్ధి పథంలో పరుగులు తీస్తుంది.

నాణ్యతకు పట్టం కట్టాలి...

భారత పారిశ్రామిక రంగం నాణ్యమైన వస్తువుల తయారీలో ఇతర దేశాలకన్నా వెనకబడి ఉంది. అంతర్జాతీయ విపణిలో నాణ్యమైన వస్తువులకు ఎప్పుడూ గిరాకీ ఉంటుంది. దీన్ని చైనా బాగా సొమ్ము చేసుకొంటోంది. అమెరికా, ఐరోపా నాణ్యతా ప్రమాణాలకు దీటైన వస్తువులను అందిస్తూ చైనా పరిశ్రమలు తమ ఎగుమతులను ఇబ్బడిముబ్బడిగా పెంచుకున్నాయి. సహజంగానే ఆ పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు విజృంభించాయి. భారత్‌ ఇకనైనా మేల్కొని దేశమంతటా నాణ్యతా కేంద్రాలను ఏర్పరచాలి. తగిన పెట్టుబడులు, నైపుణ్య శిక్షణ అందించడం ద్వారా ఈ హబ్‌లలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) విరివిగా ఏర్పడటానికి తోడ్పడాలి. నాణ్యతా హబ్‌లలోని పరిశ్రమలు అంతర్జాతీయ ప్రమాణాలతో వస్తువులను తయారుచేసి ఎగుమతులు పెంచుకోవాలి. తద్వారా భారత పారిశ్రామిక రంగ విజృంభణకు ప్రాతిపదికను ఏర్పరచాలి. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించడానికి పెట్టుబడులపైనా, ఇతరత్రా వివిధ రాయితీలు ఇస్తున్నాయి. ఇక నుంచి పరిశ్రమలు ఎంత ఎక్కువగా ఉద్యోగాలు సృష్టిస్తే అంత అధికంగా రాయితీలు అందించాలి. అలాగే నిర్ణీత కాలంలో ఎంత ఎక్కువ ఉత్పత్తిని సాధించాయి, ఎంత నాణ్యమైన వస్తువులను తయారుచేస్తున్నాయి అనే అంశాల ఆధారంగా కూడా రాయితీలు ఇవ్వాలి. పారిశ్రామిక రంగంతో దగ్గరి సంబంధం, సమన్వయం ఉన్న సేవా రంగ సంస్థలకూ ఇలాంటి రాయితీలు అందించవచ్చు. ఈ ప్రోత్సాహక చర్యలతో పారిశ్రామిక రంగాన్ని గొప్ప ఉపాధి కల్పన కేంద్రంగా మలచాలి. వ్యవసాయం నుంచి నేరుగా సేవారంగానికి లంఘించిన భారత ఆర్థిక వ్యవస్థ, మధ్యలో పారిశ్రామిక రంగంలో మజిలీ చేస్తే తప్ప సర్వతోముఖ, సమతుల అభివృద్ధి సాధించలేదు. ఇంతవరకు తలకిందులుగా నడిచిన ప్రగతి రథాన్ని సవ్యంగా పట్టాలెక్కించాలి.


సేద్య, సేవా రంగాల్లో కష్టకాలం

భారతదేశంలోని 98.6 కోట్లమంది యువతీయువకులకు వేగంగా ఉపాధి కల్పించాల్సి ఉంది. దేశ జీడీపీకి 54 శాతం వాటాతోపాటు అత్యధిక ఉద్యోగాలను అందించే సేవారంగమూ కరోనా మహమ్మారి వల్ల తీవ్రంగా దెబ్బతింది. విమానయానం, హోటళ్లు, రెస్టారెంట్లు, వినోదం, పర్యాటక రంగాలు కుదేలవడంతో లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. వీరిలో చాలామంది పల్లెబాట పట్టినందువల్ల వ్యవసాయ రంగంపై ఒత్తిడి పెరగడం తెలిసిందే. తత్ఫలితంగా ఇక సేవా, సేద్య రంగాలు ఇప్పటికన్నా భారీగా ఉపాధి కల్పించే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి. ఉపాధి లోటును భర్తీ చేసే బాధ్యతను పారిశ్రామిక రంగమే చేపట్టాలి. నాణ్యమైన వస్తువులు అందించడం ద్వారా అంతర్జాతీయ విపణిలో పెద్ద వాటా సంపాదించి, లక్షల మందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఈ రంగం ఎదగాలి. అలా ఎదగకుండా అడ్డుపడుతున్న సమస్యలను ప్రభుత్వాలు గుర్తించి సత్వరం తొలగించాలి. పారిశ్రామిక విజృంభణకు విధానపరంగా సరైన చర్యలు తీసుకోవాలి.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని