అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ తీర్పుపై భారత్ ‘సవాల్’‌? - india to appeal against cairn arbitration award
close

Published : 19/02/2021 21:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ తీర్పుపై భారత్ ‘సవాల్’‌?

కెయిర్న్‌ ఎనర్జీ చెందిన రెట్రోస్పెక్టివ్‌ కేసులో

దిల్లీ : కెయిర్న్‌ ఎనర్జీ రెట్రోస్పెక్టివ్‌ (పాత తేదీల నుంచి విధించే) పన్ను వివాదం కేసులో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టు వెలువరించిన తీర్పుని సవాల్‌ చేసేందుకు భారత ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. పన్ను విధించడం ఆయా దేశాల సార్వభౌమ హక్కు కిందకు వస్తుందని.. దీన్ని ప్రశ్నించే అధికారం ఎవరికీ ఉండదని వాదించేందుకు యోచిస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. భారత్‌ చేయబోయే ఈ వాదనను ఆర్బిట్రేషన్‌ కోర్టు సైతం ప్రశ్నించబోదని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కెయిర్న్ ఎనర్జీ వివిధ అంతర్జాతీయ కోర్టుల్లో వేసిన పిటిషన్లను సైతం సమర్థంగా ఎదుర్కోనుందని సమాచారం. ఈ వివాదానికి ముగింపు పలికేలా కెయిర్న్‌ ఎనర్జీ ఏదైనా పరిష్కారం కోరితే.. అది భారత ప్రభుత్వ ప్రస్తుత చట్టాలకు లోబడే ఉండాలని కేంద్రం వాదించనున్నట్లు తెలుస్తోంది.

హేగ్‌లోని అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం (ఆర్బిట్రేషన్‌ కోర్టు) ఆదేశాల మేరకు తమకు భారత ప్రభుత్వం నుంచి 1.2 బిలియన్‌ డాలర్లను ఇప్పించాలని కోరుతూ కెయిర్న్‌ ఎనర్జీ అమెరికాలోని ఓ న్యాయస్థానంలో కేసు దాఖలు చేసింది. ఆర్బిట్రేషన్‌ తీర్పును గుర్తిస్తూ చక్రవడ్డీతో సహా పరిహారాన్ని ఇప్పించాలని అమెరికా సహా యూకే, నెదర్లాండ్స్‌లో పిటిషన్లు దాఖలు చేసింది. సొమ్ము చెల్లించకపోతే ఆయా దేశాల్లో ఉన్న భారత ఆస్తులను సీజ్‌ చేయించి మరీ వసూలు చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే భారత ప్రభుత్వానికి విదేశాల్లో ఉన్న ఆస్తులను కెయిర్న్‌ ఎనర్జీ గుర్తించినట్లు తెలుస్తోంది. వీటిల్లో బ్యాంక్‌ ఖాతాలు, ఎయిర్‌ ఇండియా విమానాలు, భారతీయ నౌకలు వంటివి ఉన్నట్లు సమాచారం. మరోవైపు కేంద్రం ఆర్థిక కార్యదర్శి అజయ్‌ భూషణ్‌ పాండే, ఇతర ముఖ్య అధికారులతో కెయిర్న్‌ ఎనర్జీ పీఎల్‌సీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సైమన్‌ ధామ్సన్‌ ఇటీవల భేటీ అయ్యారు. సీబీడీటీ ఛైర్మన్‌ పీసీ మోదీ, ఇతర పన్ను అధికారులతో సైతం సైమన్‌ విడిగా సమావేశమయ్యారు. పన్ను వివాదం త్వరలోనే పరిష్కారం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంతలోనే భారత ప్రభుత్వం నుంచి తీర్పుని సవాల్‌ చేయాలన్న నిర్ణయం వెలువడే అవకాశం ఉండడం గమనార్హం.

ఇదీ కేసు నేపథ్యం...

2006లో కంపెనీ అంతర్గత పునర్‌వ్యవస్థీకరణ సమాచారాన్ని కోరుతూ కేంద్ర ప్రభుత్వ పన్నుల విభాగం కెయిర్న్‌‌ ఎనర్జీకి నోటీసులు జారీ చేసింది. వాటిని పరిశీలించిన అనంతరం 2015లో రూ.10,247 కోట్ల పన్నులు చెల్లించాలని కోరింది. పునర్‌వ్యవస్థీకరణ వల్ల వచ్చిన మూలధన రాబడిపై ఈ మేరకు పన్ను చెల్లించాలని తెలిపింది. ఇదిలా ఉండగా.. 2010-11లో కెయిర్న్‌‌ ఎనర్జీ భారత్‌లోని తన అనుబంధ సంస్థ ‘కెయిర్న్‌‌ ఇండియా’ను వేదాంతకు విక్రయించింది. ఈ క్రమంలో వేదాంతలో ప్రిఫరెన్షియల్‌ షేర్లతో పాటు ఐదు శాతం వాటాలను ఇచ్చారు.

దీంతో వేదాంతలోని ఐదు శాతం కెయిర్న్‌‌ ఎనర్జీ షేర్లను భారత ప్రభుత్వం అటాచ్‌ చేసింది. అలాగే రూ.1,140 కోట్ల డివిడెండ్లు, రూ.1,590 కోట్ల ట్యాక్స్‌ రీఫండ్‌ను నిలిపివేసింది. తదనంతరం తమకు రావాల్సిన పన్ను వసూలు కోసం అటాచ్‌ చేసిన వేదాంత షేర్లను విక్రయించింది. దీంతో బ్రిటన్‌‌-భారత్‌ ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం(బీఐటీ) కింద ఈ నోటీసులను సవాలు చేస్తూ కెయిర్న్‌ ఎనర్జీ ఆర్బిట్రేషన్‌ను ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన ఆర్బిట్రేషన్‌ ట్రైబ్యునల్‌ ద్వైపాక్షిక పెట్టుబడి పరిరక్షణ ఒప్పందాన్ని పన్ను నోటీసులు ఉల్లంఘించాయంటూ తీర్పునిచ్చింది. అలాగే నిలిపివేసిన డివిడెంట్లు, ట్యాక్స్ రీఫండ్‌, షేర్ల విక్రయం వల్ల వాటిల్లిన నష్టం నేపథ్యంలో తిరిగి భారత ప్రభుత్వమే కెయిర్న్‌‌ ఎనర్జీకి రూ.7,600 కోట్లు చెల్లించాలని ఆదేశించింది.

ఇవీ చదవండి..

ఆరోగ్య ధీమా.. ఇలా...

మల్టీ క్యాప్‌..ఫ్లెక్సీ క్యాప్‌..పెట్టుబడికి ఏది మేలు?


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని