హలో.. మీకు ‘వినపడుతోందా?’ - growth in the wearables market
close

Published : 05/03/2021 13:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హలో.. మీకు ‘వినపడుతోందా?’

వేరబుల్స్‌ మార్కెట్‌లో భారీ వృద్ధి

దిల్లీ: కరోనాతో అందరూ ఇంటిపట్టున ఉండాల్సి రావడం.. ఇంటి నుంచే పనిచేయడం, పిల్లలకు తరగతులు కూడా ఆన్‌లైన్‌లో జరగడంతో, వేరబుల్స్‌ మార్కెట్‌కు గతేడాది ఆదరణ గణనీయంగా పెరిగింది. ఆటంకం లేకుండా కాల్స్‌ వినేందుకు దోహదపడే ఇయర్‌వేర్స్‌ అమ్మకాలు భారీగా పెరిగాయి.  దేశీయ వేరబుల్స్‌ మార్కెట్‌ గతేడాది 144.3 శాతం పెరిగి, 3.64 కోట్ల పరికరాలు విక్రయమయ్యాయి. ఈ మార్కెట్‌లో అగ్రగామిగా ఉన్న తొలి 20 దేశాల్లో భారత్‌ ఒకటే మూడంకెల వృద్ధిని సాధించిందని పరిశోధనా సంస్థ ఐడీసీ అంటోంది. అంతర్జాతీయంగా అతిపెద్ద మూడో వేరబుల్స్‌ మార్కెట్‌గా భారత్‌ కొనసాగుతోందని పేర్కొంది. ఆ సంస్థ ఇంకా ఏమంటోందంటే..
వైర్‌లెస్‌కు భారీ ఆదరణ
ఇయర్‌వేర్‌ డివైజెస్‌కు ఆదరణ పెరుగుతుండడం, రిస్ట్‌ బాండ్ల నుంచి స్మార్ట్‌వాచీలకు అప్‌గ్రేడ్‌ అవుతుండడంతో గతేడాది అత్యధిక వార్షిక విక్రయాలు నమోదయ్యాయి. అక్టోబరు-డిసెంబరు 2020లో వేరబుల్స్‌ విభాగం అత్యంత భారీ వృద్ధి నమోదు చేసింది. 198.2 శాతం వృద్ధితో 1.52 కోట్ల పరికరాలను అమ్మగలిగారు. ఇక ఆడియో విభాగమైతే వైరు నుంచి వైర్‌లెస్‌కు మారిపోయింది. 2021లో మరింత అత్యాధునిక పరికరాలకు ప్రజలు మారొచ్చు. రోజువారీ వ్యాయామం, నిద్ర వంటివి చూసుకుంటూ, ఆరోగ్యాన్ని సంరక్షించుకునేందుకు స్మార్ట్‌వాచీలను ఎక్కువమంది కొంటున్నారు. 
బోట్‌.. రాణిస్తోంది
ఇయర్‌వేర్‌ డివైజ్‌ అమ్మకాలు మూడింతలు పెరిగి 3.04 కోట్లకు చేరుకున్నాయి. పరికరాల ధరలు అందుబాటులో ఉండటం, వర్చువల్‌ సమావేశాలు, ఇ-లెర్నింగ్‌ అవసరాలు పెరగడం ఇందుకు కారణం. ట్రూలీ వైర్‌లెస్‌ స్టీరియో(టీడబ్ల్యూఎస్‌) పరికరాల అమ్మకాలు పదింతలై 1.13 కోట్లకు చేరాయి. గతేడాది మొత్తం వేరబుల్‌ మార్కెట్లో ఇయర్‌వేర్‌ విభాగమే 83.6 శాతంగా ఉండడం గమనార్హం.   అమ్మకాల్లో మూడింట ఒక వంతు వాటాను బోట్‌ కంపెనీ సాధించింది. జేబీఎల్, హర్మాన్‌ కర్డాన్, ఇన్‌ఫినిటీ బ్రాండ్లతో శాంసంగ్‌ 14.5 శాతం మార్కెట్‌ వాటాతో రెండో స్థానంలో ఉంది. డిసెంబరు త్రైమాసికంలో ఇయర్‌వేర్‌ విభాగం 300% వృద్ధితో 1.29 కోట్ల యూనిట్లను అమ్మింది. 
రిస్ట్‌ బ్యాండ్లు వెనకబడుతున్నాయ్‌
స్మార్ట్‌వాచీల అమ్మకాలు తొలిసారిగా 10 లక్షల అమ్మకాల మైలురాయిని అధిగమించాయి. అక్టోబరు-డిసెంబరు 2020లో 13 లక్షల మేర పంపిణీ చేయగలిగారు. నాయిస్‌ కలర్‌ఫిట్‌ ప్రొ-2, రియల్‌మి వాచ్, యాపిల్‌ సిరీస్‌ 6, అమేజ్‌ఫిట్‌ నుంచి కొత్త ఆవిష్కరణలు ఎక్కువ వృద్ధిని నమోదు చేశాయి. గతేడాది స్మార్ట్‌వాచీలు 139.3% వృద్ధితో 26 లక్షలు విక్రయమయ్యాయి. రిస్ట్‌బాండ్ల ధరలోనే ఇవి వస్తుండడం ఇందుకు కారణం. ఫలితంగా  రిస్ట్‌బ్యాండ్‌ అమ్మకాలు గతేడాది మొత్తం మీద 34.3% క్షీణించి 33 లక్షలకు పరిమితమయ్యాయి. నాలుగో త్రైమాసికంలో ఈ విభాగం 39% తగ్గి 8 లక్షలకు చేరాయి.

 

ఇవీ చదవండి..

నెలకు  రూ.8వేలు  రావాలంటే...
ఆదాయపు పన్ను.. చేయొద్దు పొరపాట్లు..


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని