పుంజుకున్న జపాన్‌ వార్షిక వృద్ధి రేటు - japanese economy sees recovery from pandemic slump
close

Published : 15/02/2021 15:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పుంజుకున్న జపాన్‌ వార్షిక వృద్ధి రేటు

టోక్యో: డిసెంబరుతో ముగిసిన త్రైమాసికం నాటికి జపాన్‌ వార్షిక వృద్ధి రేటు 12.7 శాతానికి పుంజుకుంది. మూడో త్రైమాసికంలో 3 శాతం వృద్ధి నమోదు కావడంతో.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ వరుసగా రెండు త్రైమాసికాల్లో పైకి ఎగబాకింది. కరోనా నేపథ్యంలో అంతకుముందు త్రైమాసికాల్లో జపాన్‌ ఆర్థిక వ్యవస్థ భారీగా కుంగిన విషయం తెలిసిందే. ప్రభుత్వ వ్యయం, ఎగుమతులు, దేశవ్యాప్తంగా వినిమయం పుంజుకోవడం వల్లే వృద్ధి నమోదైందని అధికారులు వెల్లడించారు. మొత్తంగా 2020లో జపాన్‌ వృద్ధి రేటు 4.8 శాతం కుంగింది. గత 11 ఏళ్లలో ఆ దేశ వృద్ధి రేటు క్షీణించడం ఇదే తొలిసారి.

కరోనా సంక్షోభంలోనూ జపాన్‌లో పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ విధించలేదు. ఇంటి నుంచి పని, సామాజిక దూరం పాటించడం వంటి నియమాల్ని ప్రభుత్వం ప్రోత్సహించింది. వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే కఠిన ఆంక్షలు అమలు చేసింది. ఇక ఈ ఏడాది ఆరంభంలో కొత్త రకం కరోనా భయాలతో టోక్యో సహా మరికొన్ని ప్రధాన నగరాల్లో ఎమర్జెన్సీ విధించారు. దీంతో ప్రస్తుత త్రైమాసికంలో మరోసారి వృద్ధి రేటు నెమ్మదించొచ్చని ఆ దేశ ఆర్థిక నిపుణుడు జునిచి మకినో అంచనా వేశారు. అయితే, ప్రపంచదేశాల ఆర్థిక వ్యవస్థలు గాడిలోకి వస్తున్న నేపథ్యంలో జపాన్‌ వృద్ధి రేటుకు దన్ను లభించొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. విస్తృతంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కూడా కలిసివస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

30 ఏళ్ల గరిష్ఠానికి ‘నిక్కీ’ ..

జపాన్‌ వృద్ధి రేటు పుంజుకుంటుండడంతో అక్కడి స్టాక్‌ మార్కెట్‌ సూచీ నిక్కీ 225 భారీగా పుంజుకుంది. దీంతో 30,000 పాయింట్ల మార్క్‌ను దాటి 30 ఏళ్ల గరిష్ఠాన్ని నమోదు చేసింది. 1990 ఆగస్టు తర్వాత సూచీ ఈ స్థాయికి చేరుకోవడం ఇదే తొలిసారి. 2012లో జీవితకాల కనిష్ఠాలకు తాకిన ఈ సూచీ క్రమంగా పుంజుకుంటూ వస్తోంది. కొవిడ్‌ సంక్షోభంతో ఓ దశలో మరోసారి ఒత్తిడికి గురైనప్పటికీ.. క్రమంగా కోలుకొంది. సోమవారం 1.91 శాతం లాభపడ్డ నిక్కీ 30,084 వద్ద స్థిరపడింది. దేశీయంగా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండడంతో పాటు, అంతర్జాతీయంగా మార్కెట్లు సానుకూలంగా కదలాడుతుండడం నిక్కీకి దన్నుగా నిలిచింది.  ఎకనమిక్‌ బబుల్‌ బర్‌స్ట్‌ తర్వాత ఈ స్థాయిలో మార్కెట్లు పుంజుకోవడం ఇదే తొలిసారి. అయినప్పటికీ.. 1989లో రికార్డయిన 38,915.87 మార్క్‌ను చేరుకునేందుకు జపాన్‌ సూచీ మరో 30శాతం ఎగబాకాల్సి ఉంది. 

ఇవీ చదవండి...

పాలసీదార్లకు డిజిటల్‌ పాలసీలు జారీ చేయండి

ఈ ఏడాది వేతనాలు ఎంత పెరగొచ్చంటే..


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని