close

Published : 20/01/2021 17:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ప్రభుత్వ రంగ బ్యాంకులకు మరింత రుణశక్తి

ఇంటర్నెట్‌డెస్క్‌: కొవిడ్‌ కారణంగా బ్యాంకుల్లో ఎన్‌పీఏలు గణనీయంగా పెరిగే ప్రమాదం ఉందని పలు నివేదికలు ఇప్పటికే ప్రకటించాయి. ఇప్పటికే తీవ్రమైన మొండిబకాయిలతో అవస్థలు పడుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఇది నిజంగా  పిడుగుపాటే. దీంతో మోదీ సర్కారు ఈ సారి వీటికి  అండగా నిలబడే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు బలహీనపడితే ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ప్రైవేటు బ్యాంకులతో పోలిస్తే వ్యవసాయ రంగం వంటి వాటికి రుణాలను పీఎస్‌బీలే అధికంగా సమకూరుస్తాయి. ఇది దేశ ప్రయోజనాలకు చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో మరోసారి ఈ బ్యాంకుల్లోకి మూలధనం చొప్పించే అవకాశం ఉంది. 

ఆర్‌బీఐ హెచ్చరికలు..

గత నెలలో రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్యాంకుల ఆర్థిక పటిష్ఠతపై నివేదికలను విడుదల చేసింది. ఇది  నిజంగా పీఎస్‌బీ (ప్రభుత్వ రంగ బ్యాంకులు)కు ఓ హెచ్చరికే. వీటి మొండిబకాయిలు గత సెప్టెంబర్‌లో 9.7శాతంగా ఉన్నాయి. ఇవి 2021 సెప్టెంబర్‌ నాటికి 16.2శాతానికి చేరతాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో బ్యాంకుల్లో మూలధనం పెంచాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఈ సమస్యను ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఎదుటకు పలు ప్రతిపాదనలు వచ్చాయి. మొండి బకాయిలు, మూలధన అవసరాలు, నిధుల సమీకరణ వంటి అంశాలు వీటిల్లో ఉన్నాయి. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన తర్వాత బ్యాంకులకు మూలధనం సమకూర్చే అంశంపై ప్రభుత్వం తుదినిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. 

గత రెండేళ్లలో..

ప్రభుత్వం అందించే మొత్తం రూ.20వేల కోట్లకు పైగా ఉండొచ్చని అంచనా. కాకపోతే ప్రభుత్వం ఆ తర్వాత వీటిల్లో వాటాలను తగ్గించుకొనేందుకు వీలుగా ఈ ప్రణాళిక ఉండొచ్చు. ఇప్పటికే ప్రభుత్వం గత రెండేళ్లలో సుమారు రూ. 2.65లక్షల కోట్లను పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల్లోకి చొప్పించింది. ఇవి బ్యాంకుల ఆర్థిక పరిస్థితిని పటిష్ఠపర్చడంలో కీలకపాత్ర పోషించింది. తాజాగా కొవిడ్‌ పరిస్థితుల కారణంగా బ్యాంకుల్లో రిటైల్‌ ఎన్‌పీఏల రూపంలో భారీగా ప్రమాదం పొంచి ఉంది. 

‘ఏసియా-పసిఫిక్‌ బ్యాంక్స్‌, కొవిడ్‌-19 క్రైసిస్‌’ పేరిట 2020లో విడుదలైన నివేదిక దేశంలో నిరర్థక ఆస్తుల నిష్పత్తి 1.9 శాతం, రుణ వ్యయ నిష్పత్తి 130 బేసిస్‌ పాయింట్లు పెరగనుందని లెక్కగట్టింది.  ప్రభుత్వాలు పలు రుణాల చెల్లింపు తేదీలను వాయిదా వేయడంతో ప్రస్తుతానికి ఎన్‌పీఏల పెరుగుదల వెంటనే బయటకు రాలేదు. 2021లో బ్యాంకులకు కొవిడ్‌ ఎంత మేరకు నష్టం చేసిందనే అంశంపై స్పష్టత వస్తుంది.

ఇవీ చదవండి..
వృద్ధులకు పన్నుపోటు తప్పేనా..!

‘పల్లెదారి’ పట్టండి..!

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని