నిఫ్టీ @ 18000
close

Updated : 12/10/2021 08:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిఫ్టీ @ 18000

28 ట్రేడింగ్‌ రోజుల్లో 1000 పాయింట్లు పైకి

దుమ్మురేపిన వాహన, విద్యుత్‌ షేర్లు

3 రోజుల్లో రూ.5.03 లక్షల కోట్లు పెరిగిన మదుపర్ల సంపద

సరాకు నాలుగురోజుల ముందే స్టాక్‌ మార్కెట్లు మదుపర్లకు పండగ సంతోషాన్ని అందించాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలకు దేశీయ కొనుగోళ్లు తోడవ్వడంతో నిఫ్టీ చరిత్రలోనే తొలిసారిగా 18000 పాయింట్ల శిఖరానికి చేరింది. కేవలం 28 ట్రేడింగ్‌ రోజుల్లోనే సూచీ 1000 పాయింట్ల లాభాన్ని సాధించింది. అయితే గరిష్ఠ స్థాయుల్లో లాభాల స్వీకరణ వల్ల సూచీలు కాస్త వెనక్కి వచ్చి ముగిశాయి. ముఖ్యంగా వాహన, విద్యుత్‌, బ్యాంకింగ్‌ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. చమురు ధరలు దూసుకెళ్లడంతో రూపాయి 15 నెలల కనిష్ఠానికి చేరింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 37 పైసలు తగ్గి 75.36 వద్ద ముగిసింది. సూచీల పరుగులతో మదుపర్ల సంపదగా పేర్కొనే బీఎస్‌ఈలో నమోదిత సంస్థల మార్కెట్‌విలువ గత మూడు రోజుల్లో రూ.5.03 లక్షల కోట్లు పెరిగి రికార్డు గరిష్ఠమైన రూ.267.24 లక్షల కోట్లకు చేరింది.


జోరు సాగిందిలా

ఉదయం నిఫ్టీ 17,867.55 పాయింట్ల వద్ద జోరు మీద ప్రారంభమై, 18,041.95 పాయింట్ల వద్ద తాజా జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. అయితే ఎక్కువసేపు ఉండకుండానే, మళ్లీ 18000 స్థాయి దిగువకు వచ్చేసింది. మధ్యాహ్నం తర్వాత లాభాల స్వీకరణ చోటుచేసుకున్నా, 50.75 పాయింట్ల లాభంతో 17,945.95 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ కూడా 60,476.13 పాయింట్ల వద్ద రికార్డు గరిష్ఠాన్ని నమోదుచేసింది. చివరకు 76.72 పాయింట్లు పెరిగి 60,135.78 దగ్గర స్థిరపడింది. రెండు సూచీలకు ఇదే రికార్డు ముగింపు కావడం గమనార్హం.

* ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఏఎంసీ స్టాక్‌ మార్కెట్‌ అరంగేట్రం నిరుత్సాహపరిచింది. బీఎస్‌ఈలో ఇష్యూ ధరైన రూ.712తో పోలిస్తే అక్కడే స్తబ్దుగా మొదలైంది. ఇంట్రాడేలో రూ.721 వద్ద గరిష్ఠాన్ని, రూ.696 వద్ద కనిష్ఠాన్ని తాకిన షేరు.. చివరకు 1.73 శాతం నష్టంతో రూ.699.65 వద్ద ముగిసింది.


టీసీఎస్‌ సంపద రూ.92,000 కోట్లు ఆవిరి

త్రైమాసిక ఫలితాలు అంచనాల మేరకు లేకపోవడంతో, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) షేరు కుదేలైంది. ఇంట్రాడేలో 7 శాతం కోల్పోయిన షేరు రూ.3660 వద్ద కనిష్ఠానికి చేరింది. చివరకు 6.32 శాతం నష్టంతో రూ.3686.50 వద్ద ముగిసింది. దీంతో కంపెనీ మార్కెట్‌ విలువ రూ.14.55 లక్షల కోట్ల నుంచి రూ.92,032 కోట్లు తగ్గి రూ.13.63 లక్షల కోట్లకు చేరింది.

* స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ సోలార్‌లో 40 శాతం వాటా కొనుగోలు చేస్తున్నట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రకటించడంతో స్టెర్లింగ్‌ షేరు ఇంట్రాడేలో 17 శాతం దూసుకెళ్లి రూ.509 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 5.72 శాతం లాభంతో రూ.459.65 వద్ద ముగిసింది.

* ఈజీఎం నిర్వహించడానికి మద్దతు ఇవ్వాల్సిందిగా జీ వాటాదార్లను ఇన్వెస్కో కోరింది. కంపెనీలో 4 శాతం వాటా ఉన్న వ్యవస్థాపక కుటుంబం, 96 శాతం మదుపర్ల ఖర్చుతో ఎందుకు లబ్ధి పొందాలని ప్రశ్నించింది.


20 పెరిగాయ్‌.. 10 పడ్డాయ్‌

* సెన్సెక్స్‌ 30 షేర్లలో 20 లాభపడ్డాయి. మారుతీ అత్యధికంగా 3.66% పరుగులు తీసింది. పవర్‌గ్రిడ్‌, ఐటీసీ, ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ, ఎం అండ్‌ ఎం, కోటక్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 3.09% వరకు లాభపడ్డాయి.

* టెక్‌ మహీంద్రా 2.76%, ఇన్ఫోసిస్‌ 1.83%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.50%, రిలయన్స్‌ 0.74% మేర నష్టపోయాయి.

* రంగాల వారీ సూచీల్లో యుటిలిటీస్‌, విద్యుత్‌, వాహన, లోహ, స్థిరాస్తి, బ్యాంకింగ్‌ 2.80% వరకు పెరిగాయి. ఐటీ, టెక్‌, టెలికాం, ఇంధన నీరసపడ్డాయి.

* బీఎస్‌ఈలో 1952 షేర్లు లాభాల్లో ముగియగా, 1481 స్క్రిప్‌లు నష్టపోయాయి. 159 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.


నిఫ్టీ విశేషాలు..

* నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) ప్రామాణిక సూచీని నిఫ్టీగా పిలుస్తారు.

* 1996 ఏప్రిల్‌లో ప్రారంభమైంది.

* 13 కీలక రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. 50 ప్రధాన కంపెనీల షేర్లు ఇందులో ఉన్నాయి.

* ప్రపంచంలో అత్యధికంగా ట్రేడయ్యే డెరివేటివ్స్‌ సూచీల్లో నిఫ్టీ ఒకటి.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని