బ్యాంకుల్లో పెరుగుతున్న‌ బంగారు రుణ బ‌కాయిలు - gold-loans-stress-in-June-quarter
close

Published : 27/07/2021 16:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బ్యాంకుల్లో పెరుగుతున్న‌ బంగారు రుణ బ‌కాయిలు

బ్యాంకుల్లో బంగారు రుణాల బాకీలు పెరుగుతున్నాయి. కోవిడ్ వ్యాప్తి త‌ర్వాత ఉద్యోగ న‌ష్టాలు, జీతాల కోత, అత్య‌వ‌స‌ర ఆరోగ్య ఖ‌ర్చులు పెర‌గ‌డం, మొత్తం మీద‌ ఆర్ధిక వ్య‌వ‌స్థ దెబ్బ‌తిన‌డంతో  బంగారు రుణాలకు బాగా డిమాండ్ పెరిగింది. అలాగే ఆర్థిక ఇబ్బందుల‌తో ఉన్న వినియోగ‌దారులు బంగారం మీద తీసుకున్న రుణాల బ‌కాయిల‌ను బ్యాంకుల‌కు క‌ట్ట‌లేక బంగారాన్ని విడిపించుకోలేక‌పోతున్నారు. ఈ రుణాలు మామూలు రుణాల్లాగే బ్యాంకుల్లో పేరుకుపోతున్నాయి. ఈ జూన్ త్రైమాసికంలో ఐసీఐసీఐ బ్యాంక్‌, ఫెడ‌ర‌ల్ బ్యాంక్‌, కాథ‌లిక్ సిరియ‌న్ బ్యాంక్‌ల‌లో ఈ బంగారు రుణ బ‌కాయిలు ఎక్కువ‌య్యాయి. కోవిడ్-19ను దృష్టిలో ఉంచుకుని ఐసీఐసీఐ బ్యాంక్ బంగారు రుణ ఖాతాదారుల‌కు రుణాన్ని తిరిగి చెల్లించ‌డానికి అద‌నంగా ఎక్కువ స‌మ‌యం ఇచ్చింది.

బంగారు రుణాల‌లో ఎక్కువ భాగం తిరిగి వ‌స్తుంది. కాని లాక్‌డౌన్ కార‌ణంగా  ఏప్రిల్, మే నెల‌ల్లో రుణ బ‌కాయిలు స‌క్ర‌మంగా జ‌ర‌గ‌లేదు. ఇంకా కోవిడ్ స‌మ‌స్య తీర‌క‌పోవ‌డంతో రుణ బ‌కాయిలు వ‌సూలుకు ఫీల్డ్‌లో తిర‌గ‌డం కూడా బ్యాంకుల‌కు స‌మ‌స్య అయింది. ఫెడ‌ర‌ల్ బ్యాంక్ నిరర్ధ‌క ఆస్తులు జూన్ త్రైమాసికంలో రూ. 640 కోట్ల‌కు పెరిగాయి. అంత‌కు ముందు త్రైమాసికంలో రూ. 598 కోట్లు. ఇందులో  రూ. 35 కోట్ల రుణ బ‌కాయిల‌ను మొండి బ‌కాయిలుగా (ఎన్‌పీఏ)లుగా గుర్తించారు.

కేర‌ళ‌కు చెందిన `సీఎస్‌బీ` బ్యాంక్ మొద‌టి త్రైమాసికంలో రూ. 435 కోట్ల రుణ బ‌కాయిలు చూపించింది. ఇందులో రూ. 337 కోట్లు బంగారు రుణ ఖాతాల నుండి వ‌చ్చాయి. ఈ బ్యాంక్ బంగారు రుణాల బ‌కాయిల‌ కోసం ప్ర‌త్యేక రిక‌వ‌రీ బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. 2021 మొద‌టి అర్ధ‌బాగంలో బంగారు రుణ విభాగం నుండి మొండి బ‌కాయిదారులను ఒత్తిడి పెంచ‌డానికి బంగారం వేలం కూడా జ‌రిగింది. 2020-21 చివ‌రి త్రైమాసికంలో రికార్డు స్థాయిలో 1 ట‌న్ను, రూ. 404 కోట్ల బంగారాన్ని వేలం వేసిన‌ట్లు `మ‌న‌ప్పురం ఫైనాన్స్` తెలిపింది. ఈ టైమ్‌లో రుణం ఇచ్చిన సంస్థ‌లు బంగారాన్ని అతి త‌క్కువ ధ‌ర‌ల‌కు వేలం వేయ‌వ‌ల‌సి వ‌చ్చింద‌ని తెలిపాయి.

అయితే బ్యాంకుల బంగారు రుణ విభాగంలో ఒత్తిడి మ‌రో 2 త్రైమాసికాల వ‌ర‌కు ఉంటుంద‌ని, గ‌త ఏడాది ఇచ్చిన రుణాల్లో ఎక్కువ భాగం మెచ్యూరిటి కోసం వ‌స్తుంద‌ని తెలిపారు. బంగారం ధ‌ర‌లు పెర‌గ‌డంతో బ్యాంక‌ర్లు ధీమాగా ఉన్న‌ప్ప‌టికీ.. రుణ చెల్లింపులు వేగం పెర‌గాల‌ని వారు భావిస్తున్నారు. ప్ర‌జ‌లు త‌మ స్వ‌ల్ప‌కాలిక అవ‌స‌రాల‌కు లేదా వ్యాపార కార్య‌క‌లాపాల కొన‌సాగింపు కోసం ఈ రుణాలు తీసుకున్నారు. ఆర్‌బీఐ గ‌ణాంకాల ప్ర‌కారం, బంగారు రుణాలు 2021 మార్చి 31 నాటికి రెట్టింపు పెరిగి రూ. 60,464 కోట్ల‌కు చేరుకున్నాయి. అంత‌కు ముందు ఏడాది ఈ రుణాలు రూ. 26,192 కోట్లు మాత్ర‌మే.

ఎస్‌బీఐలో బంగారు రుణాల వ్యాపారం దాదాపు 6 రెట్లు పెరిగింది. మార్చి 31 నాటికి రూ. 20,987 కోట్లుగా ఉంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని