LIC IPO: అధీకృత మూలధనంలో భారీ పెంపు! - govt proposes to increase in lics authorised capital significantly
close

Published : 07/03/2021 19:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

LIC IPO: అధీకృత మూలధనంలో భారీ పెంపు!

ప్రతిపాదించిన ప్రభుత్వం

దిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ)ను పబ్లిక్‌ ఇష్యూకు తెచ్చే లక్ష్యంతో ఉన్న కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ అధీకృత మూలధనాన్ని(ఆథరైజ్డ్‌ క్యాపిటల్‌) గణనీయంగా రూ.25 వేల కోట్లకు పెంచాలని ప్రతిపాదించింది. దీంతో రూ.10 ముఖ విలువ కలిగిన 2,500 కోట్ల షేర్లను ఐపీవోలో ఉంచే వీలు కలుగుతుంది. అయితే, నిబంధనల ప్రకారం.. మొత్తం ఒకేసారి ఇష్యూలో ఉంచాల్సిన అవసరం ఏమీ ఉండదు. అవసరాన్ని బట్టి దశలవారీగా 2,500 కోట్ల షేర్లను విక్రయించే వెసులుబాటు కలుగుతుంది. దీనికి బోర్డు అనుమతి తప్పనిసరేం కాదు. ప్రస్తుతం, 29 కోట్లకు పైగా చందాదారులు ఉన్న ఎల్‌ఐసీ పెయిడ్-అప్ క్యాపిటల్ రూ.100 కోట్లుగా ఉంది. 1956లో రూ.ఐదు కోట్ల ప్రారంభ మూలధనంతో మొదలైన ఎల్‌ఐసీకి ప్రస్తుతం రూ.31,96,214.81 కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నాయి.

ఎల్‌ఐసీ చట్టం 1956లో ప్రతిపాదించిన సవరణల ప్రకారం ఎల్ఐసీ అధీకృత వాటా మూలధనం రూ.25 వేల కోట్లుగా ఉండనుంది. ఒక్కో ఈక్విటీ షేరు ముఖ విలువ రూ.10 చొప్పున.. 2,500 కోట్ల షేర్లను విభజించే అవకాశం ఉంటుంది. బడ్జెట్‌ 2021లో ప్రతిపాదించిన సవరణల మేరకు లిస్టింగ్ నిర్వహణ బాధ్యతల్ని చూసుకునేలా స్వతంత్ర డైరెక్టర్లతో కూడిన ఓ బోర్డుని ఏర్పాటు చేస్తారు. మొత్తం 27 సవరణల్ని ప్రతిపాదించారు. లిస్టింగ్‌ తర్వాత తొలి ఐదేళ్ల పాటు సంస్థలో 75 శాతం వాటాలు ప్రభుత్వం చేతిలో ఉంటాయి. ఆ తర్వాత సర్కార్‌ శాశ్వతంగా 51 శాతం వాటాల్ని అట్టిపెట్టుకొని నియంత్రణాధికారాన్ని కలిగి ఉంటుంది. ఇక దీంట్లో చందాదారులకు 10 శాతం వాటాల్ని రిజర్వు చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ గత పార్లమెంటు సమావేశాల్లో వెల్లడించారు.

ఈ ఏప్రిల్‌ 1తో ప్రారంభం కానున్న ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.1.75 లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఎల్‌ఐసీని వచ్చే ఏడాది పబ్లిక్‌ ఇష్యూకు తేనున్నట్లు ప్రకటించింది. ఈ ఇష్యూ ద్వారా దాదాపు రూ.90 వేల కోట్లు ఆర్జించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఎల్‌ఐసీ ఇష్యూకు అడ్డంకిగా ఉన్న కొన్ని చట్టపరమైన సవరణలకు మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ సెబీ శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని