2020లో పసిడి మెరవలేదు - indias gold demand down 35 pc to 446 tonne in 2020
close

Published : 28/01/2021 19:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

2020లో పసిడి మెరవలేదు

35శాతం తగ్గిన గిరాకీ

ముంబయి: ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా మహమ్మారి అనేక వ్యవస్థలను అతలాకుతలం చేసింది. కొవిడ్‌ కారణంగా ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించడంతో అనేక పరిశ్రమలు దెబ్బతిన్నాయి. కొనుగోళ్లు లేక ఎన్నో వ్యాపారాలు వెలవెలబోయాయి. ఇక నెలల పాటు పెళ్లిళ్లు, శుభకార్యాలు లేకపోవడంతో దేశంలో పసిడి గిరాకీ కూడా తగ్గింది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 2020లో భారత్‌లో బంగారానికి 35శాతం డిమాండ్‌ పడిపోయినట్లు ప్రపంచ స్వర్ణ మండలి(డబ్ల్యూజీసీ) వెల్లడించింది. 

గతేడాదికి గానూ.. గోల్డ్‌ డిమాండ్‌ ట్రెండ్స్‌ నివేదికను డబ్ల్యూజీసీ గురువారం విడుదల చేసింది. దీని ప్రకారం.. 2019లో దేశంలో 690.4 టన్నుల బంగారం అమ్ముడవగా.. 2020లో గిరాకీ 35.34శాతం తగ్గి 446.4 టన్నులుగా నమోదైంది. నగదు రూపంలో చూస్తే.. 2019లో రూ. 2,17,770కోట్ల పుత్తడి విక్రయమవ్వగా.. గతేడాది ఈ విలువ 14శాతం తగ్గి రూ. 1,88,280కోట్లుగా ఉంది. నగల గిరాకీ 42శాతం తగ్గి 315.9 టన్నులుగా నమోదైంది. 

దేశీయ పసిడి దిగుమతులు కూడా భారీగా తగ్గాయి. 2019లో 646.8 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకోగా.. గతేడాది ఈ సంఖ్య 344.2 టన్నులుగా ఉంది. అయితే గతేడాది చివర్లో లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించడం.. సాధారణ కార్యకలాపాలు మళ్లీ గాడిలో పడటంతో ఆఖరి త్రైమాసికంలో దిగుమతులు కాస్త పెరిగాయని డబ్ల్యూజీసీ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ సోమసుందరం తెలిపారు. అక్టోబరు-డిసెంబరులో పండగలు, పెళ్లిళ్లతో బంగారానికి కూడా కొంచెం గిరాకీ పెరిగినట్లు పేర్కొన్నారు. 

అయితే ప్రస్తుతం కొవిడ్‌ పరిస్థితులు చక్కబడుతుండటం, ‘హాల్‌మార్క్‌ తప్పనిసరి’ వంటి ప్రభుత్వ సంస్కరణలతో 2021లో బంగారం పరిశ్రమ మళ్లీ సాధారణ స్థితికి వచ్చే అవకాశముందని అంచనా వేశారు. ‘‘2009లోనూ పసిడికి ఒక్కసారిగా గిరాకీ తగ్గి.. ఆ తర్వాత మళ్లీ పుంజుకుంది. ఇప్పుడు కూడా అదే జరగొచ్చు. అయితే ప్రస్తుతమున్న అధిక పన్నులతో బంగారం స్మగ్లింగ్‌ పెరిగే ప్రమాదముంది. అందువల్ల సహేతుకమైన సుంకాల తగ్గింపులు చేపట్టాల్సిన అవసరముంది. దీంతో పాటు పసిడి రీసైక్లింగ్‌పై పన్ను రాయితీలు ఇవ్వాలి’’అని సోమసుందరం అభిప్రాయపడ్డారు. 

ఇవీ చదవండి.. 

స్టాక్‌ అప్‌డేట్‌: 47వేల మార్కూ పాయె!

బడ్జెట్‌లో ఆదాయపు పన్ను రాయితీలు..!


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని