పాఠాలు నేర్చారా..! - heres what the education sector expects from govt
close

Published : 29/01/2021 22:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాఠాలు నేర్చారా..!

కొవిడ్‌ దెబ్బకు మారిన విద్యావ్యవస్థ
డిజిటల్‌ వైపు మొగ్గేనా..

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

కరోనావైరస్‌ దెబ్బకు ఎక్కువగా దెబ్బతిన్న వాటిల్లో విద్యావ్యవస్థ ఒకటి. దేశంలోని చాలా ప్రాంతాల్లో దాదాపు 10 నెలల నుంచి పాఠశాలలు మూతపడి ఉన్నాయి. డిజిటల్‌ క్లాసు‌లు జరుగుతున్నా.. అందరికీ అవి అందుబాటులోకి రాలేదు. ప్రభుత్వం వైరస్‌ తీవ్రతను ఈ స్థాయిలో అంచనావేయలేకపోవడంతో ముందస్తు సన్నద్ధత అవకాశం లభించలేదు. ఇప్పటికైనా మించి పోయింది లేదు. దేశంలో డిజిటల్‌ విద్యా వ్యవస్థను బలపర్చి ఈ ఏడాది వ్యాక్సినేషన్‌తో సంబంధం లేకుండా తరగతులను కొనసాగించవచ్చు. అంతేకాదు.. కొవిడ్‌ సృష్టించిన ఆర్థిక విధ్వంసం పలు సవాళ్లను సృష్టించింది.

ఆర్థిక ఒత్తిళ్లు..

దేశంలో వ్యాపారాలు దెబ్బతినడం.. కూలీలు వలస పోవడంతో చాలా మందికి ఉపాధి, ఉద్యోగాలు దెబ్బతిన్నాయి. 2020 సంవత్సరంలోనే దాదాపు 10 మిలియన్ల ఉద్యోగాలు పోయాయి. చాలా మంది మధ్య తరగతి, పేద వర్గాల ప్రజలు ఉపాధి కోల్పోయారు. వారు ఆయా పాఠశాలల్లో తమ పిల్లలకు ఫీజులు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొంది. మరోపక్క దాదాపు ఏడాదిగా పాఠశాలలు కూడా మూతపడి ఉండటంతో యాజమాన్యాలు ఫీజులు రానిదే జీతాలు చెల్లించలేని పరిస్థితి.  2021-22 బడ్జెట్‌లో పాఠశాలలు, విద్యా సంస్థలకు వివిధ రకాల పన్ను మినహాయింపులు ఇవ్వాలి. ఇవి వాటికి కొంత ఆర్థిక ఉపశమనం కలిగిస్తాయి.

డిజిటలైజేషన్‌కు ఊతం..

కొవిడ్‌తో బోధనా శైలి పూర్తిగా మారిపోయింది. చాలా స్కూళ్లు, ఎడ్యూటెక్‌ సంస్థలు ఆన్‌లైన్‌ బోధన వైపు మళ్లాయి. ముఖ్యంగా బోధన, పరీక్షల నిర్వహణకు అవసరమైన సౌకర్యాలను ఏర్పటు చేసుకొన్నాయి. చాలా సంస్థలు ఇన్ఫర్మేషన్‌, కమ్యూనికేషన్‌ టెక్నాలజీ, ఇతర మౌలిక సదుపాయాలపై వెచ్చించాయి. ఇవన్నీ జీఎస్‌టీ పరిధిలోకి వస్తాయి.  ప్రస్తుతం స్కూల్స్‌, ఎడ్యూటెక్‌ కంపెనీలు 18శాతం జీఎస్‌టీ పరిధిలో ఉన్నాయి. ఈ మొత్తం విద్యార్థులకు భారంగా మారుతుంది. ప్రభుత్వం దీనికి కనీసం 5శాతానికి తగ్గించినా చాలా మంది విద్యార్థులపై భారం తగ్గుతుంది.

ఇటీవల కాలంలో విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాలలు కంప్యూటర్లు, కెమేరాలు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, సాఫ్ట్‌వేర్లు వంటి ఐటీ మౌలిక వసతుల కోసం భారీ మొత్తంలో వెచ్చించారు. ప్రభుత్వం విద్యకు అవసరమైన కీలక వనరులను చౌకగా విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకోవాలి.

గ్రామీణ విద్యార్థులకు ఊతం..

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో  ఐటీ మౌలిక వసతులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. నగరాల్లోని విద్యార్థుల పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా.. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల పరిస్థితి ఇబ్బంది కరంగా ఉంది. నగర, గ్రామీణ ప్రాంతాల మధ్య ఈ తేడాకు కేవలం టెక్నాలజీనే కారణం. ఈ సారి బడ్జెట్‌లో గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలు డిజిటల్‌ ఎడ్యూకేషన్‌ అందించేలా ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. దీనికి అవసరమైన కేటాయింపులు కూడా జరగాలి.  కంప్యూటర్లు, టాబ్లెట్లు ఇతర ఐటీ పరికరాలను కొనుగోలు చేయలేని ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులందరికీ పాఠశాలల నుంచి వీటిని అందుబాటులోకి తీసుకురావాలి.

ప్రభుత్వం వద్ద టీచర్లకు కొదవలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే మంచి ఆన్‌లైన్‌ ఎడ్యూకేషన్‌ వేదికను సిద్ధం చేసి అన్ని రకాల విద్యార్థులకు అవకాశం కల్పించాలి. 1968 నాటి కొఠారి కమిషన్‌  చెప్పినట్లు విద్యాశాఖపై వ్యయాలను పెంచాలి. వాస్తవానికి నిధుల రూపంలో చూస్తే ఏటా వ్యయాలు పెరుగుతున్నాయి.. కానీ, జీడీపీలో వాటా రూపంలో చూస్తే మాత్రం వ్యయాలు తగ్గుతున్నాయి.  అంతేకాదు ఎడ్యూటెక్‌లో పరిశోధనలను కూడా ప్రభుత్వం ప్రోత్సహించాలి. ఇది తర్వాతి తరాలకు ప్రయోజనకరంగా ఉంటుంది.

ఇదీ చదవండి

బడ్జెట్‌ సంజీవని అవుతుందా?

నేటి నుంచే బడ్జెట్‌ పర్వం


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని