ఎగబాకిన రుణాలు.. కోతకు గురైన పొదుపులు - household debt soars savings plunge
close

Published : 21/03/2021 20:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎగబాకిన రుణాలు.. కోతకు గురైన పొదుపులు

కుటుంబాల ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం

ముంబయి: ఏడాది పాటు విజృంభించిన కరోనా భారత్‌లో అనేక కుటుంబాలను రుణ ఊబిలోకి నెట్టింది. పొదుపులో కోత పెట్టింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో దేశంలో వ్యక్తిగత అవసరాల కోసం కుటుంబాలు తీసుకున్న రుణాలు జీడీపీలో 37.1 శాతానికి చేరినట్లు తాజాగా విడుదలైన ‘రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ)’ గణాంకాలు వెల్లడించాయి. పొదుపు 10.4 శాతం తగ్గినట్లు తెలిపాయి. కరోనా సంక్షోభంలో లక్షలాది మంది ఉపాధి కోల్పోయిన విషయం తెలిసిందే. అలాగే అనేక మంది ఉద్యోగుల వేతనాల్లో సంస్థలు భారీ కోతలు విధించాయి. దీంతో అవసరాల నిమిత్తం అప్పులు చేయడం లేదా పొదుపు చేసిన సొమ్మును వాడుకోవాల్సి వచ్చింది.

మొత్తం రుణ మార్కెట్‌లో రెండో త్రైమాసికంలో కుటుంబ రుణాల వాటా 130 బేసిస్‌ పాయింట్లు పెరిగి 51.5 శాతానికి చేరినట్లు ఆర్‌బీఐ గణాంకాలు తెలిపాయి. కరోనా తొలినాళ్లలో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించడంతో ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కుటుంబాల పొదుపు 21 శాతానికి పెరిగింది. కానీ, కరోనా ప్రభావం దీర్ఘకాలం కొనసాగి ఆదాయాలు పడిపోవడంతో ఆ పొదుపును వాడుకోవాల్సి వచ్చింది. దీంతో రెండో త్రైమాసికంలో కుటుంబాల పొదుపు 10.4 శాతానికి పడిపోయింది. అయితే 2019-10 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంతో పోలిస్తే ఇది ఎక్కువే కావడం గమనార్హం. అయితే, మూడో త్రైమాసికంలో పొదుపు మరింత పడిపోయే అవకాశం ఉందని ఆర్‌బీఐలోని నిపుణులు అభిప్రాయపడ్డారు. కరోనా ఆంక్షలు తొలగిపోవడం, వస్తువులకు గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు భారీ ఎత్తున ఖర్చు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని.. దీనివల్ల పొదుపు మరింత పడిపోయే అవకాశం ఉందని తెలిపారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని