హైదరాబాద్‌లో 9 కోట్ల చ.అ. కార్యాలయ స్థలం
close

Updated : 23/10/2021 09:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హైదరాబాద్‌లో 9 కోట్ల చ.అ. కార్యాలయ స్థలం

ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ కార్యకలాపాల విస్తరణే ప్రధాన కారణం
సీబీఆర్‌ఈ- హైసియా నివేదిక  
ఈనాడు - హైదరాబాద్‌

కార్యాలయ స్థలానికి హైదరాబాద్‌లో అనూహ్య గిరాకీ కొనసాగుతోంది. నగరంలో పూర్తిస్థాయిలో వినియోగానికి అనువుగా ఉన్న కార్యాలయ స్థలం 9 కోట్ల చదరపు అడుగుల మైలురాయిని అధిగమించిందని స్థిరాస్తి కన్సల్టింగ్‌ సేవల సంస్థ సీబీఆర్‌ఈ సౌత్‌ ఏషియా, హైసియా (హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌) సంయుక్తంగా రూపొందించిన నివేదిక తెలిపింది. అయిదేళ్ల వ్యవధిలో హైదరాబాద్‌లో ఆఫీసు స్థలం రెట్టింపు అయినట్లు పేర్కొంది. ఐటీ, ఐటీఈఎస్‌, లైఫ్‌ సైన్సెస్‌, ఎలక్ట్రానిక్స్‌.. తదితర రంగాల కంపెనీలు పెద్దఎత్తున హైదరాబాద్‌లో తమ కార్యాలయాలు ప్రారంభించటంతో ఆఫీసు స్థలానికి గిరాకీ గణనీయంగా పెరిగింది. నైపుణ్యం గల మానవ వనరులు లభించడం, మెరుగైన మౌలిక సదుపాయాలకు తోడు ప్రభుత్వ విధానాలు సానుకూలంగా ఉండటం ఈ వృద్ధికి వీలుకల్పించినట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. వచ్చే మూడేళ్లలో మరో 3 - 3.5 కోట్ల చదరపు అడుగుల ఆఫీసు స్థలం హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

హైబ్రిడ్‌ విధానం స్థిరపడుతుంది
కరోనా ప్రభావం నుంచి కోలుకుంటున్న వివిధ సంస్థలు తమ కార్యాలయాలను తిరిగి ప్రారంభిస్తున్నాయి. సీబీఆర్‌ఈ ఇటీవల నిర్వహించిన ‘ఆసియా-పసిఫిక్‌ ఫ్యూచర్‌ ఆఫ్‌ ఆఫీస్‌ సర్వే’ ప్రకారం దాదాపు 47 శాతం వ్యాపార సంస్థలు తమ సిబ్బందిని ‘ఇంటి నుంచి పని’ చేసేందుకు ఒప్పకుంటూనే, సాధ్యమైనంత మందిని కార్యాలయాలకు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆఫీసు స్థలానికి మళ్లీ గిరాకీ పెరగడానికి ఈ పరిస్థితులు వీలుకల్పిస్తున్నాయి. ఇకపై ఇల్లు- ఆఫీసు నుంచి పని చేసే ‘హైబ్రిడ్‌ వర్క్‌ మోడల్‌’ స్థిరపడుతుందని సీబీఆర్‌ఈ  ఛైర్మన్‌ (భారత్‌, ఆగ్నేయ ఆసియా, మీనా దేశాలు) అంషుమన్‌ మాగజైన్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో మంచి సదుపాయాలు, మానవ వనరుల లభ్యత ఉండటంతో ఇతర నగరాలతో పోల్చితే ఇక్కడ కొత్త సంస్థలు అధికంగా వ్యాపార స్థలాన్ని సొంతం చేసుకుంటున్నట్లు వివరించారు.

సవాళ్లను ఎదుర్కొనే ప్రణాళిక ఉండాలి
భవిష్యత్తులో ‘కరోనా’ మళ్లీ ప్రబలితే, ఏ విధంగా స్పందించాలనే విషయంలో వ్యాపార సంస్థలు స్పష్టమైన వైఖరి, సన్నద్ధతతో ఉండాలని ఈ నివేదిక సూచించింది. ‘హైబ్రిడ్‌ వర్క్‌ మోడల్‌’ మార్గదర్శకాలను రూపొందించుకోవాలని, ఆఫీసు స్థలాన్ని అందుకు వీలుగా సిద్ధం చేసుకోవాలని పేర్కొంది. ఆఫీసు భవనాలు నిర్మించే స్థిరాస్తి సంస్థలు కూడా ఈ మార్పులకు అనుగుణంగా, ముఖ్యంగా ‘హైబ్రిడ్‌ వర్క్‌ మోడల్‌’ కు వీలుగా భవనాలను డిజైన్‌ చేయాలని సూచించింది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని