జీవిత బీమా పాల‌సీ ప్రీమియం త‌గ్గించుకోవ‌డం ఎలా? - how-you-can-save-premium-cost-on-life-insurance-policy-purchase
close

Published : 28/01/2021 12:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జీవిత బీమా పాల‌సీ ప్రీమియం త‌గ్గించుకోవ‌డం ఎలా?

జీవిత బీమాను ఎంచుకునేప్పుడు అధిక శాతం ప్ర‌జ‌లు ఆలోచించేది ప్రీమియం గురించే.  ఇది వ్య‌క్తి సంపాద‌న‌, ఖ‌ర్చు పెట్ట‌గ‌ల సామ‌ర్ధ్యం త‌దిత‌ర అంశాల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. త‌క్కువ ప్రీమియంతో అధిక హామీ మొత్తం పొందే పాల‌సీల గురించి చాలా మంది చూస్తుంటారు. ప్రీమియం చెల్లింపును ఆదా చేసేందుకు ప్ర‌య‌త్నించ‌డం స‌హ‌జ‌మే అయిన‌ప్ప‌టికీ, దీని ప్ర‌భావం క‌వ‌రేజ్‌పై ప‌డ‌కుండా చూసుకోవ‌డం కూడా ముఖ్యమే. రాజీ ప‌డితే బీమా ప‌థ‌కం ముఖ్య ఉద్దేశ్యం నెర‌వేర‌క‌పోవ‌చ్చు. 

సంపాదించే వ్య‌క్తి కుటుంబానికి దూర‌మైతే, అత‌ని/ ఆమెపై ఆధార‌ప‌డిన ఇత‌ర స‌భ్యుల భ‌విష్య‌త్తుకు జీవిత బీమా ఆర్థికంగా భ‌రోసా క‌ల్పిస్తుంది.  అందువ‌ల్ల బీమా ప్ర‌యోజ‌నాల‌పై ఎటువంటి ప్ర‌భావం ప‌డ‌కుండా, ఖ‌ర్చును ఎలా త‌గ్గించుకోవాలో తెలియ‌లాంటే బీమా సంస్థ‌లు ఎటువంటి అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ప్రీమియంను నిర్ణ‌యిస్తాయ‌నేది అర్ధం చేసుకోవాలి. 

ఆర్థిక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొనేందుకు బీమా ఒక కీల‌క సాధ‌నం. రిస్క్ అనేది అందిరికీ ఒకేలా ఉండ‌దు. ఒక వ్య‌క్తి సామాజిక ఆర్ధిక స్థితిగ‌తులు, అవ‌స‌రాలు, ప్రొఫైల్ త‌దిత‌ర అంశాల‌పై ఇది ఆధార‌ప‌డి ఉంటుంది. స‌ర‌ళంగా చెప్పాలంటే యుక్త వ‌య‌సులో ఉన్న వ్య‌క్తి వృద్యాప్యంలో ఉన్న వ్య‌క్తి  ఇరువురూ ఒకే హామీ మొత్తానికి పాల‌సీ తీసుకున్న‌ప్ప‌టికీ, యుక్త వ‌య‌సులో ఉన్న వ్య‌క్తి చెల్లించాల్సిన ప్రీమియం త‌క్కువ‌గా ఉంటుంది.  ఇందుకు కార‌ణం రిస్క్ త‌క్కువగా ఉండ‌డ‌మే.   

ఒకే వ‌య‌సులో ఉన్న ఇద్ద‌రు వ్య‌క్తులు ఒకే హామీ మొత్తానికి పాల‌సీ తీసుకున్న‌ప్ప‌టికీ వారు చెల్లించ‌వ‌ల‌సిన ప్రీమియంలో కూడా తేడాలు ఉండొచ్చు. ఇది వారు నివ‌సించే ప్ర‌దేశం, ఆరోగ్య ప‌రిస్థితులు, సంపాద‌నా సామ‌ర్ధ్యం వంటి అంశాల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు రిస్క్ ఒకే విధంగా ఉన్న‌ప్పిటికీ మ‌హిళ‌లకు త‌క్కువ ప్రీమియం వ‌సూలు చేయోచ్చని నిపుణులు చెబుతున్నారు. 

ప్ర‌స్తుతం ఉన్న ఆరోగ్య స్థితి, జీవ‌న శైలి అల‌వాట్లు కూడా ప్రీమియం నిర్ణ‌యంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. దీనితో పాటు పాల‌సీ ఎంచుకునే విధానం కూడా ప్రీమియంను ప్ర‌భావితం చేస్తుంది. ఉదాహ‌ర‌ణ‌కు కొంత మంది తాము చెల్లించిన ప్రీమియం(క్యాపిట‌ల్‌) తిరిగి ఆశిస్తారు. మ‌రి కొంద‌రు స్వ‌ల్ప కాలం పాటు ప్రీమియం చెల్లించి, దీర్ఘ‌కాలం క‌వ‌రేజ్ పొందాల‌నుకుంటారు. 

అందువల్ల, వ్య‌క్తి వయస్సు, జెండ‌ర్‌, ఆరోగ్య పరిస్థితులు, ఎంత కాలం ప్రీమియం చెల్లిస్తారు, ఎంత కాలానికి పాలసీ, ఏ ర‌కం పాల‌సీ ఎంచుకుంటున్నారు వంటి అంశాల‌పై ప్రీమియం ఆధార‌ప‌డి ఉంటుంది. అయితే, ఈ కింద వివ‌రించిన‌ ఐదు అంశాలను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని జీవిత బీమా పాల‌సీని కొనుగోలు చేస్తే ప్రీమియంను ఆదా చేసుకోవ‌డంతో పాటు అధిక క‌వ‌రేజ్‌ను పొంద‌వ‌చ్చు. 

జీవిత బీమా ప్రీమియం ఆదా చేసుకునే మార్గాలు:

1. చిన్న వ‌య‌సులోనే ప్రారంభించండి:
జీవిత బీమా పాల‌సీని చిన్న వ‌య‌సులో ప్రారంభించ‌డం మంచిది. 28-30 సంవ‌త్స‌రాల వ‌య‌సులో పాల‌సీ తీసుకోవ‌డం వ‌ల్ల ప్రీమియం పాకెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది.  వ‌య‌సు పెరిగే కొద్ది కుటుంబ భాద్య‌తులతో పాటు ఖ‌ర్చులు కూడా పెర‌గ‌డంతో ప్రీమియం చెల్లింపులు భారం అయ్యే అవ‌కాశం ఉంది.  వ‌య‌సు ఎక్కువైతే, పాల‌సీ ప్రీమియం కూడా ఎక్కువ‌గానే ఉంటుంది.  త‌క్కువ ప్రీమియంతో జీవిత బీమా ప్ర‌యోజ‌నాల‌ను పొందేంద‌కు సంద‌పాద‌న ప్రారంభ‌మైన తొలినాళ్ల‌లోనే ట‌ర్మ్ జీవిత బీమాను కొనుగోలు చేయ‌డం మంచిద‌ని పాల‌సీబ‌జార్‌.కామ్ చీఫ్ బిజినెస్ అధికారి సంతోష్ అగ‌ర్వాల్ తెలిపారు. 

2. ట‌ర్మ్ జీవిత బీమా:
మొత్తం పెట్టుబ‌డి ఫోర్ట్‌ఫోలియోలో ముఖ్యంగా ఉండాల్సిన సాధ‌నం ట‌ర్మ్ జీవిత బీమా. ఇది మీరు లేన‌ప్పుడు మీ కుటుంబానికి ఆర్థికంగా అండ‌గా ఉంటుంది. స్వ‌చ్ఛ‌మైన జీవిత బీమాలో త‌క్కువ ప్రీమియంలో ఎక్కువ హామీ మొత్తాన్ని పొంద‌వ‌చ్చు. అయితే ఇందులో మెచ్యూరిటీ ప్ర‌యోజ‌నం ఉండ‌దు. పాల‌సీ చేసిన వ్య‌క్తి మ‌ర‌ణిస్తే, నామినీకి లేదా అత‌ని కుటుంబ స‌భ్యుల‌ను హామీ మొత్తాన్ని అంద‌జేస్తారు. క్లిష్ట‌మైన అనారోగ్యాలు, ప్ర‌మాదాలు వంటి వాటి కోసం రైడ‌ర్ల‌ను తీసుకుని క‌వ‌రేజ్‌ను మ‌రితంగా మెరుగుప‌రచుకోవ‌చ్చు. ప్రీమియంను చెల్లించ గ‌లిగితే ఇటువంటి ప్లాన్లు ఎక్కువ కాలం క‌వ‌ర్ చేస్తాయి. 

35 సంవ‌త్స‌రాల వ్య‌క్తి, అత‌ని వార్షిక ఆదాయానికి 10 నుంచి 15 రెట్లు అధికంగా హామీ మొత్తం ఉండేలా ట‌ర్మ్ పాల‌సీ ఎంచుకోవాలి. బీమా చేసిన వ్య‌క్తి లేన‌ప్పుడు కుంటుంబ‌లో అన్ని ఆర్థిక అవ‌స‌రాల‌కు ఈ మొత్తం స‌రిపోతుందని నిపుణులు చెబుతున్నారు. 

3. కాల‌వ్య‌‌వ‌ధి:
స‌రైన పాల‌సీ ఎంచుకోవ‌డం మాత్ర‌మే కాదు, ఎంత కాలానికి తీసుకోవాలి అనేది ముఖ్య‌మే. ఇది మీ పాల‌సీ ప్రీమియం ధ‌ర‌ను ఆదాచేసేందుకు స‌హాయ‌ప‌డుతుంది.  త‌క్కువ కాలవ్య‌వ‌ధితో పాల‌సీ తీసుకుంటే మీ భాద్య‌త‌లు, అవ‌స‌రాల‌ను నెర‌వేర‌డానికంటే ముందే పాల‌సీ ముగిసిపోతుంది. దీంతో మీరు పాల‌సీ తీసుకున్న ఉద్దేశ్యం నెర‌వేరదు‌. అలాగే ఎక్కువ కాలానికి పాల‌సీ తీసుకుంటే ప్రీమియం ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. 

ఎంత కాలానికి తీసుకోవాలి?
ఇందుకోసం మీ ద్ర‌వ్య నిక‌ర విలువ‌ను చెక్ చేసుకోవాలి. అంటే మీ పెట్టుబ‌డుల‌పై వ‌చ్చే రాబ‌డి నుంచి అవ‌స‌రాలు, ఖ‌ర్చులు మొద‌లైన వాటిని తీసివేయ‌గా మిగిలిన మొత్తం మీరు ఎంచుకున్న‌ జీవిత బీమా కంటే ఎక్కువ ఉన్న‌ప్పుడు పాల‌సీని కొన‌సాగించివ‌ల‌సిన అవ‌స‌రం లేదు. 

ఉదాహరణకు, ఇటివ‌లి కాలంలో ట‌ర్మ్ జీవిత బీమా పాల‌సీలు 40 సంవ‌త్స‌రాల పాటు క‌వ‌ర్ చేస్తున్నాయి. ఒక వ్య‌క్తి ఇంత కాలం పాటు భాద్య‌త‌లు నిర్వ‌హించ‌డం క‌ష్టం. 40 సంవ‌త్స‌రాల పాటు ట‌ర్మ్ పాల‌సీని కొన‌సాగించ‌డం కంటే వారి ప‌ద‌వీ విర‌మ‌ణ కాలం అంటే 60-65 సంవ‌త్స‌రాలు వ‌చ్చే వ‌ర‌కు కొన‌సాగించడం మంచిది. అంటే ఒక వ్య‌క్తి 40 సంవ‌త్స‌రాల వ‌య‌సులో ట‌ర్మ్ పాల‌సీని తీసుకుంటే 20 సంవ‌త్స‌రాలు పాలసీని కొనసాగించాలి. 

4. పోల్చి చూడండి:
ప్రీమియం, హామీ మొత్తం, ఫీచర్లు వంటి అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని బీమా పథకాలను పోల్చవచ్చు. వీటితో పాటు జీవిత బీమా పాల‌సీలో ‘క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో’ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందువ‌ల్ల‌ వేర్వేరు బీమా సంస్థల క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో త‌ప్ప‌కుండా పోల్చి చూడాలి. బీమా సంస్థ‌లు మొత్తంగా ఎన్ని క్లెయిమ్‌ల‌ను తీసుకున్నాయి అందులో ఎన్ని క్లెయిమ్‌ల‌ను సెటిల్‌చేశాయి. ఎంత మొత్తాన్ని క్లెయిమ్ రూపంలో చెల్లించాయి అనే విష‌యాల‌కు సంబంధించిన పూర్తి స‌మాచారం తెలుసుకోవాలి.

ఉదాహరణకు, ఒక బీమా సంస్థ క్లెయిమ్‌ సెటిల్మెంట్ రేషియో 91 శాతం ఉంటే, ఆ బీమా సంస్థ ఆర్థిక సంవత్సరంలో 100 క్లెయిమ్‌లలో 91 చెల్లించింది, మిగిలిన తొమ్మిది క్లెయిమ్‌లు తిర‌స్క‌రించారు అని అర్ధం. క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో ఎక్కువ ఉన్న బీమా సంస్థ‌ను ఎంచుకోవ‌డం మంచిది.

5. అన‌వ‌స‌రం లేక‌పోతే రైడ‌ర్ల జోలికి పోవ‌ద్దు:

జీవిత బీమా పాలసీని కొనుగోలు చేసేప్పుడు, అనేక‌ రైడర్లు సరసమైన ధరలకే అందుబాటులో ఉంటాయి. ట‌ర్మ్ పాల‌సీకి అనుబంధంగా వ‌చ్చే దాన్ని ట‌ర్మ్ ఇన్సురెన్స్ రైడ‌ర్ అంటారు. ఇది ప్ర‌ధానంగా ఇచ్చే డెత్ బెనిఫిట్ కాకుండా అద‌న‌పు క‌వ‌రేజ్‌ను అందిస్తుంది.  

ఉదాహ‌ర‌ణ‌కు, ఒక వ్య‌క్తి ట‌ర్మ్ పాల‌సీతో పాటు యాక్సిడెంటెల్ డెత్ బెనిఫిట్ రైడ‌ర్‌ను కొనుగోలు చేశాడ‌నుకుందాం. అత‌ను ప్ర‌మాద‌వ‌శాత్తు మ‌ర‌ణిస్తే, బేసిక్ హామీతో పాటు అద‌నపు మొత్తాన్ని ఇస్తారు. అస‌లు ట‌ర్మ్ బీమా హామీ మొత్తం ఆధారంగా రైడ‌ర్‌కు  చెల్లించ‌వ‌ల‌సిన‌ అద‌నపు హామీ మొత్తాన్ని లెక్కించి ల‌బ్ధిదారునికి చెల్లిస్తారు. 

సాధార‌ణంగా ఎంచుకున్న ట‌ర్మ్ ప్లాన్, ప్రీమియం, బీమాసంస్థ‌ల‌‌ను అనుస‌రించి రైడ‌ర్ ధ‌ర మారుతుంటుంది. అందువ‌ల్ల‌ రైడ‌ర్‌ల‌ను తీసుకునేముందు బీమా సంస్థ వ‌సూలు చేసే ప్రీమియంకు త‌గిన‌ అదనపు ప్రయోజనాలు అందుతున్నాయో లేదో తెలుసుకోవ‌డం చాలా ముఖ్యం. అన్ని యాడ్-ఆన్‌లు / రైడర్‌ల సంబంధించిన నియ‌మ నిబంధ‌న‌ల ప‌త్రాన్ని జాగ్ర‌త్త‌గా చ‌ద‌వాలి. ఇవి ఒక్కో బీమా సంస్థ‌కు ఒక్కో విధంగా ఉంటాయి.

పైన తెలిపిన అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని జీవిత బీమా పాల‌సీని కొనుగోలు చేస్తే, త‌క్కువ ప్రీమియంతో ఎక్కువ హామీ మొత్తాన్ని పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.  


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని